అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు

ABN , First Publish Date - 2022-05-17T08:58:43+05:30 IST

వ్యవసాయంలో నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో కౌలురైతులే అత్యధికంగా ఉంటున్నారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక బృందం సర్వేలో ఈ విషయం వెలుగులోకి..

అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు

పరపతి లేక.. సాయం అందక.. కౌలురైతుల బలవన్మరణాలు

90 శాతం మందికి లభించని ‘భరోసా’

ఎక్స్‌గ్రేషియాలోనూ మొండిచేయి

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి

మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వ్యవసాయంలో నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో కౌలురైతులే అత్యధికంగా ఉంటున్నారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక బృందం సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14, 15 తేదీల్లో గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 19 గ్రామాల్లో ఈ బృందం రైతుల ఆత్మహత్యలపై సర్వే చేసింది. ఇటీవల బలవన్మరణాలకు పాల్పడిన 22 మంది రైతుల కుటుంబాలను ఈ బృందం కలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది కౌలురైతులేనని గుర్తించింది. వారి బలవన్మరణాలకు కారణాలనూ ఆరా తీసింది. వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులకు వీరెవరికీ బ్యాంకులు, సొసైటీల నుంచి పరపతి దక్కలేదు. దీంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పు తీసుకోక తప్పలేదు. అప్పు చేసి పంటలు సాగు చేసినా విపత్తులు, తెగుళ్లతో కొంత పంట దెబ్బతినడం,  చేతికొచ్చిన పంటకు ధర లేకపోవడం వల్ల అప్పులు తీర్చే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో తనువు చాలించారు. ఈ వివరాలను మృతుల కుటుంబాల నుంచి తెలుసుకుని బృందం సభ్యులూ కంటతడి పెట్టారు. 


7 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏదీ?

విచారకరమైన విషయం ఏంటంటే.. ఏదైనా కష్టం వచ్చి రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే.. రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామంటూ జగన్‌ సర్కార్‌ జారీ చేసిన జీవో 43 ప్రకారం ఈ 22మందిలో ఏ ఒక్కరి కుటుంబానికీ ప్రభుత్వ సాయం అందలేదని బృందం సభ్యులు సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. పైగా ఆర్థిక సాయం, పునరావాస ప్యాకేజీ అందని ఈ కుటుంబాల గోడు విన్న ప్రజాప్రతినిధులు లేకపోవడం గమనార్హం. 


రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి..

నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 2019 జూన్‌ నుంచి 2021 డిసెంబరు నాటికి రాష్ట్రంలో 2,112 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, ఇందులో 718 మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందిందని బృందం గుర్తించింది. రైతుల్ని చేయిపట్టుకుని నడిపిస్తామంటూ పాలకులు ప్రగల్భాలు పలకడమే తప్ప.. కౌలు రైతుల కష్టాలు, కన్నీళ్లను తుడిచే ప్రయత్నమే చేయడం లేదని రూఢీ అయింది. వ్యవసాయంపై మమకారంతో.. అప్పోసొప్పో చేసి ఆరుగాలం శ్రమించి, పంట పండిస్తే.. ప్రకృతి విపత్తులతోనో. చీడపీడలతోనో పంట నష్టపోవడం, లేదా పండిన కొద్ది పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలు కాకూడదని భావించి వైఎస్సార్‌ రైతుభరోసా పేరుతో ఏటా రూ.13,500 పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతు కుటుంబంతో పాటు కౌలు రైతులకూ ఇస్తామన్న జగన్‌ సర్కార్‌..  వాస్తవ కౌలురైతుల్లో 90% మందికి మొండిచేయి చూపుతోంది.


పైగా కౌలుదారులందరికీ బ్యాంకు రుణాలు అందించడం లేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా కౌలు రైతులందరికీ భూ యజమానితో ప్రమేయం లేకుండా సాగుదారు హక్కు పత్రాలు ఇవ్వాలని, బ్యాంకులు, సొసైటీల్లో పంట రుణాలు ఇవ్వాలని, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే, ఆ రైతు కుటుంబానికి రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.  

Updated Date - 2022-05-17T08:58:43+05:30 IST