కొనుగోలులో జాప్యం

ABN , First Publish Date - 2021-05-07T04:25:01+05:30 IST

వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది. దాంతో కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొనుగోలులో జాప్యం
ఆత్మకూరు కొనుగోలు కేంద్రంలో నిండిన ధాన్యం

కేంద్రాల్లోనే వరి ధాన్యం 

కాంటా చేయడానికి 10 రోజులు..

కాంటా చేసిన ధాన్యాన్ని తరలించడానికి 4 నుంచి 5 రోజులు..

తాలు పేర క్వింటాలుకు 2 కిలోలు కట్‌ 

అన్నదాత ఆందోళన 

వనపర్తి జిల్లాలో రబీలో 1,44,935 ఎకరాల్లో వరి సాగు

230కిపైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు


ఆత్మకూరు, మే 5: వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది. దాంతో కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది రబీలో వరి రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తోంది. జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రాలు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా రవాణా, మిల్లర్ల ఎంపిక, గన్నీ బ్యాగుల కొరత వంటి కారణాలతో ధాన్యం కొనుగోలులో ఆలస్యం అవుతోంది. కేంద్రానికి ధాన్యం తెచ్చి 10 రోజులు గడుస్తున్నా, కొనుగోలు చేయక పోవడంతో రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కాంటా చేసిన ధాన్యాన్ని 4 నుంచి 5 రోజులుగా తరలించకపోవడంతో ధాన్యం తరుగు ఏర్పడుతుందని క్వింటాల్‌కు 2 నుంచి 3 కిలోలు కటింగ్‌ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.


1,44,935 ఎకరాల్లో సాగు

జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉన్నందున వరిని రైతులు ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. రబీలో 1,44,935 ఎకరాల్లో వరి నాటారు. 3,99,199 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సింగిల్‌విండో ద్వారా 122, ఐకేపీ ద్వారా 75, మార్క్‌ఫెడ్‌ ద్వారా 4, మెప్మా ద్వారా ఒక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 36 వేల మెట్రిక్‌ టన్నులే కొన్నారంటే కొనుగోలులో ఎంత జాప్యం ఉందో తెలుస్తోంది. కొనుగోలు వేగవంతం చేయడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు , 10 రా రైస్‌ మిల్లులను ఏర్పాటు  చేశామని, రవాణా వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు అంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం జాప్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు.


తరుగు పేర కోత

గింజ నాణ్యత లేదని, తాల్లు ఎక్కువగా ఉందని మిల్లర్స్‌ క్వింటాలుకు 2 కిలోలు లేదా బ్యాగుకు కిలో కటింగ్‌ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 తేమ శాతం, 5 తాలు శాతం ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలున్నాయి. ఒక బ్యాగుకు 41 కిలోల 20 గ్రాముల కాంట చేస్తున్నారు. అందులోనే 650 గ్రాముల ఖాళీ బస్తా బరువు, 550 గ్రాముల తాలు బరువు కలుపుకొని ఉంటుంది. కానీ అదనంగా కాంటా చేసి మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, ఎలాంటి కటింగ్‌లు లేకుండా మిల్లర్స్‌ యజమాన్యంతో చర్చించాలని కోరుతున్నారు. 


పది రోజులుగా పడిగాపులు

ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తెచ్చి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. రోజుకు ఒక లారీ వస్తుంది. ఒక రైతు లేదా ఇద్దరు రైతుల ధాన్యం మాత్రమే తరలి స్తున్నారు. ఇలాగే అయితే రెండు నెలలు అయినా కూడా కొనుగోలు పూర్తయ్యే అవకాశం లేదు. వర్షం ఎప్పుడు వస్తుందో అన్న భయాందోళనతో రేయింబవళ్లు ధాన్యం వద్దే పడిగాపులు కాస్తున్నా.

- బుడ్డన్న, మూలమల్ల, వరి రైతు

Updated Date - 2021-05-07T04:25:01+05:30 IST