నత్తనడక!

ABN , First Publish Date - 2022-07-06T05:10:56+05:30 IST

జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకూ సగమే పూర్తయ్యింది. ఇంకా సగం మంది రైతులు ఈకేవైసీ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సాగు ప్రోత్సాహానికిగాను ఏటా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో మూడుసార్లు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద

నత్తనడక!

జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియలో జాప్యం

సగమే పూర్తయిన వైనం

ఆసక్తిచూపని రైతులు

మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

(టెక్కలి)

జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకూ సగమే పూర్తయ్యింది. ఇంకా సగం మంది రైతులు ఈకేవైసీ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సాగు ప్రోత్సాహానికిగాను ఏటా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో మూడుసార్లు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.7,500 అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేలను సైతం తన ఖాతాలో వేసి.. రూ.13,500 లు అందిస్తున్నట్టు చెబుతోంది. అయితే గతంతో పోల్చుకుంటే రకరకాల కారణాలు చూపుతూ రైతులకు పథకాన్ని దూరం చేస్తూ వస్తోంది. తాజాగా ప్రతీ రైతుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఇందుకుగాను గడువు సైతం విధించింది. కానీ రైతులు పెద్దగా ఆసక్తికనబరచడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గడువు పెంచుతూ వస్తున్నా ఫలితం లేకపోతోంది. తొలుత మే 31 వరకూ అవకాశమిచ్చారు. తరువాత మరోసారి గడువు పెంచారు. కానీ ఆశించిన స్థాయిలో రైతులు ముందుకు రావడం లేదు. ఈకేవైసీ చేయించుకోవడం లేదు. 2019 ఫిబ్రవరి 1కు ముందు వెబ్‌ల్యాండ్‌లో నమోదైన ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఎస్టీ రైతులు, కౌలురైతులు, ఇనాం, దేవాదాయ భూములు దున్నుతున్న రైతులకు రైతుభరోసా మినహా ... పీఎం కిసాన్‌ ఇచ్చే పరిస్థితి లేనందున వారికి ఈకేవైసీ అవసరం లేదు. రైతు సమీప ఆధార్‌, మీసేవ, నిర్ధేశించిన బ్యాంకులు వద్ద ఈకేవైసీ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే స్మార్ట్‌ఫోన్‌ గల రైతులు ఆధార్‌కు ఫోన్‌ నెంబరు లింకై ఉంటే ఓటీపీ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంది.

- జిల్లాలో 3,22,706 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకూ 1,38,028 మంది మాత్రమే ప్రక్రియ పూర్తిచేశారు. ఇంకా 1,84,678 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. జిల్లాలో  సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, సంతబొమ్మాళి, లావేరు, కోటబొమ్మాళి, సారవకోట, పొందూరు, నందిగాం, గార, ఎచ్చెర్ల, పాతపట్నం తదితర మండలాల్లో 50 శాతం వరకూ ఈకేవైసీ పూర్తికాగా... ఇచ్ఛాపురం, కంచిలి, మందస, కవిటి, బూర్జ, నరసన్నపేట, సోంపేట, పలాస, పోలాకి, కొత్తూరు మండలాల్లో వెనుకబాటు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ 57శాతం మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. పూర్తిచేసేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం 

పీఎం కిసాన్‌ ఈకేవైసీ జరిపించుకోవాలని క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈకేవైసీ ప్రాధాన్యత, ప్రయోజనాలపై రైతులకు వివరిస్తున్నాం. ఈనెల 31 వరకు ఈకేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వెబ్‌ల్యాండ్‌లో నమోదైన ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి.

- బీవీ తిరుమలరావు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, టెక్కలి.

Updated Date - 2022-07-06T05:10:56+05:30 IST