డిగ్రీ కళాశాల కలేనా!

ABN , First Publish Date - 2022-05-18T06:40:30+05:30 IST

వడ్డాదిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు తొమ్మిదేళ్ల నుంచి కలగానే మిగిలింది. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ఉన్నత విద్యా శాఖ అధికారులు వడ్డాదికి డిగ్రీ కళాశాల మంజూరైందని, కొత్త భవనాలు నిర్మించే వరకు జూనియర్‌ కాలేజీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తామన్నారు.

డిగ్రీ కళాశాల కలేనా!

వడ్డాదికి కాలేజీ మంజూరైనట్టు తొమ్మిదేళ్ల క్రితం ఆర్‌జేడీ ప్రకటన

2014-15 విద్యా సంవత్సరంలో ప్రారంభం అవుతుందని వెల్లడి

రాష్ట్ర విభజనతో అటకెక్కిన ప్రతిపాదన

రెండు ప్రభుత్వాలు మారినా పట్టించుకోని ప్రజాప్రతినిధులు

ఉన్నత విద్యకు దూరమవుతున్న బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల విద్యార్థులు

బుచ్చెయ్యపేట, మే 17:  వడ్డాదిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు తొమ్మిదేళ్ల నుంచి కలగానే మిగిలింది. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ఉన్నత విద్యా శాఖ అధికారులు వడ్డాదికి డిగ్రీ కళాశాల మంజూరైందని, కొత్త భవనాలు నిర్మించే వరకు జూనియర్‌ కాలేజీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తామన్నారు. దీంతో బుచ్చెయ్యపేట, రావికమతంతోపాటు వడ్డాదికి సమీపంలో వున్న మాడుగుల, చీడికాడ మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకులు శ్రద్ధ చూపకపోవడంతో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నోచుకోలేదు. 

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన చోడవరం, మాడుగులలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వున్నాయి. మాడుగుల కాలేజీ స్థానిక మండల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో వుంది. పైగా ఈ కాలేజీకి ఇంతవరకు సొంత వసతి సమకూరలేదు. జూనియర్‌ కళాశాల భవనాల్లో షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలతోపాటు చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల విద్యార్థులు డిగ్రీ చదవాలంటే చోడవరం కాలేజీపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇక్కడ ఒక్కో సంవత్సరంలో 200 సీట్లు మాత్రమే వున్నాయి. కానీ ఆరు మండలాల్లో ఏటా రెండు వేల మందికిపైగా విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పూర్తిచేస్తున్నారు. చోడవరం కాలేజీలో సీట్లు లభించక ఎంతో మంది విద్యార్థులు చదువు మధ్యలో ఆపేస్తున్నారు. ముఖ్యంగా బాలికలు ఇంటర్‌తో మానేయాల్సి వస్తున్నది. ఆర్థిక స్థోమత వున్న వారు అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరంలోని ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు రాజకీయ పార్టీ నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

తొమ్మిదేళ్ల క్రితం సీఎం ఆదేశాలు

ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు ముందు 2013లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వడ్డాదికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చోడవరం, మాడుగులలో మాత్రమే డిగ్రీ కాలేజీలు వుండడంతో ఇంటర్మీడియట్‌ తరువాత డిగ్రీలో సీట్లు లభించక ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు అర్ధంతరంగా చదువు మానేయాల్సి వస్తున్నదని సీఎంకు వివరించారు. వడ్డాదిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే బుచ్చెయ్యపేట, రావికమతం, చీడికాడ మండలాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. సానుకూలంగా స్పందించిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి... వడ్డాదిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 

జూనియర్‌ కళాశాల భవనాలు పరిశీలన

ఉన్నత విద్యా శాఖ అప్పటి ఆర్‌జేడీ గంగేశ్వరరావు  2013 నవంబరులో వడ్డాది వచ్చి డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం జూనియర్‌ కళాశాల భవనాలను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం (2014-15) డిగ్రీ కళాశాల ప్రారంభం అవుతుందని, సొంత భవనాలు నిర్మించే వరకు జూనియర్‌ కళాశాల భవనాల్లో షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. దీంతో బుచ్చెయ్యపేట, రావికమతం, మండలాల విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజు పట్టించుకోలేదు. వడ్డాదిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది. అధికార పార్టీకి చెందిన ధర్మశ్రీ ఎమ్మెల్యేగా వున్నారు. వడ్డాదికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించి వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి తరగతులు ప్రారంభించేలా కృషి చేయాలని రెండు మండలాల విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2022-05-18T06:40:30+05:30 IST