విష జ్వరాలతో ‘డేగపూడి’ విలవిల!

ABN , First Publish Date - 2022-06-26T04:04:06+05:30 IST

మండలంలోని డేగపూడి గ్రామం విష జ్వరాలతో వణుకుతోంది. వృద్ధులు, పిల్లలు సైతం జ్వరాలతో మంచం పట్టారు.

విష జ్వరాలతో ‘డేగపూడి’ విలవిల!
జ్వరాలతో మంచం పట్టిన గ్రామస్థులు

భయాందోళనలో ప్రజలు

పొదలకూరు, జూన్‌ 25 : మండలంలోని డేగపూడి గ్రామం విష జ్వరాలతో వణుకుతోంది. వృద్ధులు, పిల్లలు సైతం జ్వరాలతో మంచం పట్టారు. జ్వరాల బారినపడి రక్త కణాలు తగ్గి పదుల సంఖ్యలో పొదలకూరు, నెల్లూరు, చెన్నైలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్ప పొందుతున్నారు. ఇప్పటికే చికిత్స అనంతరం కోలుకుని గ్రామానికి చేరిన వారు సుమారుగా 70 మంది వరకు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో 15 రోజుల నుంచి ప్రజల్లో భయాందోళన నెలకొంది. జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ ఏఎన్‌ఎంలు గ్రామంలోకి వచ్చి ఇచ్చే మాత్రలకు జ్వరాలు తగ్గడం లేదు. జ్వరాలు తగ్గే వరకు డాక్టర్లతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, తాగునీరు కలుషితం కావడంతో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు అంటున్నారు. వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు పెరగడంతోపాటు ఇటీవల కురిసిన వర్షం కారణంగా జ్వరాలు ప్రబలుతున్నాయని పలువురు చెబుతున్నారు. అలాగే కనీసం వారానికి ఒకసారైనా శానిటేషన్‌ చేయాలని, వీధుల్లో, డ్రైనేజీ కాలువలు, మురికి కుంటల్లో దోమల మందు పిచికారి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-06-26T04:04:06+05:30 IST