తగ్గిన కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2021-10-17T06:26:15+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెరగడంతో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన రెండు నెలలుగా కేసుల సంఖ్య పెరగడం లేదు. ప్రతీరోజు ఐదులోపే కేసులు నమోదవుతున్నాయి.

తగ్గిన కరోనా వ్యాప్తి

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెరగడంతో తగ్గుముఖం పట్టిన కరోనా

నామమాత్రంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

పెరుగుతున్న సాధారణ జ్వరాలు, డెంగ్యూ కేసులు

నిజామాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెరగడంతో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన రెండు నెలలుగా కేసుల సంఖ్య పెరగడం లేదు. ప్రతీరోజు ఐదులోపే కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. జిల్లాలో మాత్రం సాధారణ జ్వరాలు తగ్గడంలేదు. నెలన్నర గడిచినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ మంది జ్వరాలబారిన పడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, ఇతర జ్వరాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 

నిత్యం 500ల వరకు పరీక్షలు

జిల్లాలో గడిచిన రెండు నెలలుగా కరోనా కేసుల సంఖ్య పెరగలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు 300ల నుంచి 500ల మధ్యన టెస్టులు చేస్తున్నా కేసులు మాత్రం ఒక శాతానికి మించడం లేదు. ప్రతీరోజు మూడు నుంచి ఐదు లోపే కేసులు నమోదవుతున్నాయి. నెలలో ఒకటి రెండు రోజులు మినహాయిస్తే మిగతా అన్ని రోజులు కేసులు పెరగడంలేదు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ పెరగడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొదట వ్యాక్సినేషన్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపకున్నా తర్వాత అవగాహనతో ఎక్కువ మంది తీసుకోవడం వల్ల తీవ్రత తగ్గింది. మొదటి విడతతో పాటు రెండో విడత కూడా ఎక్కువ మంది తీసుకోవడం వల్ల వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కరోనాపై అవగాహన రావడం, మాస్కులు, సానిటైజర్‌లు ఉపయోగించడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరగడం లేదు. జిల్లాలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 41,657 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షల 40వేల 213 టెస్టులు చేశారు. కరోనా కిట్‌లతోపాటు ఆర్టీపీసీఆర్‌ ద్వారా ఈ టెస్టులు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 18 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో నలుగురు మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతినెలా వ్యాక్సినేషన్‌ పెరగడం వల్ల వ్యాప్తి తగ్గినట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో యాంటిబాడీస్‌ పెరగడం వల్ల కరోనాను తట్టుకునే శక్తి వచ్చినట్టు వైద్యులు వివరిస్తున్నారు. వందశాతం వ్యాక్సినేషన్‌ జరిగితే మరింత కేసులు తగ్గుతాయని వారు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 9లక్షల 28వేల 931 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ప్రతీ రోజు 8వేల నుంచి 10వేల మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నా రు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆధ్వ ర్యంలో ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమీక్షిస్తూ ఎక్కువ మందికి టీకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌ సరఫరాను పెంచడంతో పాటు కేంద్రాలకు వచ్చే అందరికీ అదే రోజు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేవిధంగా చూస్తున్నారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం వల్లనే జిల్లాలో కరో నా వైరస్‌ వ్యాప్తి తగ్గింది.  

తగ్గని సాధారణ జ్వరాలు

జిల్లాలో కరోనా కేసులు వ్యాక్సినేషన్‌తో తగ్గినా.. సాధారణ జ్వరాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి జిల్లాలో వందలాది మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం దోమల నిర్మూలనకు ముందుగా చర్యలు చేపట్టకపోవడం, వర్షాలు బాగా కురవడం వల్ల జ్వరాలు పెరిగినట్లు వైద్య నిపుణులు అంచనా వే స్తున్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు గత సంవత్సరంకన్నా భారీగా పెరిగాయి. సాధారణ జ్వరాలతో పాటు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు డెంగ్యూ కేసులు 230కిపైగా నమోదయ్యాయి. నగరంతో పాటు మున్సిపాలిటీలు కొన్ని మండలాల పరిధిలో ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దోమల లార్వాలను ముందస్తుగా నిర్మూలించకపోవడం, గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో నీటి నిల్వలు ఎక్కు వగా ఉండడం వల్ల దోమలు బాగా పెరిగాయి. వీటి వల్ల కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. సాధారణ జ్వరాలతో పాటు టైఫాయిడ్‌ ఎక్కువగా వస్తున్నాయి. జ్వరాల తీవ్రత పెరగడంతో పాటు డెంగ్యూ లక్షణాలు ఎక్కువ మందికి కనిపించడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని డీఎంహెచ్‌వో బాలనరేంద్ర తెలిపారు. వ్యాక్సినేషన్‌ పెరగడంతో కేసుల సంఖ్య తగ్గిందని, జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో ప్రతీ రోజు 8వేల నుంచి 10 వేల మధ్య వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని డాక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు.

Updated Date - 2021-10-17T06:26:15+05:30 IST