చాణక్య నీతి: ఎంతటి శత్రువునైనా ఓడించే నాలుగు రహస్యాలు.... వీటిని తెలుసుకోకపోతే మీరు విజయం సాధించలేరు!

ABN , First Publish Date - 2021-10-09T12:29:17+05:30 IST

చాణక్య నీతి ప్రకారం శత్రువులు నిరంతరం...

చాణక్య నీతి: ఎంతటి శత్రువునైనా ఓడించే నాలుగు రహస్యాలు.... వీటిని తెలుసుకోకపోతే మీరు విజయం సాధించలేరు!

చాణక్య నీతి ప్రకారం శత్రువులు నిరంతరం ఎదుటివారి బలహీన పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. శత్రువును ఎవరైనాసరే ఎన్నటికీ ఉపేక్షించకూడదు. ఏ వ్యక్తి అయినా అజాగ్రత్తగా వ్యవహరించినప్పుడు మాత్రమే శత్రువు దాడి చేయగలుగుతాడు. ఏ వ్యక్తి అయినా జాగ్రత్తగా ఉన్నపుడు శత్రువు అతని కదలికలపై నిఘా ఉంచలేడు. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం విజయం సాధించిన ప్రతి వ్యక్తికీ శత్రువులు ఉంటారు. ఈ శత్రువులు అతని విజయానికి ఆటంకం కలిగిస్తారు. వారు నిరంతరం విజయం సాధించినవారికి ఎప్పటికప్పుడు అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. ఆచార్య చాణక్య.. శత్రువును ఓడించడానికి, వారి నుంచి ఎదురయ్యే సమస్యలను నివారించడానికి కొన్ని సలహాలు చెప్పారు. ఈ విషయాలు విజయం సాధించాలనుకున్నవారు నిరంతరం  గుర్తుంచుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


శక్తియుక్తులను పెంచుకోవడం: చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం, మీరు శత్రువును ఓడించాలనుకుంటే, మీ శక్తియుక్తులను నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మీరు శక్తియుక్తులను కలిగివుండటం వలన, శత్రువు మీకు హాని తలపెట్టానుకుంటే అందుకు చాలాసార్లు ఆలోచించవలసి వస్తుంది. వ్యాధి శరీరాన్ని ఏవిధంగా బలహీనపరుస్తుందో, వ్యక్తి తన శక్తియుక్తులను కోల్పోయి, బలహీనపడినప్పుడు శత్రువు అతనిపై దాడి చేస్తాడు. అందుకే ఎవరైనాసరే నిరంతరం తన శక్తియుక్తులను, నైపుణ్యాన్ని,  జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుండాలి. 

ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి: చాణక్య నీతిలో ఆచార్య చాణక్య.. ఎవరైనా సరే ఏవైనా పనులు చేసేందుకు తగిన ప్రణాళిక కలిగి ఉండాలని చెప్పాడు. ముఖ్యమైన పనుల ప్రణాళికలను ఎవరితోనైనా చర్చించే ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే, శత్రువు దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మన ప్లానింగ్‌ను అందరికీ చెప్పడమనే అలవాటను మానుకోవాలి. పని పూర్తయ్యే వరకు సహనం వహిస్తూ, పనిలో విజయాన్ని సాధించాలి.


వినయం కలిగివుండాలి:  చాణక్య నీతి ప్రకారం విజయం సాధించాలనుకునే వ్యక్తి అహంకారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అహంకారం ఎవరికైనా సరే శత్రువుల సంఖ్యను పెంచుతుంది. అహంకారికి లెక్కకు మించిన శత్రువులు ఉంటారు. ఇదేసమయంలో మనిషి సౌమ్యంగా, మర్యాదగా మెలిగితే... అలాంటి వ్యక్తులకు శత్రువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. వినయం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. వినయం మనిషికి ఉండాల్సిన అత్యుత్తమ లక్షణాలలో ఒకటి. వినయ పూర్వకంగా మెలిగేవారిని చూసి, శత్రువు కూడా భయపడతాడు. వినయవిధేయతలు కలిగిన వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తులు అందరి ఆప్యాయతలను పొందగలుగుతారు.

మంచిగా మాట్లాడటం: చాణక్య నీతి ప్రకారం మనిషి మాట మంచిగా ఉండాలి. చక్కగా మాట్లాడే వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటాడు. అలాంటి వ్యక్తికి తగినంత గౌరవం లభిస్తుంది. చక్కగా మాట్లాడే వ్యక్తికి శత్రువులు పరిమితంగా ఉంటారు. 

Updated Date - 2021-10-09T12:29:17+05:30 IST