రేపటి నుంచి డిగ్రీ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2022-06-30T16:56:44+05:30 IST

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. జూలై 1 నుంచి సీట్ల భర్తీ

రేపటి నుంచి డిగ్రీ అడ్మిషన్లు

ఆన్‌లైన్‌లోనే నమోదు.. సీట్ల కేటాయింపు

అక్టోబరు 1 నుంచి తరగతుల ప్రారంభం

1,080 కాలేజీల్లో 4.68 లక్షల సీట్లు


హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. జూలై 1 నుంచి సీట్ల భర్తీ ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్రంలోని 7 వర్సిటీల పరిధిలోని 1,080 కాలేజీల్లో దాదాపు  4,68,880  డిగ్రీ సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. డిగ్రీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ కోసం విద్యార్థులు తమ మొబైల్‌ నంబరును, ఆధార్‌ నెంబరును లింక్‌ చేసి  తమ వివరాలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. లేదా మీసేవా కేంద్రం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు బయోమెట్రిక్‌, ఫొటో ప్రామాణికంగా కూడా నమోదు చేసుకునే అవకాశమిచ్చారు. మొదటి దశ నమోదుకు రూ.200లు, రెండవ, మూడవ దశలకు రూ.400లను చెల్లించాలి. దోస్త్‌లో దరఖాస్తు చేసుకునే విధానంపై ప్రత్యేక వీడియోను యుట్యూబ్‌లో ఉంచారు. ఈ ఏడాది నుంచి రెసిడెన్షియల్‌ సంస్థల పరిధిలోని డిగ్రీ సీట్లను కూడా దోస్త్‌ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. గతంలో అడ్మిషన్లు అసలు జరగని కాలేజీల పేర్ల జాబితాను ఈ ఏడాది తొలగించారు. 15 మంది కంటే తక్కువ విద్యార్థులు చేరే కాలేజీలను అనుమతించరు. అక్కడి విద్యార్థులను ఇతర కాలేజిలకు సర్దుబాటు చేయనున్నారు. డిగ్రీ సీట్ల భర్తీలో ఈడబ్ల్యుసీ కోటాను అమలు చేస్తారు.  కాలేజీలకు సంబంధించి జీపీఎ్‌సను అనుసంధానించనున్నారు.



Updated Date - 2022-06-30T16:56:44+05:30 IST