
బాలీవుడ్ అగ్ర హీరోయిన్గా, భారీ పారితోషికం అందుకునే కథానాయికగా అగ్రస్థానంలో కొనసాగుతోంది దీపికా పదుకొనే. దాదాపు దశాబ్దం పైగానే తన స్టార్డమ్ను కొనసాగిస్తోంది. వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ పొజిషన్లోనే ఉంది. తాజాగా దీపిక మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో ఉత్తమ ప్రతిభను చాటిన వారికి ఇచ్చే `ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021` పురస్కారం దక్కించుకుంది.
ఈ అవార్డు కోసం ఈ ఏడాది 3000కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఆ జాబితాను వడపోసి చివరకు దీపికను ఎంపిక చేశారు. `బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ బాలీవుడ్` పేరిట ఈ అవార్డును దీపికకు అందజేయనున్నారు. దీంతో ఈ అవార్డు అందుకోబోతున్న తొలి భారతీయ నటిగా దీపిక నిలవనుంది. `రామ్లీలా`, `తమాషా`, `పద్మావత్` లాంటి చిత్రాల్లో ఆమె నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతేకాదు 2018లో టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది ప్రతిభావంతుల జాబితాలో దీపిక చోటు సంపాదించింది.