షాపులో చోరీ చేసిన నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-08-08T09:41:53+05:30 IST

ఓ షాపుకు కన్నం వేసి రూ. 35 లక్షలు కాజేసిన నిందితుడిని చార్మినార్‌ పోలీసులు అరెస్టు చేశారు.

షాపులో చోరీ చేసిన నిందితుడి అరెస్టు

రూ. 31.31 లక్షలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఓ షాపుకు కన్నం వేసి రూ. 35 లక్షలు కాజేసిన నిందితుడిని చార్మినార్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 31.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సౌత్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ గజరావు భూపాల్‌ వివరాలు వెల్లడించారు. వట్టేపల్లి, ఫాతిమానగర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ నాసిర్‌(19) సేల్స్‌మన్‌గా పనిచేస్తుంటాడు. మూడో తరగతి వరకు చదువుకున్న తర్వాత చెడు స్నేహం కారణంగా చదువుకు స్వస్తి చెప్పి హోటళ్లు, దుస్తుల షాపుల్లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ప్రస్తుతం రికాబ్‌గంజ్‌లో ఓ షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు.


దురలవాట్లకు బానిసవడంతో సంపాదన సరిపోకపోవడంతో చోరీ మార్గం ఎంచుకున్నాడు. ఈనెల 4వ తేదీ తెల్లవారు జామున తాను పనిచేసే షాపు పక్కనున్న షాపు వద్దకు వెళ్లాడు. వెనుక డోర్‌ తాళం విరగ్గొటి లోపలికి ప్రవేశించి క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ. 35 లక్షలు తీసుకొని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 31.31 లక్షలు, ల్యాప్‌టాప్‌, నాలుగు వాచీలు, రెండు వెండి పట్టీలు, ఫ్యాన్సీ గాజులు, కాస్మెటిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.


అతడిని విచారించగా.. చార్మినార్‌లో జరిగిన భారీ చోరీతోపాటు గతంలో చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్‌ పీఎ్‌సల పరిధుల్లో మొబైల్‌ఫోన్లు చోరీ చేసి పట్టుబడి సైదాబాద్‌లోని అబ్జర్వేషన్‌ హోంలో ఉన్నట్లు అంగీకరించాడు. ఇళ్లల్లో చోరీ చేసిన మూడు ఘటనల్లో.. చార్మినార్‌లో రెండు, ఫలక్‌నుమా పీఎ్‌సలో మరో కేసులో నాసిర్‌ నిందితుడు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఇన్‌చార్జి డీసీపీ అభినందించారు. 

Updated Date - 2020-08-08T09:41:53+05:30 IST