తెగని టికెట్లు

ABN , First Publish Date - 2021-10-24T05:44:36+05:30 IST

ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ)కి దసరా దెబ్బకొట్టింది. ఏటా వచ్చే ఆదాయంలో 10 శాతం కూడా ఈ ఏడాది రాకపోవడం పరిస్థితిని తెలియజేస్తోంది.

తెగని టికెట్లు

90 శాతం తగ్గిన ఆర్టీసీ ‘స్పెషల్‌’ ఆదాయం 

హైదరాబాదుకు నామమాత్రంగా ఆర్టీసీ సర్వీసులు

85 శాతం రద్దు... 34 బస్సులతోనే సరి  

తెలంగాణ ఎత్తుగడతో ఏపీ సర్వీసులు చిత్తు !


ఏలూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ)కి దసరా దెబ్బకొట్టింది. ఏటా వచ్చే ఆదాయంలో 10 శాతం కూడా ఈ ఏడాది రాకపోవడం పరిస్థితిని తెలియజేస్తోంది. తెలంగాణ ఆర్టీసీ అవలంభించిన ఎత్తు గడల పుణ్యమా అంటూ ముందుగా కేటాయించిన బస్సులనే రద్దు చేయాల్సి వచ్చింది. విజయవాడ, విశాఖ సర్వీసులు కొంచెం పరవాలేదనిపించినా వచ్చిన నష్టాన్ని తగ్గించలేక పోయాయి.దసరా ముందు జిల్లా నుంచి హైదరాబాదుకు 56 ప్రత్యేక బస్సులు కేటాయించిన ఆర్టీసీ అధికారులు చివరకు కేవలం 10 బస్సులనే నడిపారు. హైదరా బాద్‌ నుంచి జిల్లాకు ఈ నెల 8 నుంచి 56 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. కానీ బుకింగులు పూర్తయిన 10 బస్సులను మాత్రమే నడిపి మిగిలిన 46 బస్సులను రద్దు చేశారు. ఆక్యుపెన్సీ నిష్పత్తి 73 శాతానికి తగ్గడంతో ఆదాయం రూ.2.84 లక్షలకు పడిపోయింది. 2020లో కొవిడ్‌ కారణంగా దసరా స్పెషల్‌ బస్సులు నడపలేదు. 2019లో దసరాకు ముందు హైదరాబాదు నుంచి జిల్లాకు మొత్తం 82 బస్సులు నడిపారు. అన్ని బస్సులు నడిపినా ఓఆర్‌ 78 శాతం నమోదవగా రూ.22.69 లక్షలు ఆదాయం వచ్చింది.దసరా తరువాత పండుగకు జిల్లాకు వచ్చి హైదరాబాదు తిరిగి వెళ్లే వారి కోసం ఏర్పాటు చేసిన బస్సులదీ ఈ ఏడాది అదే పరిస్థితి. 2019లో దసరాకు ఇంటికి వచ్చి హైదరాబాదు వెళ్లే వారి కోసం జిల్లా నుంచి 132 బస్సులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్య 24కు పడిపోయింది. అప్పట్లో ఆక్యుపెన్సీ నిష్పత్తి 82 శాతం ఉండగా, ఈ ఏడాది అది 76 శాతానికి తగ్గింది. అప్పట్లో రూ.42 లక్షల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.7.35 లక్షలకు పడిపోయింది. మొత్తంగా ఈ దసరాకు హైదరాబాదు సర్వీసుల ద్వారా జిల్లాకు వచ్చిన మొత్తం ఆదాయం రూ.10.19 లక్షలు. కాగా 2019లో వచ్చిన మొత్తం ఆదాయం రూ.64.69 లక్షల్లో అది 15 శాతానికి సమానం. 

ఊరట నిచ్చిన విశాఖ, విజయవాడ సర్వీసులు

కొవిడ్‌ నుంచి విశాఖపట్నం సర్వీసుల ఓఆర్‌ పెరుగుతుండడంతో జిల్లా అధికారులు ఈ ఏడాది ఆ దిశగా దృష్టి సారించారు. దసరా సందర్భంగా విశాఖపట్నానికి పది బస్సులు నడిపారు. వీటి ఓఆర్‌ 85 శాతం ఉండగా, రూ.2.51 లక్షల ఆదాయం వచ్చింది. భవానీ దీక్షల నేపథ్యంలో విజయవాడ సర్వీసులు కిటకిటలాడాయి. దీంతో విజయవాడకు 31 ప్రత్యేక బస్సులు నడిపారు. ఇవి 92 శాతం ఓఆర్‌తో నడవగా వీటి ద్వారా రూ.3.65 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ప్రత్యేక బస్సుల ఆదాయం రూ.16.35 లక్షలకు చేరింది.

తెలంగాణ దెబ్బకు విలవిల

కొవిడ్‌ కారణంగా ప్రత్యేక బస్సుల ఆదాయం భారీగా తగ్గింది. కిందటేడాది ప్రత్యేక సర్వీసులు నడిపే పరిస్థితే లేకపోయింది. ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగు పడినా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించకపోవడం పీటీడీని గట్టిగా దెబ్బ తీసింది. కొవిడ్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటున్నా పీటీడీ ఛార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపింది. ఎప్పటి మాదిరే స్పెషల్‌ పేరుతో 50 శాతం చార్జీని అధికంగా వడ్డించింది. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ అదనపు భారాన్ని ప్రయాణికులపై మోప కుండా సాధారణ చార్జీలతో సర్వీసులు నడిపింది. దీంతో ప్రయాణికులు అటువైపు మొగ్గారు. జిల్లా బస్సులు ఖాళీగా ఉండిపోవ డంతో రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రభావం పడింది

కొవిడ్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రభావం ప్రత్యేక బస్సులపై పడింది. జిల్లాలో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న కారణంగా ఈ ఏడాది హైదరా బాదు నుంచి రాకపోకలు తగ్గాయి. కొవిడ్‌ కారణంగా ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసు కున్నారు. తెలంగాణ ఆర్టీసీ ప్రభావం జిల్లాపై పెద్దగా లేదు.

– వీరయ్యచౌదరి, ఆర్‌ఎం

Updated Date - 2021-10-24T05:44:36+05:30 IST