ఊపిరాడడం లేదు...

ABN , First Publish Date - 2022-07-04T17:30:18+05:30 IST

కొవిడ్‌ తీవ్రత తగ్గినా దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉండడం, నగరంలో కాలుష్యం కోరలు చాస్తుండడంతో చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది

ఊపిరాడడం లేదు...

 మందగిస్తున్న ఊపిరితిత్తుల పనితీరు    

కొవిడ్‌, కాలుష్యం, పక్షుల వ్యర్థాలూ కారణమంటున్న వైద్యులు


హైదరాబాద్‌ సిటీ: కొవిడ్‌ తీవ్రత తగ్గినా దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉండడం, నగరంలో కాలుష్యం కోరలు చాస్తుండడంతో చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందిలో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. పదేళ్ల క్రితం ఒకటి, రెండు కేసులు వస్తే ప్రస్తుతం వారానికి ఒకటి, రెండు కేసులు వస్తున్నట్టు పల్మనాలజిస్టులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఇతర ఇన్‌ఫెక్షన్లు తోడవుతుండడంతో ఊపిరితిత్తుల మనుగడే కష్టమవుతుంది. వాటిని మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా సినీ నటి మీనా భర్త ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. పావురాల వ్యర్థాల నుంచి ఇన్‌ఫెక్షన్‌ సోకడమే ఇందుకు కారణమని తమిళ మీడియా కథనాలు ప్రచురించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి ఇతర ఇబ్బందులు, సమస్యలు తోడైతే తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. 


కొవిడ్‌ కారణంగా

కొవిడ్‌ సోకి తగ్గిన తర్వాత కొందరి ఊపిరితిత్తుల వద్ద మచ్చలు (పల్మనరీ ఫ్రైబోసిస్‌) ఏర్పడతాయని, కొందరిలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పల్మనరీ ఫ్రైబోసిస్‌ దీర్ఘకాలంగా ఉంటుందని పల్మనాలజిస్టులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ సమయంలో ఏర్పడిన మచ్చలు మానకపోతే పుండుగా మారే ప్రమాదముందంటున్నారు. దీంతో ఊపిరిత్తులు సాగే గుణం కోల్పోయి, కుంచించుకుపోతాయని, ఊపిరితిత్తుల వద్ద ఏర్పడిన మచ్చలు పోకుంటే ఆయాసం వంటి జబ్బులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు మెట్లు ఎక్కేందుకు ఆయాసపడుతుంటారని, కొద్ది దూరం నడవగానే ఊపిరి తీసుకోవడం కష్టంగా భావించి కూలబడిపోతారని చెప్పారు. 


పక్షుల వ్యర్థాల ప్రభావం

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి పక్షుల వ్యర్థాల వల్ల ముప్పు మరింత పెరిగే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. 13 ఏళ్ల క్రితం చెస్ట్‌ ఆస్పత్రిలోని ఓ వైద్యుడు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చనిపోయాడని, తర్వాత పరీక్షలు చేస్తే పక్షుల వ్యర్థాల ఇన్‌ఫెక్షన్‌ కూడా ఊపిరితిత్తులు పాడవడానికి కారణమని తేలిందని చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు.


ధూళితో ఇన్‌ఫెక్షన్‌

పక్షుల వ్యర్థాలు ఎండిపోయిన తర్వాత ధూళిగా మారి ముక్కులోకి వెళ్లే ప్రమాదముంటుంది. అందులోని బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ముప్పు ఉంటుంది. దీనిని పక్షుల నుంచి వచ్చే జబ్బుగా వ్యవహరిస్తాం. ముక్కుదిబ్బడ, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం, కండరాల నొప్పులు ఉంటే ఊపిరితిత్తుల సమస్యగా గుర్తించి పరీక్షలు చేయించుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ మెదడు, గుండెకు చేరితే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇళ్లలో పెంచుకునే పక్షులు చలాకీగా లేకపోతే వెటర్నరీ వైద్యులకు చూపించాలి. 

- డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, సూపరింటెండెంట్‌, చెస్ట్‌ ఆస్పత్రి 


ఇన్‌ఫెక్షన్‌ ఉంటే ముప్పే

అప్పటికే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకితే మరింత నష్టం ఏర్పడుతుంది. కాలుష్యం, పక్షుల వ్యర్థాలు, ధూమపానం ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ప్రారంభంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాద తీవ్రత పెరుగుతుంది. పక్షుల వ్యర్ధాల వల్ల అందరికీ ఇబ్బందులు రావు. జన్యు సమస్యలున్న వారికి ముప్పు ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవాలి. మందులతో జబ్బును నియంత్రణలో ఉంచుకోవాలి.  

- డాక్టర్‌ రఘుకాంత్‌, పల్మనాలజిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి

Updated Date - 2022-07-04T17:30:18+05:30 IST