Advertisement

నవ్యాంధ్రకు అప్పుల కళంకం

Oct 9 2020 @ 00:29AM

వైసీపీ ప్రభుత్వం 16 నెలల నుంచి రాష్ట్రంలో సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క రోడ్డు గాని నిర్మించింది లేదు. ఇసుక కొరతకు తోడు ప్రభుత్వం చేతకానితనం వల్ల నిర్మాణరంగం స్తంభించిపోయి 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌లో తిరిగి వచ్చిన లక్షలాదిమంది వలస కార్మికులకు పనులు లేవు, చేతివృత్తులవారు నిస్సహాయంగా దిక్కులు చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనమైపోవడానికి కారణం దూరదృష్టి, విశాలదృక్పథం, ఆదాయం పెంచుకొనే సామర్థ్యం, సరైన ప్రణాళిక లేకపోవడమే.


నవ్యాంధ్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి అందరినీ కలవరపరుస్తోంది. అసమర్ధ పాలనా నిర్వహణ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందో వైసీపీ ప్రభుత్వం నిరూపించింది. సర్కార్ తప్పుడు విధానాల ఫలితంగా రాష్ట్ర ప్రతిష్ట జాతీయంగా, అంతర్జాతీయంగా‍ దిగజారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చూపించిన నిర్లక్ష్యం, నిర్లిప్తత ఫలితమిది. ఆదాయ వనరులు పెంచడానికి, పాలనావ్యవస్థను గాడిలో పెట్టడానికి, సరికొత్త ప్రణాళికలు రచించి రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి అనువైన విధానాలను రూపొందించకుండా సంకుచిత ధృక్పథంతో రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే రాష్ట్ర ఆర్థిక రంగం ప్రస్తుత దుస్థితిలో కూరుకుపోయింది. ఈ పరిస్థితిని కాగ్‍ నివేదిక కూడా కళ్ళకి కట్టింది.


ఒక ఏడాదిలో చెయ్యాల్సిన అప్పుల్ని ప్రభుత్వం ఈ అర్థిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లోనే చేసేసింది. ఈ అయిదు నెలల్లో వివిధ మార్గాల ద్వారా రూ.84,617.23 కోట్లు. సమీకరిస్తే అందులో అప్పు రూ.47,130కోట్లు అంటే దాదాపు 55.7 శాతం అప్పులే అని కాగ్ తేల్చింది. వివిధ రూపాల్లో ఏడాది మొత్తం మీద రూ.48,295.58 కోట్లు అప్పులు తేనున్నట్లు బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన ప్రభుత్వం ఆగష్టు నెలాఖరు నాటికే రూ.47,130 కోట్లు అప్పులు చేసింది. ప్రతి నెలా చేసిన అప్పు సగటున రూ.9,426 కోట్లు. ఈ లెక్కన సంవత్సరానికి రూ.1,13,112 కోట్లు, అయిదేళ్లలో రూ.5,65,560 కోట్ల అప్పులు చేయబోతోందని తేలుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి రూ.26 వేల కోట్లు మాత్రమే రుణాలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం నాలుగున్నర రెట్లు అధికంగా అప్పులతో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మారుస్తోంది. 


దేశ స్తూల జాతీయ ఉత్పత్తిలో తగ్గుదల ననుసరించి ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపిలో కూడా 24 శాతం తగ్గుదల ఉంటుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర ఏజెన్సీల నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఆ నివేదికల ప్రకారం 2020–-21 ఏడాది ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. [1] జిఎస్‌డీపీ 2019–-20 సంవత్సరానికి రూ.9,72,782 కోట్లు కాగా, ఎస్‌బిఐ అంచనాల ప్రకారం 24 శాతం తగ్గితే, అది 2020–-2021లో రూ.7,19,782 కోట్లు అ‍వుతుంది. ఫలితంగా రాష్ట్ర రాబడులు గణనీయంగా తగ్గిపోనున్నాయి. [2] తలసరి ఆదాయం రూ.40,648కి తగ్గిపోనుంది. ఆదాయం తగ్గడంతో పాటు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యుల జీవితం దుర్భరంగా మారుతుంది. [3] ఆహార ద్రవ్యోల్బణం 9.65 శాతం పెరుగుతుంది. [4] అప్పుల్లో 363 శాతం వృద్ధి ఉంటుంది. 2019లో మొదటి మూడు నెలల్లో రూ. 9,342 కోట్లు అప్పు చేస్తే, 2020–-2021లో అదే కాలానికి అది రూ.33,294 కోట్లకు పెరిగింది. [5] వడ్డీల చెల్లింపు ఐదారు రెట్లు అధికంగా ఉంటుంది. [6] పారిశ్రామిక రంగంలో క్షీణత 10.4 శాతం ఉంటుంది. దీంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు. భవిష్యత్‌లో ఉద్యోగాల కల్పనే కాదు, ఉన్న ఉద్యోగాలు కూడ పోనున్నాయి. [7] సేవారంగంలో క్షీణత 15 శాతం ఉంటుంది. [8] ఉద్యోగాలు, ఉపాధి లేక యువతలో అశాంతి తలెత్తే ప్రమాదముంది. [9] తలసరి రుణం పెరిగిపోతుంది.


