నిప్పుల వర్షం కురిసే డెత్ వ్యాలీ గురించి తెలిస్తే దడ పుడుతుంది!

ABN , First Publish Date - 2022-04-04T13:10:52+05:30 IST

దేశంలో ఏప్రిల్‌ ప్రారంభంతోనే వేసవి ఎండలు కొత్త రికార్డులు..

నిప్పుల వర్షం కురిసే డెత్ వ్యాలీ గురించి తెలిస్తే దడ పుడుతుంది!

దేశంలో ఏప్రిల్‌ ప్రారంభంతోనే వేసవి ఎండలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వీటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది మన దేశానికి సంబంధించిన విషయం. ప్రపంచంలో అత్యధిక వేడికి పేరుగాంచిన ప్రదేశం ఒకటి ఉంది. దాని పేరు డెత్ వ్యాలీ. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఇక్కడ వేడి గరిష్ట రికార్డులను సృష్టిస్తుంటుంది. ఇప్పుడు డెత్ వ్యాలీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 


బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రత 55 డిగ్రీలకు నమోదవుతుంటుంది. అందుకే డెత్ వ్యాలీ ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాలలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ ప్రదేశంలో చాలాచోట్ల హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. ఉదయం 10 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దు అని స్పష్టంగా రాసి ఉంటుంది. అందుకే ఇక్కడి ప్రజలు మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానేశారు. ఈ సందర్భంగా డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో పనిచేసే బ్రాందీ స్టీవర్ట్ మాట్లాడుతూ  "ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. దీంతో నేను నా సహనాన్ని కోల్పోయాను. ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు చెమట పట్టి అది ఆవిరైపోతుందని’’ తెలిపారు. ఈ లోయకు డెత్ వ్యాలీ అని పేరు పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో బంగారం, వెండి గనులు  కనుగొన్నారు. ఈ పరిశోధన సమయంలో చాలామంది ఈ లోయ గుండా వెళుతున్నప్పుడు తీవ్రమైన వేడి కారణంగా చనిపోయారు. అందుకే ఈ ప్రాంతానికి డెత్ వ్యాలీ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలోని ఉన్న ఎర్రటి రాళ్లు వేడి ప్రభావాన్ని మరింత పెంచుతాయి. ఇంతేకాకుండా ఇక్కడ వార్షిక వర్షపాతం చాలా తక్కువ. 50 మిల్లీమీటర్ల వర్షం కూడా పడని ప్రాంతాలు ఇక్కడ చాలా ఉన్నాయి. 

Updated Date - 2022-04-04T13:10:52+05:30 IST