కక్కు కొడవళ్లకు తగ్గిన డిమాండ్‌

ABN , First Publish Date - 2022-01-22T05:12:20+05:30 IST

కక్కు కొడవళ్లకు కేరాఫ్‌ కొప్పెర పాడు. వ్యవసాయ సీజన్‌ వస్తే ఇక్కడి వడ్రంగులకు చేతినిం డా పని దొరికేది.

కక్కు కొడవళ్లకు తగ్గిన డిమాండ్‌
అమ్మకాలకు సిద్ధంగా ఉన్న కొడవళ్లు

గతంలో అర్డర్లు ఇచ్చి మరీ తయారీ

పొరుగు రాష్ట్రాల నుంచీ వచ్చి కొనుగోళ్లు

వరి సాగు తగ్గడంతో పడిపోయిన గిరాకీ 

రోజువారీ కూలి కూడా గిట్టుబాటు కావడం లేదంటున్న తయారీదారులు 

బల్లికురవ, జనవరి 21: కక్కు కొడవళ్లకు కేరాఫ్‌ కొప్పెర పాడు. వ్యవసాయ సీజన్‌ వస్తే ఇక్కడి వడ్రంగులకు చేతినిం డా పని దొరికేది. జిల్లాతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు, వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొడవళ్లు తయారు చే యించుకునే వారు. ముందుగానే ఆర్డర్లు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరి సాగు తగ్గిన ప్రభావం కక్కు కొడవళ్లపై పడింది. దీంతోపాటు కోతకు యంత్రాలు వినియోగి స్తుండటంతో కొడవళ్ల వినియోగం తగ్గింది. రెండేళ్లుగా అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మరింత పడిపోయాయి. దీంతో అదేవృతి ్తపై ఆధారపడి జీవించే వారు ఆందోళనలో ఉన్నారు.  రోజువారీ కూలి కూడా గిట్టుబాటు కావటం లేదని వారు వాపోతున్నారు. 

బల్లికురవ మండలం కొప్పెరపాడులో తయారు చేసే కక్కు కొడవళ్లకు కొన్నేళ్ల క్రితం వరకూ మంచి డిమాండ్‌ ఉండేది. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు, తెలంగాణ, కర్నాటకలోని పలు ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి కక్కు కొడవళ్లను కొనుగోలు చేసే వారు. కొందరు వ్యాపారులు ముందుగా ఆర్డర్లు ఇచ్చి చేయించు కునే వారు. రైతులు ముఖ్యంగా వరి, కంది కోతలకు ఈ కొడవళ్లను ఎక్కువగా వినియోగించే వారు. 

అయితే, ఇటీవల వరి సాగు విస్తీర్ణం అన్ని ప్రాంతా ల్లోనూ తగ్గింది. పెట్టుబడి ఖ ర్చులు పెరగడం, అందుకు అనుగుణంగా దిగుబడులు, ధరలు లభించకపోవడంతో ఎక్కువ మంది మాగాణి సా గుకు స్వస్తి చెప్పారు. అదే సమయంలో కంది విస్తీర్ణం కూడా కొంత మేర తగ్గింది. సాగు చేసిన చోట్ల కూడా కోతలకు యంత్రాలు వాడుతున్నారు. ఆ ప్రభావం కక్కుకొడవళ్లపై పడి వినియోగం తగ్గింది. 

20వేల నుంచి ఐదువేల కొడవళ్లకు పడిపోయిన అమ్మకాలు

రెండేళ్ల క్రితం వరకూ ఏటా కొప్పెరపాడులో 20వేల కొడవళ్లు తయారుచేసే వారు. ఇప్పుడు ఐదు వేలు కూడా అమ్మలేకపోతు న్నామని తయారీదారులు చెప్తున్నారు. వరి కోతల సమయంలో తమ కు నెలకు రూ.20వేల ఆదాయం వచ్చేదని కానీ ఇప్పుడు కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు. గతంలో ఒక్కో కొడవలి రూ.80కి విక్రయించగా, ఇప్పుడు స్థానికంగా ఉన్న రైతులకు రూ.100 చొప్పున  అమ్ముతున్నారు.  ఎన్నో ఏళ్ల నుంచి ఇదే వృత్తిని న మ్ముకొని జీవిస్తున్న తమకు ఇప్పుడు కుటుంబ పోషణ భారంగా మా రిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

కొడవళ్లకు డిమాండ్‌ లేదు

వీరవల్లి సత్యనారాయణ, కొడవళ్ల తయారీదారుడు, కొప్పెరపాడు

కక్కు కొడవళ్ల అమ్మకాలు ఈ ఏడాది పూర్తిగా తగ్గాయి. గతంలో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే వారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరి  పూర్తిస్థాయిలో సాగు చేయడం లేదు. దీంతో మేము తయారు చేసిన కొడవళ్లను కొనేందుకు తక్కువ సంఖ్యలో రైతులు వస్తున్నారు. మాకు గిట్టుబాటు కావటం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

కొప్పెరపాడు కొడవళ్లు బాగుంటాయి

తలపనేని వీరనారాయణ, రైతు, ధర్మవరం, అద్దంకి మండలం

కొప్పెరపాడు గ్రామంలో తయారు చేసే కక్కు కొడవళ్లు వ్యవసాయ పనులకు చాలా బాగుంటాయి. ఏటా మేము ఇక్కడికే వచ్చి కొడవళ్లకు కక్కు పోయించుకొంటాం. ఒకసారి కక్కు పోస్తే ఏడాదంతాబాగా తెగుతుంది. వరి, కంది, పశువుల గడ్డి కోయటానికి వీటిని వినియోగిస్తాం. వరి సాగు తగ్గటంతో కొడవళ్లను రైతులు తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2022-01-22T05:12:20+05:30 IST