ప్రభుత్వంపై పడే భారాన్ని సామాన్యులపై మోపనున్నారు. [1౦] జిఎస్ డిపిలో పన్నుల నిష్పత్తి 2 శాతం తగ్గనుంది. [12] ఎగుమతుల ప్రోత్సాహక ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ 21వ ర్యాంకుకు పడిపోయింది. [13] జిడిపిలో ఆంధ్రప్రదేశ్ వాటా 4 శాతం తగ్గిపోయింది. పరిస్థితి ఇంత క్షీణించినా ఆర్థికవ్యవస్థ ఉద్దీపనకు ఎటువంటి ప్రణాళికలు లేవు. పైగా ప్రజలపై 20వేల కోట్లపైనే పన్నుల భారం మోపారు. రాజకీయ అవసరాలకోసం ప్రకటించిన పథకాలు అమలు చెయ్యడం కోసం దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు. కేవలం అప్పుల మీదే ఆధారపడటం వ్లల రాబోయే రోజుల్లో రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోతుంది. ఇకపై ఎక్కడా అప్పు దొరకని దుస్థితి ఎదురవుతుంది. చివరికి అభివృద్ధి, పేదల సంక్షేమం కుంటుపడటమే గాకుండా రాష్ట్రం దివాలా తీస్తుంది. ప్రభుత్వ ఉదోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. రాబడులు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఆ ఉపద్రవం గురించి ఆలోచించే స్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదు. ఇప్పటికే అభివృద్ధి రేటు రెండంకెల నుంచి ఒక అంకెకి పడిపోయింది. జగన్ తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానానికి తిరోగమన వృద్ధిరేటు తోడైంది. రాష్ట్రంలో నిర్మాణరంగం, పారిశ్రామికరంగం పూర్తిగా పడకేయడంతో ఆదాయం క్షీణించిపోయింది. వ్యాపార పారిశ్రామిక రంగాలు విజృంభిస్తేనే యువతకి ఉద్యోగాలు లభించి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి సృష్టించలేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి విధానం లేదు.


మిషన్ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేయడం మరో దివాలాకోరు చర్య అనే చెప్పాలి. భవిష్యత్‌లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు భూములు లేకుండా చేయడం రాష్ట్రానికి అన్ని విధాలా అనర్ధదాయకమే అవుతుంది. వైసీపీ ప్రభుత్వం 16 నెలల నుంచి రాష్ట్రంలో సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క రోడ్డు గానీ నిర్మించింది లేదు. ఇసుక కొరతకు తోడు ప్రభుత్వం చేతకానితనం వల్ల నిర్మాణరంగం స్తంభించిపోయి 40లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌లో లక్షలాది వలస కార్మికులు ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు తిరిగి వచ్చారు. వారికి పనులు లేవు, చేతివృత్తుల వారు నిస్సహాయంగా దిక్కులు చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా దిగజారి పోవడానికి దూరదృష్టి, విశాల దృక్పథం, ఆదాయం పెంచుకొనే సామర్థ్యం, సరైన ప్రణాళిక లేకపోవడమే. విభజనాంతరం దైన్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం ధైర్యం నింపితే, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ధైర్యంలో నుంచి మళ్ళీ దైన్యంలోకి నెట్టింది. నవ్యాంధ్రలో పరిపాలన ప్రారంభించినప్పుడు ఏమీ లేని రాష్ట్రంలో ఎలా నెగ్గుకువస్తారు అన్నారు అందరు. అయినా గత ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయలేదు. మార్గాలు అన్వేషించింది. అభివృద్ధికి అడుగులు వేసింది. పక్కా ప్రణాళిక సిద్ధం చేసి దానికి అనుగుణంగా చర్యలు ప్రారంభించి అయిదేళ్లలో అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయంగా అద్భుత అవార్డులు సాధించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే.

 

యనమల రామకృష్ణుడు

ప్రతిపక్షనాయకుడు, శాసనమండలి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.