పాఠ్య పుస్తకాల రాకలో జాప్యం

Published: Thu, 26 May 2022 01:07:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠ్య పుస్తకాల రాకలో జాప్యం

ఫొటోలు : బుక్స్‌ పోల్డర్‌లో ఉన్నాయి


ఉమ్మడి జిల్లాకు 39.62 లక్షల పుస్తకాలు అవసరం

గత ఏడాది 9.64 లక్షలు మిగులు

ఈ ఏడాది ఇప్పటివరకు 4.5 లక్షల పుస్తకాలు రాక

మిగిలినవి దశల వారీగా వస్తాయంటున్న అధికారులు

నేటి నుంచి మండలాలకు సరఫరా

ఎనిమిదో తరగతికి కొత్త సిలబస్‌


విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

పాఠ్య పుస్తకాల రాకలో ఈ ఏడాది కొంత జాప్యం జరుగుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కోసం ఇప్పటివరకు 4.5 లక్షల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. మిగిలినవి దశల వారీగా రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి పది తరగతుల వరకు 3.62 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తోంది. ఈ లెక్కన 39,62,000 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా 4.5 లక్షలు వచ్చాయి. అయితే గత ఏడాది జిల్లాకు వచ్చిన పుస్తకాల్లో 9,64,352 మిగిలాయి. దీనిని గ్రౌండ్‌ బ్యాలెన్స్‌గా పరిగణిస్తారు. ఆ బ్యాలెన్స్‌ను మినహాయించగా జిల్లాకు 30 లక్షల పుస్తకాలు అవసరమని అధికారులు నివేదిక పంపారు. దీని ప్రకారం ఇప్పటివరకు జిల్లాకు 4.5 లక్షల పుస్తకాలు వచ్చాయి. వీటిని గాజువాక ఆటోనగర్‌లోని గోదాములో ఉంచారు. గోదాముల నుంచి పుస్తకాలను మండలాలకు పంపే బాధ్యతను ప్రజా రవాణా సంస్థకు అప్పగించారు. ఇందుకోసం ఒక్కొక్క పుస్తకానికి 86 పైసలు పాఠశాల విద్యాశాఖ చెల్లించనున్నది. తొలుత నగర పరిధిలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం డీఈవో చంద్రకళ గాజువాక ఆటోనగర్‌లో గల గోదాముల వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు. జిల్లాకు రావలసిన మిగిలిన పుస్తకాలు దశలవారీగా రానున్నాయని అధికారులు వివరించారు. జూలై తొలి వారంలో పాఠశాలలు తెరిచేలోగా మండల విద్యాఖాధికారి కార్యాలయాలకు పుస్తకాలు పంపుతామంటున్నారు. ఎంఈవో కార్యాలయాల నుంచి ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు తీసుకువెళతారని వివరించారు. ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో తరగతికి కొత్త సిలబస్‌ రూపొందించడంతో పాఠ్యపుస్తకాలు మారనున్నాయి. ఎక్కువగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో పుస్తకాలు ముద్రించారు. 

ఎంఈవోల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పంపిణీ

ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు సంబంధితమండల విద్యాశాఖాధికారి కార్యాలయాల నుంచి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి ఆయా పాఠశాలల యాజమాన్యాలను పాఠ్య పుస్తకాల కోసం ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ కోరారు. తొలుత ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సరఫరా పూర్తిచేసిన తరువాత ప్రైవేటు విద్యా సంస్థలకు ఇండెంట్‌ మేరకు కేటాయిస్తారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.