రీడింగ్‌లో జాప్యం.. బిల్లులపై అధనం

ABN , First Publish Date - 2021-05-20T05:17:30+05:30 IST

టెక్కలిలోని ఓ వ్యక్తి ఇంటిలో ఏప్రిల్‌ 5న విద్యుత్‌ వినియోగానికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌ తీశారు. ఆ ఇంటిలో వాడిన విద్యుత్‌ను బట్టి రూ.200 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అదే ఇంటికి సంబంధించి ఈ నెలలో 10వ తేదీన రీడింగ్‌ తీశారు. బిల్లు రూ.450 వచ్చింది. వేసవి కాలం కదా... ఆ మొత్తం కట్టాల్సి వచ్చిందని వినియోగదారుడు అనుకున్నాడు. కానీ ఇక్కడే మతలబు ఉంది. ప్రతి నెలా నిర్ణీత తేదీన బిల్లు తీయకపోతే.... ఒక్క రోజు ఆలస్యమైనా వినియోగించిన యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. తద్వారా శ్లాబ్‌ (కేటగిరీ) మారిపోతుంది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులు ఇదే తరహాలో తమకు తెలియకుండా అదనపు భారాన్ని మోస్తున్నారు. రీడింగ్‌ తీసేవారి మాయజాలంతో నష్టపోతున్నారు.

రీడింగ్‌లో జాప్యం.. బిల్లులపై అధనం

- గడువు దాటించి వినియోగం లెక్కింపు

- పెరుగుతున్న యూనిట్లు

- వినియోగదారులపై విద్యుత్‌ బిల్లుల భారం

- శ్లాబ్‌ మారుతుండడంతో కష్టాలు

(టెక్కలి)

టెక్కలిలోని ఓ వ్యక్తి ఇంటిలో ఏప్రిల్‌ 5న విద్యుత్‌ వినియోగానికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌ తీశారు. ఆ ఇంటిలో వాడిన విద్యుత్‌ను బట్టి రూ.200 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అదే ఇంటికి సంబంధించి ఈ  నెలలో 10వ తేదీన రీడింగ్‌ తీశారు. బిల్లు రూ.450 వచ్చింది. వేసవి కాలం కదా... ఆ మొత్తం కట్టాల్సి వచ్చిందని వినియోగదారుడు అనుకున్నాడు. కానీ ఇక్కడే మతలబు ఉంది. ప్రతి నెలా నిర్ణీత తేదీన బిల్లు తీయకపోతే.... ఒక్క రోజు ఆలస్యమైనా వినియోగించిన యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. తద్వారా శ్లాబ్‌ (కేటగిరీ) మారిపోతుంది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులు ఇదే తరహాలో తమకు తెలియకుండా అదనపు భారాన్ని మోస్తున్నారు. రీడింగ్‌ తీసేవారి మాయజాలంతో నష్టపోతున్నారు.
.............................

కరోనా కష్టకాలంలో విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. మీటర్‌ రీడింగ్‌లో జాప్యం కారణంగా శ్లాబ్‌ విధానం మారిపోతోంది. తద్వారా అధికంగా బిల్లులు వస్తుండడంతో వినియోగదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో 8,67,433 మంది గృహ వినియోగదారులు ఉన్నారు. నెలకు 89.17 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. గృహ అవసరాల కింద విద్యుత్‌ వినియోగదారులను ఎ, బి, సీ కేటగిరీలుగా అధికారులు విభజించారు. ప్రతినెల 4 నుంచి 11వ తేదీ వరకు, 14 నుంచి 21 వరకు రెండు విడతలుగా క్షేత్రస్థాయిలో మీటర్‌ రీడింగ్‌  తీస్తుంటారు. ప్రస్తుతం మీటర్‌ రీడింగ్‌ సకాలంలో తీయడం లేదు. నాలుగైదు రోజులు ఆలస్యంగా తీస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి.. శ్లాబ్‌ మారిపోతోంది. ఫలితంగా వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. కన్స్యూమర్‌ చార్జీలు కూడా రీడింగ్‌ల ప్రాప్తికే వసూలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల మీటర్లు తనిఖీ చేయకుండానే ముందు నెల విద్యుత్‌ వాడకాన్ని బట్టి బిల్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌టీ విద్యుత్‌ వినియోగానికి సంబంధించి ఏ-విభాగంలో సున్నా నుంచి 50 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి రూ.1.45 చార్జీ పడుతుంది. 51 నుంచి 75 యూనిట్ల వరకూ రూ.2.60 చొప్పున చెల్లించాలి.  అంటే రీడింగ్‌ తీసినప్పుడు 50 యూనిట్లకు ఒక్క యూనిట్‌ దాటినా చాలు.. వినియోగదారుడిపై రూ.58.65 అదనపు భారం పడుతుంది. దీనితోపాటు తొలి 50 యూనిట్ల లోపు రూ.25, 51 యూనిట్ల నుంచి రూ.30 చొప్పున కన్స్యూమర్‌ చార్జి వసూలు చేస్తారు. 

- గ్రూప్‌-బిలో 0-100 లోపు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 చొప్పున, 101-200 వరకు రూ.3.60 చొప్పున, 201 నుంచి 225 వరకు రూ.6.90 చొప్పున వసూలు చేస్తారు. మొదటి 50లోపు రూ.35, తర్వాత చెరో 50 యూనిట్లకు రూ.5 చొప్పున కన్స్యూమర్‌ చార్జి కింద బిల్లు వేస్తారు. 

- ఇక గ్రూప్‌ సీ-విభాగంలో 0-50లోపు ఒక్కో యూనిట్‌కు రూ.2.65 చొప్పున, 51-100 వరకూ రూ.3.35 చొప్పున, 101-200 వరకు రూ.5.40 చొప్పున, 201 నుంచి 300 వరకు రూ.7.10 చొప్పున వసూలు చేస్తారు. 301-400 వరకు రూ.7.95 చొప్పున, 401 -500 వరకు రూ.8.50 చొప్పున, 500 యూనిట్లు దాటితే రూ.9.95 చొప్పున వసూలు చేస్తారు. 50 యూనిట్లలోపు రూ.35, తర్వాత 100 యూనిట్లలోపు రూ.40, ఆపై ప్రతి 100 యూనిట్లకు చెరో రూ.5 చొప్పున కన్స్యూమర్‌ చార్జి వసూలు చేయనున్నారు. 

 ప్రస్తుతం ఉష్ణోగ్రతల ప్రభావం.. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో చాలామంది ప్రజలు ఇళ్లల్లోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. కానీ మీటర్‌ రీడింగ్‌లో జాప్యం కారణంగా యూనిట్ల సంఖ్య పెరిగి.. శ్లాబ్‌ విధానం మారి తమపై అదనపు భారం పడుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో డీఈఈ రవికుమార్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కరోనా వేళ రీడింగ్‌ తీసేందుకు వెళ్లిన సిబ్బందికి కొందరు సహకరించడం లేదన్నారు. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌ తీసేటప్పుడు ఎక్కువ బిల్లు వస్తే సంబంధిత ఏడీకి బిల్లుతో పాటు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే మళ్లీ రీడింగ్‌ పరిశీలించి.. బిల్లులు తగ్గిస్తామని తెలిపారు.  

Updated Date - 2021-05-20T05:17:30+05:30 IST