అనాటమీ డిపార్టుమెంట్‌లో కుళ్లిన పార్థీవదేహం

ABN , First Publish Date - 2022-05-29T05:59:29+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న అనాటమీ డిపార్టుమెంట్‌ నిర్లక్ష్యంతో ఓ పార్థీవదేహం కుళ్లింది. దీంతో ఆ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్టు తెలిసింది.

అనాటమీ డిపార్టుమెంట్‌లో కుళ్లిన పార్థీవదేహం

గుట్టు చప్పుడుకాకుండా ఖననం

కెమికల్‌ ప్రక్రియలో నల్లగొండ  మెడికల్‌ కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యం

నెరవేరని దాతల లక్ష్యం


నల్లగొండ, మే 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న అనాటమీ డిపార్టుమెంట్‌ నిర్లక్ష్యంతో ఓ పార్థీవదేహం కుళ్లింది. దీంతో ఆ  మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్టు తెలిసింది. దీంతో మెడికల్‌ కళాశాలలో చదువుకునే వైద్య విద్యార్థులకు ఉపయోగపడే పార్థీవదేహా న్ని కాపాడలేకపోయారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మృతిచెందినా పదిమందికి ఉపయోగపడాలనే లక్ష్యంతో ఉదార స్వభావంతో కొంత మంది పార్థీవదేహాన్ని మెడికల్‌ కళాశాలకు అందజేస్తుంటారు. అందులో భాగంగా నల్లగొండ మెడికల్‌ కళాశాలకు ఇప్ప టి వరకు మూడు పార్థీవదేహాలు అందాయి. కొద్ది నెలల క్రితం సాయుధ పోరాట యో ధురాలు, సీపీఎం పార్టీ నాయకురాలు మల్లు స్వరాజ్యం మృతి చెందిన అనంతరం ఆమె పార్థీవదేహాన్ని కుటుంబసభ్యులు నల్లగొండ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడ మాజీ కౌన్సిలర్‌, సీపీఎం నేత వేముల రాంరెడ్డి పార్థీవదేహాన్ని, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తండ్రి ముదిరెడ్డి రాంరెడ్డి పార్థీవదేహాన్ని వారి కుటుంబ సభ్యులు నల్లగొండ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. ఈ మూడింటిలో ఒక మృతదేహానికి అనాటమీ విభాగంలో కెమికల్‌ ప్రక్రియను సరిగా చేయకపోవడంతో కుళ్లింది. దీంతో ఎవరికీ తెలియకుండా సదరు మృతదేహాన్ని ఖననం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


అనుభవంలేని సిబ్బందే కారణమా?

అనాటమీ డిపార్టుమెంట్‌లో అనుభవం లేని సిబ్బంది కారణంగా పార్థీవదేహం దెబ్బతిన్నట్లు సమాచారం. సంవత్సరాల తరబడి పార్థీవదేహం అందుబాటులో ఉంటే మెడిక ల్‌ కళాశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ఉండే వివిధ భాగాల గురించి వివరించడానికి సంబంధిత ఫ్యాకల్టీకి అవకాశం ఉంటుంది. సం వత్సరాల తరబడి మృతదేహాన్ని కాపాడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మృతదేహాలకు ఎంబార్మింగ్‌, వివిధ రసాయనాలతో కెమికల్‌ ప్రక్రియను పూర్తిచేసి భద్రపరచవచ్చు. అయితే నల్లగొండలో హెచ్‌వోడీ పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది అలసత్వం, అనుభవంలేమి కారణంగా ఒక మృతదేహం కుళ్లినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మెడికల్‌ కళాశాల కు 16 మృతదేహాలు అందుబాటులో ఉండాలి. కాగా, ఇప్పుడిప్పుడే ప్రజల్లో వస్తున్న చైత న్యం కారణంగా మృతదేహాలు మెడికల్‌ కళాశాలకు అందుతున్నాయి.  ఇలా నల్లగొండ మెడికల్‌ కళాశాలకు మూడు పార్థీవదేహాలు అందగా, వాటిని కాపాడలేకపోయారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయకుండా, ఆ బాధను దిగమింగి, చనిపోయిన వారి త్యాగం గుర్తుండేలా మెడికల్‌ కళాశాలకు మృతదేహాన్ని అందజేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిచడంతోపాటు, కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఖననం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నా దృష్టికి రాలేదు : రాజకుమారి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

పార్థీవదేహాన్ని ఖననం చేసిన విషయం నా దృష్టికి రాలేదు. అనాటమీ డిపార్టుమెంట్‌ కు అప్పగించిన పార్థీవదేహం కెమికల్‌ ప్రక్రియతో నిర్లక్ష్యం వల్ల కుళ్లిన విషయం, దాన్ని ఖననం చేసిన విషయం తెలియదు. ఏదైనా నా దృష్టికి వస్తే సంబంధిత విషయంపై విచారణ నిర్వహించి అవసరమైతే శాఖాపర చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-05-29T05:59:29+05:30 IST