మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2022-01-26T04:57:12+05:30 IST

మహిళపై అత్యాచారం చేసి హత్యమార్చిన వ్యక్తికి చిత్తూరు ఆరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
జీవిత ఖైదు పడ్డ మునస్వామి

చిత్తూరు(లీగల్‌), జనవరి 25: మహిళపై అత్యాచారం చేసి హత్యమార్చిన వ్యక్తికి చిత్తూరు ఆరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. పాలసముద్రం ఎస్‌ఐ సురేష్‌ కథనం మేరకు వివరాలు... పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీ అబ్బిరాజుకండ్రిగ గ్రామానికి చెందిన వళ్లెమ్మ(70) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. ఈమె పిల్లలు బెంగళూరులో ఉండడంతో ఒంటరిగా నివాసముంటుంది. వేలూరు జిల్లా వాలాజా తాలూకా మట్టమంగ్‌ గ్రామానికి చెందిన మునస్వామి(47) 2018, ఫిబ్రవరి 9న రాత్రి వళ్లెమ్మ ఇంటి వెనుక వైపు ఉన్న తలుపుతీసి లోనికి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా బండరాతితో తలపై తీవ్రంగా హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చిత్తూరు వెస్టు సర్కిల్‌ అప్పటి సీఐ ఆదినారాయణరెడ్డి, ఎస్‌ఐ జయప్ప తమిళనాడు పోలీసుల సహకారంతో మునస్వామిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుడిపై తమిళనాడులో పలు హత్య కేసులు నమోదై ఉండడంతో పాటు అమావాస్య రోజున ఒకే రకమైన హత్యలు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. కేసు విచారించిన చిత్తూరు ఆరవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి నేరం రుజువు కావడంతో నిందితుడు మునస్వామికి జీవిత ఖైదుతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఏపీపీ నిర్మల కేసు వాదించారు.

Updated Date - 2022-01-26T04:57:12+05:30 IST