రుణ మాయ!

ABN , First Publish Date - 2022-07-27T08:02:45+05:30 IST

రుణ మాయ!

రుణ మాయ!

తప్పుడు అప్పులకు కేంద్రం అండదండలు

పార్లమెంటు సాక్షిగా అరకొరగా వివరాలు

పబ్లిక్‌ డెట్‌ రూ.3.98 లక్షల కోట్లుగా వెల్లడి

ఆర్బీఐ నుంచి తెచ్చిన 15 వేల కోట్ల లెక్క దాచివేత

కార్పొరేషన్‌ రుణాలు, పెండింగ్‌ బిల్లులు

కలిపితే రూ.8 లక్షల కోట్లకు చేరే రుణభారం

అదంతా రాష్ట్రం అప్పుగానే కేంద్రం స్పష్టీకరణ

లెక్కల దాకా వచ్చేసరికి సగానికే పరిమితం

రుణాలకు అనుమతిలోనూ ప్రత్యేక ప్రేమ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తప్పుడు అప్పులు చేయడం! చేసిన అప్పులను దాచడం! ఎంత చేసినా... రాష్ట్రాన్ని కేంద్రం కాపాడుకుంటూ రావడం! మూడేళ్లుగా ఇదే ముచ్చట! తాజాగా... ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన ఉన్న అప్పు (పబ్లిక్‌ డెట్‌) రూ.3.98 లక్షల కోట్లని కేంద్రం జారీ చేసిన ప్రకటనలోనూ తప్పే! నిజానికి... పబ్లిక్‌ డెట్‌ రూ.4.13 లక్షల కోట్లు! రూ.15వేల కోట్ల లెక్క దాచేసి, 3.98 లక్షల కోట్లుగా చూపించారు. ‘పబ్లిక్‌ డెట్‌’ అంటే ఆర్‌బీఐ నుంచి ప్రతి మంగళవారం తెచ్చే అప్పులు, నాబార్డు నుంచి, కేంద్రం నుంచి తీసుకునే లోన్లు, ఈఏపీ లోన్లు మాత్రమే! ఆర్‌బీఐ దగ్గర ఏ వారానికి ఆ వారం ఠంచనుగా నమోదయ్యే అప్పుల్లో రూ.15వేల కోట్లను రాష్ట్రం దాచేసింది. ఆ లెక్కలనే కాగ్‌కు పంపి 2021-22 ఏడాదికి ప్రాథమిక నివేదిక తయారు చేయించుకుంది. దానినే కేంద్రం వల్లెవేసింది.  సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాల ‘పబ్లిక్‌ డెట్‌’ లెక్కలు మాత్రమే చెప్పారు. కార్పొరేషన్ల పేరుతో, ఇతర మార్గాల్లో తెచ్చిన బడ్జెటేతర అప్పుల వివరాలు చెప్పే వీలున్నా... ఏపీలాంటి ‘మిత్ర’ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టకుండా దాచేసినట్లు అర్థమవుతోంది. కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పులు, జగన్‌ సర్కార్‌ చేసిన దొంగ అప్పులు కలిపి రూ.2,25,836 లక్షల కోట్లు ఉంటాయి.  ఇవి కాకుండా పెండింగ్‌ బిల్లులు రూ.లక్షన్నర కోట్లు ఉంటాయి. రాష్ట్ర అప్పుల్లోకి వీటినీ కలపాల్సిందే. అంటే... ఏపీ నెత్తిన ఉన్న మొత్తం అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుంది. ఇదీ అసలు విషయం. ఇవన్నీ బయటపెట్టకుండా కేవలం ప్రతి మంగళవారం తెచ్చే అప్పుల గురించి మాత్రమే చెబుతూ,  తామేదో తక్కువ అప్పులు చేశామని సొంత మీడియా ద్వారా జగన్‌ సర్కారు ప్రజలను మభ్యపెడుతోంది. అసలు విషయమేమిటంటే... రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుడు అప్పుల గురించి కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది. అయినా సరే... చూసీ చూడనట్లు వదిలేస్తోంది. కేంద్రం చేస్తున్న హెచ్చరికలకు, అమలు చేస్తున్న విధానాలకూ మధ్య పొంతనే లేదు. జగన్‌ సర్కారు మొదట కార్పొరేషన్లకు భారీగా గ్యారెంటీలు ఇచ్చి అప్పులు చేసింది. ఆ తర్వాత కొత్తగా పన్నులు, సెస్‌లు వేస్తూ కార్పొరేషన్ల ద్వారా భారీగా అప్పులు చేసింది. ఈ ఆర్థిక అక్రమాలపై కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. అవి అక్రమాలేనంటూ కేంద్రం జగన్‌ సర్కారుకు హెచ్చరికల లేఖలూ పంపింది. అయినప్పటికీ మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ... జగన్‌ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ కేవలం రూ.23,303 కోట్ల అప్పులే చేసిందని చెప్పడం విశేషం. అప్పుల విషయంలో కేంద్రం జగన్‌ సర్కారుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.4,390 కోట్ల అప్పు తెచ్చింది. అప్పటికింకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులకు అనుమతివ్వనేలేదు. అయినాసరే జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే కేంద్రం ప్రత్యేకమైన అనుమతిచ్చింది. రాష్ర్టాల అప్పులకు కేంద్రం మే నెలలో అనుమతి ఇచ్చింది. తొలుత ఏపీకి రూ.28,000 కోట్లకు అనుమతి వచ్చింది. ఆ తర్వాత దాన్ని రూ.44,574 కోట్లకు పెంచింది. అంతకుముందు తప్పుడు విధానాల్లో చేసిన అప్పులను... కొత్త పరిమితి నుంచి మినహాయించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. కేవలం రూ.771 కోట్లు మాత్రమే మినహాయించి... రుణ పరిమితిని రూ.43,803 కోట్లుగా నిర్ణయించింది. ఇంకో రూ.2,000 కోట్లు నాబార్డు నుంచి తెచ్చుకునేందుకు ప్రత్యేకంగా అనుమతిచ్చారు. ఇదెందుకు ఇచ్చారో కేంద్రానికే తెలియాలి. నాబార్డు రుణాలు కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోకే వస్తాయి. అయినా సరే...2వేల కోట్లకు అదనపు అనుమతి ఇవ్వడం గమనార్హం.


మరో రూ.2,000 కోట్ల అప్పు

మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని జగన్‌ సర్కార్‌ ఇంకో రూ.2,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇందులో రూ.1,000 కోట్లపై 7.79 శాతం, ఇంకో రూ.1000 కోట్లపై 8.04 శాతం వడ్డీ అమలైంది. దీంతో ఏప్రిల్‌ నుంచి జూలై 26వ తేదీ వరకు సర్కార్‌చేసిన అప్పులు 39,603 కోట్లకు చేరాయి.

Updated Date - 2022-07-27T08:02:45+05:30 IST