పరువునష్టం దావా వేస్తా: మున్సిపల్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా వేస్త్తానని అందోలు-జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య కాంగ్రెస్‌ కౌన్సిలర్లను హెచ్చరించారు.

పరువునష్టం దావా వేస్తా: మున్సిపల్‌ చైర్మన్‌
మాట్లాడుతున్న చైర్మన్‌ గూడెం మల్లయ్య

జోగిపేట, ఆగస్టు 7: తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా వేస్త్తానని అందోలు-జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య కాంగ్రెస్‌ కౌన్సిలర్లను హెచ్చరించారు. ఆదివారం ఆయన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లికార్జున్‌గుప్తా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డేవిడ్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను రిటైర్డ్‌ ఉద్యోగినని, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యాపారం నిర్వహించడం లేదన్నారు. తన కుమారులు మేజర్లని, వారు వ్యాపారాలేవో చేసుకుంటూ ఉంటే, వాటిని తనకు ఆపాదించడం సరికాదన్నారు.  వాటిని నిరూపించాలని సవాల్‌ విసిరారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన కౌన్సిలర్లపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. గత ఐదేళ్లలో  కాంగ్రెస్‌ చైర్మన్‌ హయాంలో మున్సిపాలిటీ పరిధిలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, పారిశుధ్య కార్మికులకు సైతం ఏడాదిన్నర కాలంగా జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నది  కాంగ్రెస్‌ కౌన్సిలర్లేనని అంటూ, కందకాలను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించి పార్కులుగా తీర్చిదిద్దుతామన్నారు.  

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST