Advertisement

డీమ్్డ వర్సిటీలు ఎన్నికల కోసం కాదా?

Oct 21 2020 @ 03:14AM

మామూలుగా పట్టభద్రుల ఎన్నికలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి. కానీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఎన్నికను రాజకీయ కోణంలో చూసి డబ్బుతో గెలవడానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది చెడు సంస్కృతి. విద్యావంతులు తమ వివేకంతో ఆలోచించి ప్రజాస్వామ్య విలువలున్న వారిని, పెద్దల సభలో వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావించే సత్తా ఉన్నవారిని ఎన్నుకుంటారు. లేదా ప్రజా ఉద్యమంతో మమేకమైన నాయకుడిని ఎన్నుకుంటారు. అంతేకానీ విద్యను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే వారిని ఎన్నుకోరు. టీఆర్‍ఎస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో లాగానే పట్టభద్రుల ఎన్నికలలో కూడా వ్యాపార వర్గాల వారిని ప్రవేశపెట్టి పట్టభద్రుల నియోజక వర్గ ప్రతిష్ఠను మంటగలిపింది.


‘‘మాప్రభుత్వం విద్యను కార్పొరేటీకరణ చేయదు’’... ఈ మాట అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి తరువాతి స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్. ఇటీవల ఒక విద్యా సంస్థల యాజమాన్యాల సమావేశంలో ఆయన ఈ మాట అన్నట్లు పత్రికలలో చూశాను. ఆ వార్తతోపాటు ఫోటో కూడా వచ్చింది. అది చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే, కేటీఆర్‍కు కుడి ఎడమల ఎంపీ మల్లారెడ్డి, ఎమ్ఎల్ సి రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వారిని పక్కనపెట్టుకొని విద్యను ప్రైవేటీకరించమనీ, కార్పొరేటీకరణ చెయ్యమనీ చెప్పడం గొంగడిలో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకునట్లు ఉంది. ఎందుకంటే వారిద్దరికీ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వాటిలో రిజర్వేషన్లు ఉండవు, ఫీజులు రీయింబర్స్ కావు అని నిండు సభలో ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకన్నా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఉంటుందా? వారిద్దరినీ పక్కన పెట్టుకొని ‘మా ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరించదు’ అని చెబుతుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. పట్టభద్రుల నియోజక వర్గం నుండి మళ్ళీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దింపి గెలిపించుకోవడానికి కేటీఆర్, కేసీఆర్ నానా తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా అసంతృప్తితో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను పిలిచి కొన్ని తాయిలాలు ప్రకటించి వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిన్నటి దాకా ప్రభుత్వం వారిని నానా అవస్థలు పెట్టింది. అప్పుల పాలు అయ్యేలా చేసింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎక్కడ ఓడిస్తారోననే భయంతో ఎంఎల్‌సి ఎన్నికలు రాగానే హడావిడిగా సమావేశం నిర్వహించి హామీలు ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టారనే కోపంతో ఉన్నవారికి తాత్కాలిక ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు.


ఇది ఇలా ఉంటే మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల హడావిడి మాత్రం అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నది. ముఖ్యంగా అధికార పార్టీ హంగామా మరీ ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికలలో గెలుపు ఓటములతో రాష్ట్ర ప్రభుత్వమే పడిపోతుందేమో అన్నంత హడావిడి చేస్తుంది. జనాభా లెక్కల సేకరణలాగ గడప గడపకు పల్లె పల్లెకు తిరుగుతూ ఓట్లు నమోదు చేయిస్తున్నారు. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో తెలియదు. కానీ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, చేస్తున్న హంగామా మాత్రం వారిలో వున్న భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఇంత ఘనంగా ఓట్ల నమోదు చేస్తున్నట్లు? అన్న ప్రశ్న వస్తుంది. దీనిలో ఒక మతలబు ఉందని నాతో సన్నిహితంగా ఉండే అధికార పార్టీ నాయకుడు చెప్పాడు. గ్రామాలు వార్డులు వారీగా ఎవరు అనుకూలమో ఎవరు వ్యతిరేకమో వారికి తెలుసు. దానిని బట్టి వారికి అనుకూలురైన పట్టభద్రుల ఓటు నమోదు చేసి, వ్యతిరేకుల దరఖాస్తులను పక్కన పెడతారట. నాకు ఇలా కూడా ఉంటుందా అనిపించింది. పట్టభద్రులంటేనే ఉన్నత విద్య చదివిన వారు. ఓటు ఎలా నమోదు చేసుకోవాలో సంపూర్ణ అవగాహన ఉన్నవాళ్లు. ఓటు విలువ తెలిసినవాళ్లు. వారేమీ నిరక్షరాస్యులు కాదు. గ్రామ పంచాయితీ ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్థులు పోటాపోటీగా ఓట్లు నమోదు చేసుకుంటారు. ఎందుకంటే తాము చేర్పిస్తే తమకే ఓటు వేస్తారనే నమ్మకంతో. కానీ పట్టభద్రులు అలా కాదుకదా! అయినా ఎందుకు ఓటు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టారంటే- తమకు వ్యతిరేకంగా పడతాయనుకునే ఓట్లను నమోదు ప్రక్రియలోనే ఏరిపారేయటానికన్నమాట. ఎంత దుర్మార్గం! 


మామూలుగా పట్టభద్రుల ఎన్నికలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి. కానీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఎన్నికను రాజకీయ కోణంలో చూసి డబ్బుతో గెలవడానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది చెడు సంస్కృతి. విద్యావంతులు తమ వివేకంతో ఆలోచించి ప్రజాస్వామ్య విలువలున్న వారిని, పెద్దల సభలో వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావించే సత్తా ఉన్నవారిని ఎన్నుకుంటారు. లేదా ప్రజా ఉద్యమంతో మమేకమైన నాయకుడిని ఎన్నుకుంటారు. అంతేకానీ విద్యను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే వారిని ఎన్నుకోరు. గతంలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు,  రామచందర్‌‌రావు, నిన్న కాక మొన్న గెలిచిన జీవన్ రెడ్డిని చూసాం.


టీఆర్‍ఎస్ మాత్రం డబ్బునే నమ్ముకుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉద్యమ సమయంలో కూడా డబ్బులు బాగా పెట్టుకుంటాడు అనే ఉద్దేశంతో నాడు ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి విద్యా సంస్థల అధిపతి వరదారెడ్డిని బరిలోకి దించింది. ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి చేత పోటీ చేయించి చేతులు కాల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో లాగానే పట్టభద్రుల ఎన్నికలలో కూడా వ్యాపార వర్గాల వారిని ప్రవేశపెట్టి పట్టభద్రుల నియోజక వర్గ ప్రతిష్ఠను మంటగలిపింది. విద్యావంతులను కూడా డబ్బుకు ప్రలోభ పెట్టవచ్చునన్న భ్రమతో వ్యాపార వర్గాలను బరిలోకి దించుతుంది. పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేసే వారు తమ విజ్ఞానాన్ని నలుగురికి పంచి సమాజ సేవ చేసే వారై ఉండాలి. అంతే కానీ విద్యను అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వారు కాదు.

డా. శ్రవణ్ దాసోజు

కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.