ఆలస్యంతోనే అగ్గి రాజుకుందా..?

ABN , First Publish Date - 2022-06-19T14:56:07+05:30 IST

సికింద్రాబాద్‌.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ప్రాంతం. అగ్నిపథ్‌ నిర్ణయానికి నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో యువత

ఆలస్యంతోనే అగ్గి రాజుకుందా..?

ఆదిలోనే ఎందుకు నియంత్రించలేదు

సమన్వయం, వ్యూహం లేకపోవడమే కారణమా

రెండున్నర గంటల తర్వాత తాపీగా బలగాలు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ప్రాంతం. అగ్నిపథ్‌ నిర్ణయానికి నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో యువత ఆందోళనకు దిగారు. బోగీలకు నిప్పు పెట్టి, పార్సిళ్లను కాల్చి, ఫుట్‌పాత్‌లపై దుకాణాలను ధ్వంసం చేశారు. నిమిషాల వ్యవధిలోనే విధ్వంసం సృష్టించారు. అయితే, ఆందోళన హద్దు దాటుతుంటే పోలీస్‌ వ్యవస్థ ఏం చేసింది..? గంటల తరబడి విధ్వంసం జరుగుతోన్నా, వందల సంఖ్యలో ఉన్న నిరసనకారులను ఎందుకు నియంత్రించలేక పోయారు? అంటే పోలీస్‌ బలగాలు సకాలంలో రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకోకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  


ఐదారు కి.మీల దూరంలో ఠాణాలు

రైల్వే స్టేషన్‌కు ఐదారు కి.మీ.ల దూరంలో పలు పోలీ్‌సస్టేషన్లున్నాయి. పరిధిని బట్టి ఒక్కో స్టేషన్‌లో 50 నుంచి 100 మంది సిబ్బంది ఉంటారు. గోపాలపురం, మోండా మార్కెట్‌, మహంకాళి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, బేగంపేట పోలీస్‌ స్టేషన్లు సికింద్రాబాద్‌ చుట్టు పక్కలే ఉంటాయి. ఆయా పోలీ్‌సస్టేషన్ల సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ట్రాఫిక్‌ జామ్‌, ఇతరత్రా ఇబ్బందులుంటే 25 నిమిషాల్లోపు రావచ్చు. కానీ స్థానికులు చెబుతోన్న సమాచారం ప్రకారం దాదాపు రెండున్నర గంటల తర్వాతే లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు వచ్చినట్టు తెలుస్తోంది. బోగీలకు నిప్పు పెట్టారన్న సమాచారంతో ఫైరింజన్లతోసహా అగ్నిమాపక శాఖ సిబ్బంది నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకున్నారు. అంబర్‌పేట సీపీఎల్‌లో ఉండే బెటాలియన్‌ కూడా  మధ్యాహ్నం 12 గంటలకు గానీ స్టేషన్‌ వద్దకు చేరుకోలేదు. 


సమన్వయలోపం..

సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి చెప్పారు. గతంలో ముంబై రైల్వే స్టేషన్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడి పోలీస్‌ వ్యవస్థ యుద్ధప్రాతిపదికన స్పందించి నష్టాన్ని నివారించ గలిగింది. మన పోలీసులు మాత్రం అనూహ్య ఘటన ఘటనను నియంత్రించడంలోనూ విఫలమైంది. సమన్వయ లోపం, ఘటనను నియంత్రించే సరైన వ్యూహం లేకపోవడం వల్లే ఇంత నష్టం జరిగిందని చెబుతున్నారు.  


145కు  40 మంది రైల్వే పోలీసులే..

సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జీఆర్‌పీఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు విధుల్లో ఉంటారు. 145 మంది రైల్వే పోలీసులకుగాను 40 మంది మాత్రమే ఉన్నారు. 100కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులే ఆందోళనకారులను చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిమిత సంఖ్యలో రైల్వే పోలీసులు ఉండడంతో ఘటన తీవ్రత పెరగకుండా నియంత్రించడం వారి తరం కాలేదు. రైల్వే స్టేషన్‌ లోపల ఘటన జరగడం,  వారు కోరే వరకు జోక్యం చేసుకునే అధికారం తమకులేదని, ఈ క్రమంలోనే కొంత ఆలస్యమై ఉండొచ్చని సీనియర్‌ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-19T14:56:07+05:30 IST