జగన్‌ పాలన అవినీతి మయం

ABN , First Publish Date - 2021-03-06T09:29:34+05:30 IST

గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చే యడం వల్ల నేడు ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తోందంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన ప్రకటన అవాస్తమని

జగన్‌ పాలన అవినీతి మయం

బుగ్గన ప్రకటన పూర్తిగా అవాస్తవం: టీడీపీ నేత యనమల ఆగ్రహం


అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చే యడం వల్ల నేడు ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తోందంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన ప్రకటన అవాస్తమని ఆర్థికశాఖ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన పిట్టకథలు చెబుతున్నారని విమర్శించారు. కరోనా వల్ల రాబడులు తగ్గాయనేది కూడా వాస్తవం కాదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కువ రెవెన్యూ రాబడు లు వచ్చాయనేది అక్షర సత్యమని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘60 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేసి, అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసింది. 20 నెలల్లో జగన్‌రెడ్డి రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి ఏమీ చేయలేకపోయారు. వైసీపీ సంక్షేమం మోసకారి సంక్షేమమే. కంటికి తెలియకుండా కాటుక కొట్టేయడమే. 20 నెలల్లో తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, ధరల పెంపుతో ఒక్కో కుటుంబంపై రూ.2.5 లక్షల భారం మోపారు. ప్రభుత్వ నిధులు, సహజ వనరుల దోపిడీతో రూ.లక్ష కోట్లు జగన్‌రెడ్డితో పాటు వైసీపీ నేతలు మేసేశారు. మితిమీరిన అవినీతి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కాగ్‌ రిపోర్టు, ఎస్టీసీ నివేదికల ప్రకారం.. చంద్రబాబు, జగన్‌ హయాంలో రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడులు, చేసిన అప్పులు, ఇతర రాష్ట్రాల్లో అప్పులు, రాబడుల వివరాల్లో చాలా తేడా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.  


20 నెలల్లో జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు(రూ.కోట్లలో)

2019-20లో చేసిన(బడ్జెటరీ) అప్పు 46,503.21

2020-21 జనవరి వరకు చేసిన అప్పు 73,912.91

వివిధ కార్పొరేషన్ల(బడ్జెటేతర) అప్పు 34,650

మొత్తం అప్పులు 1,55,066.12



2018-19లో చంద్రబాబు హయాంలో రెవెన్యూ రాబడి రూ.74,912 కోట్లు 

2019-20లో జగన్‌ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రాబడి రూ.85,987 కోట్లు

2020-21 జవవరి వరకు రెవెన్యూ రాబడి రూ.88,238 కోట్లు



Updated Date - 2021-03-06T09:29:34+05:30 IST