అప్పుల భోజనం

ABN , First Publish Date - 2021-11-26T05:52:08+05:30 IST

జగనన్న గోరుముద్ద పథకం ఏజెన్సీలకు ప్రభుత్వం ఏ నెల బిల్లు ఆ నెలలో చెల్లించడం లేదు.

అప్పుల భోజనం

  1.  ఏజెన్సీలకు గోరుముద్ద కష్టాలు 
  2.  సీసీహెచ్‌లకు అందని వేతనాలు
  3.  రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు 
  4.  మూడు నెలలుగా పైసా ఇవ్వని ప్రభుత్వం


కర్నూలు-ఆంధ్రజ్యోతి: జగనన్న గోరుముద్ద పథకం ఏజెన్సీలకు ప్రభుత్వం ఏ నెల బిల్లు ఆ నెలలో చెల్లించడం లేదు. దీంతో నిర్వాహకులకు భారంగా మారిపోతోంది. మూడు నెలలుగా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఆ ప్రభావం మధ్యాహ్న భోజనంపై పడే అవకాశం ఉంది. పెరిగిన ధరలతో సాధారణ కుటుంబానికే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అలాంటిది వందలాది మంది విద్యార్థులకు రోజూ భోజనం అందించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని నిర్వాహకులు వాపోతున్నారు.


పెరిగిన ధరలతో ఇబ్బందులు


మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తోంది. గుడ్లు, చిక్కీలను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. నిత్యావసరాలను సీసీహెచ్‌లే కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కూరగాయలు ఏవీ కిలో రూ.40కి తక్కువ రావడం లేదు. పప్పులు, మంచి నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నాణ్యమైన భోజనం అందించాలని చెబుతున్న ప్రభుత్వం, దానికి తగ్గట్లు ఖర్చులు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనం పథకం 2001-02లో మొదలు పెట్టినప్పుడు ఒక్కో విద్యార్థికి దాదాపు రూ.2 చెల్లించేవారు. అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు పొంతనే లేదు. అయినా ప్రస్తుత చెల్లింపులు రూ.5 నుంచి రూ.8 దాటడం లేదు. విద్యార్థుల సంఖ్యను బట్టి గ్యాస్‌ సిలిండర్ల వినియోగం ఉంటుంది. వంట కోసం నెలకు నాలుగైదు సిలిండర్లు వినియోగించే పాఠశాలలు జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి. నిర్వహణ భారం అధికమవడంతో చాలా మంది పథకం నిర్వహణ నుంచి వైదొలగుతున్నారు. 


తరగతిని బట్టి చెల్లింపు


ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4,22,001 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 2,26,630 మంది, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు 1,21,912 మంది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 73,459 మంది ఉన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఒక పూట ఆహారం అందించే కార్యక్రమమే జగనన్న గోరుముద్ద. మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలు, సీసీహెచ్‌లను (కుకింగ్‌ కమ్‌ హెల్పర్లు) నియమించింది. జిల్లా వ్యాప్తంగా 2,720 ఏజెన్సీలు ఉన్నాయి. 7,272 మంది సీసీహెచ్‌లు ఉన్నారు. గుడ్డు, బియ్యం వంటివి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వంట నిర్వహణ బాధ్యత, అందుకయ్యే ఖర్చు ఏజెన్సీలే చూసుకోవాలి. విద్యార్థుల తరగతిని బట్టి ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.4.97,6 నుంచి 10వ తరగతి చదివే వారికి రూ.7.45 ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తుంది. సీసీహెచ్‌లకు రూ.3 వేల గౌరవ వేతనం ఇస్తోంది. ఇందులో రూ.వెయ్యి కేంద్ర ప్రభుత్వం, రూ.2 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయి. 


