గుడిలో తగ్గిన భక్తజనం

ABN , First Publish Date - 2022-01-19T06:18:00+05:30 IST

కరోనా భయంతో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు తగ్గిపోయారు.

గుడిలో తగ్గిన భక్తజనం
వెలవెలబోతున్న ఇంద్రకీలాద్రి.. క్యూలైన్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కరోనా భయంతో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు తగ్గిపోయారు. దీంతో ఇంద్రకీలాద్రి వెలవెలబోతోంది. కొండపై పలువురు అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు కరోనా సోకడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం తెలియడంతో భక్తుల రాక కూడా తగ్గింది. దేవస్థానం అధికారులు మంగళవారం నుంచి ఆలయంలో అన్నదానాన్ని, ఉచిత ప్రసాదాల పంపిణీని కూడా ఆపేశారు. భక్తుల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో లడ్డూ ప్రసాదాలను కూడా పరిమితంగానే తయారు చేయాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఆదేశించారు.


నో మాస్క్‌.. నో ఎంట్రీ 

కరోనా థర్డ్‌వేవ్‌ తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచి ఇంద్రకీలాద్రిపై కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకుంటే దర్శనానికి అనుమతించబోమన్నారు. భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించే ముందు థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తామని, కొవిడ్‌ లక్షణాలు లేనివారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. భక్తులు నిబంధనలను పాటిస్తూ, అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలోనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. 


కరోనాతో వేదపండితుడు మృతి

దుర్గగుడి ఈవో కరోనా వైరస్‌ బారిన పడగా.. దేవస్థానంలో పనిచేసే వేదపండితుడు ఒకరు వైరస్‌ బారినపడి, గురువారం మరణించినట్టు తెలుస్తోంది. ఆయన భార్య కూడా కరోనా సోకడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటివరకు 15 మందికిపైగా కరోనా వైరస్‌ బారినపడ్డారు. 

Updated Date - 2022-01-19T06:18:00+05:30 IST