ప్రతిష్ఠాభంగం

Published: Wed, 02 Jun 2021 08:46:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఈజిప్ట్ రాజధాని కైరోలో సంపన్నుల నెలవైన గిజాలో భారతీయ భోజనానికి మహారాజా హోటల్ ప్రసిద్ధి. ఆ రెస్టారెంట్ నుంచి కూత వేటు దూరంలో ఉన్న ఒక ఆరు అంతస్థుల భవనంలో అరబ్బు యువ ఉద్యోగులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. భారత్‌కు వీలయినంత ఎక్కువగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా పంపించేందుకై తదేక దీక్షతో వారు పని చేస్తున్నారు. నెహ్రూ హయాంలో ఈజిప్ట్‌లో ఫార్మా రంగం అభివృద్ధికి భారత్ విశేషంగా తోడ్పడింది. ఇప్పుడు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం ఆ దేశంపై భారత్ ఆధారపడుతోంది! 


కరోనా మొదటి దశలో కొవిడ్ బారిన పడిన నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌తోనే శీఘ్రగతిన కోలుకున్నారు. దరిమిలా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్‌లో కొవిడ్ పీడితులకు రెమ్‌డెసివిర్ ఇవ్వడం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే రెమ్‌డెసివిర్‌ను ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ అత్యవసర పరిస్థితులలో ఆ ఇంజక్షన్‌ను ఇవ్వడానికి అమెరికాతో సహా అనేక దేశాలు అనుమతిస్తున్నాయి. కరోనా రోగులలో దీని వలన మార్పువస్తుందని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో కొవిడ్ వ్యాధిగ్రస్తులు తమ ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ఈ ఇంజక్షన్ చేయించుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవల్సిన ఈ మందు బ్లాక్ మార్కెట్‌లో లభ్యమవుతుంది!


మెడికల్ ఆక్సిజన్ కొరత కంటే తీవ్రంగా నెలకొన్న రెమ్‌డెసివిర్ లోటు భారత్‌ను దయనీయమైన పరిస్థితులలోకి నెట్టింది. పొరుగున ఉన్న పేద బంగ్లాదేశ్ మొట్టమొదట భారత్‌ను ఆదుకున్నది. రెమ్‌డెసివిర్‌ను ఉచితంగా సరఫరా చేసింది. ఆ తర్వాతే అమెరికా, ఐరోపా, అరబ్ దేశాలు రెమ్‌డెసివిర్‌ను భారత్‌కు సరఫరా చేశాయి. బంగ్లాదేశ్ ఒక పేద దేశంగా ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి పొందిన వెసులుబాటుతో భారత్ కంటే ముందుగా రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని ప్రారంభించింది. 


భారత్‌లో ఒక్కొక్క రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర 25 నుంచి 30 వేల రూపాయల దాకా ఉండగా బంగ్లాదేశ్‌లోని ఆసుపత్రులలో పన్నెండు ఇంజక్షన్లను 30 వేల రూపాయలకు ఇస్తున్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్ తమకు అవసరమైన ఔషధాలను చాలా వరకు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు అత్యవసర ఔషధం రెమ్‌డెసివిర్ విషయంలో మనకు ఆసరాగా ఉంది.


బంగ్లాదేశ్ నుంచి రెమ్‌డెసివిర్‌ను దిగుమతి చేసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని జార్ఖండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ ప్రాముఖ్యత ఏమిటో అందరికీ తెలిసివచ్చింది. భారత్‌లోని పరిస్థితి తీవ్రత దృష్ట్యా రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేసే అమెరికన్ సంస్థ, హైదరాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్‌తో సహా దేశ వ్యాప్తంగా ఏడు ఫార్మాస్యూటికల్ సంస్థలకు ఆ ఔషధాన్ని కరోనా ఆపత్కాలంలో ఉత్పత్తి చేసుకోవడానికి, లైసెన్సు రుసుం మినహాయింపుతో అనుమతించింది. అయితే ఆ సౌలభ్యానికి తగినట్లుగా మన దేశంలో రెమ్‌డెసివిర్ ధరలు లేకపోవడం గమనార్హం. 


అంతేగాక మహమ్మరి మహోగ్రరూపం దాల్చి అనూహ్య సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న వేళ కూడా దేశీయ ఉత్పత్తి, డిమాండ్‌కు తగిన విధంగా లేకపోవడంతో విదేశాల నుండి దిగుమతిపై ఆధారపడవలసి వస్తోంది. ఏప్రిల్‌లో 33 వేల రెమ్‌డిసివర్ ఇంజక్షన్లను మాత్రమే ఉత్పత్తి చేయగా మే నెలలో వాటి ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల 50 వేలకు పెరిగిందని కేంద్రం తాజాగా వెల్లడించింది. అలాంటప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరమేమిటి? బ్లాక్ మార్కెట్లో రెమ్‌డెసివిర్ విక్రయాలపై కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు? ఒక వైపు రెమ్‌డెసివిర్‌తో సహా ఇతర కొన్ని అత్యవసర మందుల కొరత తీవ్రతతో రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్రాల వారీగా ఆయా అత్యవసర ఔషధాల కేటాయింపును రద్దు చేసింది! రాష్ట్రాలే స్వయంగా ఆ మందులను సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ విపణిలో రెమ్‌డెసివిర్, ఇతర అత్యవసర మందుల కొరకు దేశంలోని వివిధ రాష్ట్రాలు విభిన్న ధరలతో పోటీపడడం దేశ గౌరవానికి దోహదం చేస్తుందా? 


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధిFollow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.