రూ.కోట్లలో బకాయిలు


వంట నిర్వహణ ఖర్చును ముందుగా ఏజెన్సీలవారు భరించాలి. ఆ తర్వాత బిల్లులు పెట్టుకుంటే ప్రభుత్వం చెల్లిస్తుంది. బిల్లులను ఎప్పటికపుడు చెల్లిస్తే ఏజెన్సీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి బిల్లులు, వేతనాలను ఏజెన్సీలకు, సీసీహెచ్‌లకు చెల్లించడం లేదు. ఆగస్టులో ప్రైమరీ విద్యార్థులకు సంబంధించి రూ.79,61,312 బకాయి ఉంది. 6, 8వ తరగతి విద్యార్థులకు రూ.37,94,217 పెండింగ్‌లో ఉన్నాయి. గౌరవ వేతనం రూ.61,59,000 పెండింగ్‌లో ఉంది. ఆ నెలలో 9,10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన రూ.20,35,455 మాత్రమే విడుదలయ్యాయి. సెప్టెంబరులో ప్రైమరీ విద్యార్థుల భోజన ఖర్చులు రూ.1,72,65,851 పెండింగ్‌ ఉన్నాయి. అప్పర్‌ ప్రైమరీ విద్యార్థులకు సంబంధించి రూ.1,56,84,478 పెండింగ్‌ ఉన్నాయి. ఆ నెలకు సంబంధించి గౌరవ వేతనం రూ.1,33,12,000 పెండింగ్‌లో ఉంది. అక్టోబరుకు సంబంధించి ప్రైమరీ విద్యార్థులకు రూ.1,48,21,493, అప్పర్‌ ప్రైమరీ విద్యార్థులకు సంబంధించి రూ.1,39,53,775, గౌరవ వేతనానికి సంబంధించి రూ.1,24,92,000 పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్ని రూ.కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండడంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. వెంటనే బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు. 


పరిస్థితి మారేనా..?


ఇప్పటి వరకు బిల్లుల చెల్లింపు విధానం సెంట్రలైజ్‌డ్‌గా ఉండేది. బిల్లులను ఎంఈవోలకు పంపిస్తే, అక్కడి నుంచి రాష్ట్ర ఖజానాకు చేరిన తర్వాత చెల్లింపులు జరిగేవి. నవంబరు నుంచి బిల్లులు చెల్లింపు విధానం డీసెంట్రలైజ్‌ అయింది. బిల్లులు చెల్లింపులు ఇక నుంచి సంబంధిత జిల్లా శాఖ నుంచే జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులను ఎవరు చెల్లించినా, నిధులు మాత్రం రాష్ట్ర ఖజానా నుంచి రావాల్సి ఉంటుంది. ఖజానా నుంచి సరిగా నిధులు రావడం లేదని, అలాంటప్పుడు చెల్లింపుల వ్యవహారం మారినా ప్రయోజనం ఏమిటని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.


వెంటనే చెల్లించాలి..


ఆర్థిక భారం, విపరీతమైన శ్రమతో పిల్లలకు భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు, సీసీహెచ్‌లకు ఇన్నేసి నెలలు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడం అన్యాయం. ఇప్పటికే కోట్ల రూపాయల బిల్లులు, వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. నిర్వాహకులు అప్పులు చేయాల్సి వస్తోంది. జీవనాఽ ధారంగా ఉంటుందని భావించిన వారికి ప్రభుత్వ తీరు వల్ల అప్పులు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను చెల్లించాలి.


- నాగేశ్వరరావు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల గౌరవ అధ్యక్షుడు, కర్నూలు


భారం ఎక్కువ..

ప్రభుత్వం తీరుతో రోజు రోజుకూ మా లాంటి వాళ్లకు ఆర్థిక భారం ఎక్కువవుతోంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోతే సరుకులు ఎక్కడ తేవాలి..?నాణ్యమైన భోజనం అందించాలని చెబుతున్న ప్రభుత్వం మెనూ చార్జీలను కూడా పెంచాలి. ప్రభుత్వం చెల్లించే డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలను పెంచాలి. ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. 


- భారతమ్మ, ఏజెన్సీ నిర్వాహకురాలు, కర్నూలు

Updated Date - 2021-11-26T05:52:08+05:30 IST