నత్తనడకన వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-07-21T06:03:29+05:30 IST

కొవిడ్‌ టీకాల మందు సరిపడా జిల్లాకు సరఫరా కాకపోవడంతో వ్యాక్సినేషన్‌ నత్తనడకన సాగుతోంది.

నత్తనడకన వ్యాక్సినేషన్‌

- వారంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఐదు రోజులే..

- జిల్లా జనాభాలో 34.5 శాతం మందికి టీకా

- ఏ రోజుకు ఆ రోజే టీకాల మందు సరఫరా

- సరిపడా నిల్వలు లేకపోవడమే కారణం

- సరఫరా పెంచాలని కోరుతున్న ప్రజలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కొవిడ్‌ టీకాల మందు సరిపడా జిల్లాకు సరఫరా కాకపోవడంతో వ్యాక్సినేషన్‌ నత్తనడకన సాగుతోంది. దీనికి తోడు వారానికి ఐదు రోజులే వ్యాక్సిన్‌ వేయాలని నిబంధన విధించడం, రోజుకు పీహెచ్‌సీల్లో 150 నుంచి 200 మందికి, సివిల్‌ ఆసుపత్రుల్లో 500 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిబంధన విధించారు. ఆసుపత్రులకు టీకాల మందును కూడా ఏ రోజు మందు అదేరోజున సరఫరా చేస్తున్నారు. ఒకవేళ సరఫరా లేకుంటే ముందు రోజు సాయంత్రం డాక్టర్లను సమాచారం ఇస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆశా కార్యకర్తలు ప్రజలకు తెలుపుతున్నారు. స్టాకు సరిపడా రాకపోవడంతో టీకాల వేగం తగ్గుతున్నది. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు వరకు 20 రోజుల్లో 39,261 మందికి టీకాలు వేయగా, జూన్‌ 20 నుంచి 30వ తేదీ వరకు 49,888 మందికి వేశారు. దీనిని బట్టి చూస్తే టీకాల మందు ఎంత తక్కువగా జిల్లాకు సరఫరా అవుతున్నదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం సరిపడా స్టాకు లేని కారణంగా కేవలం కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే 794 మందికి టీకాలు వేశారు. ప్రభుత్వం సరిపడా స్టాకును సరఫరా చేయని కారణంగా టీకాలు వేయడంలో వేగం పెరగడం లేదు. సరిపడా స్టాకు ఉన్నట్లయితే ఈ పాటికి జిల్లా ప్రజలందరికీ మొదటి విడత డోస్‌ పూర్తయి ఉండేది. 

టీకాపై పెరిగిన ఆసక్తి..

జిల్లా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 7,95,332 మంది ఉండగా, ఇందులో 18 ఏళ్లలోపు పిల్లలు లక్షకు పైగానే ఉంటారు. ఇప్పటివరకు జిల్లాలో 2,75,197 డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వగా, ఇందులో మొదటి డోస్‌ 2,41,666 మందికి ఇవ్వగా, రెండు డోసులు 33,531 మందికి టీకాలు వేశారు. జిల్లాలోని ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సింగరేణి ఆసుపత్రుల్లో టీకాలు వేస్తున్నారు. జిల్లాకు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ మందును సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు టీకాలు వేసిన వారిలో 2,49,210 డోసులు కోవి షీల్డ్‌, 25,987 డోసులు కోవాగ్జిన్‌ వేశారు. అత్యధికంగా కోవిషీల్డ్‌ సరఫరా అవుతున్నది. 18-44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో 1,21,805 మందికి, 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 94,813 మందికి, 60 ఏళ్ల పైబడిన వారిలో 58,578 మందికి వ్యాక్సిన్‌ వేశారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంత వాసులతో పాటు గ్రామీణ ప్రాంత వాసులు కూడా టీకాలు వేయించుకునేందుకు బాగానే ఆసక్తి చూపుతున్నారు. మొదటి డోసు వేసుకున్న చాలా మంది రెండవ డోసు కోసం ఎదురు చూస్తున్నారు. స్టాక్‌ లేని కారణంగానే ప్రభుత్వం రెండవ డోసు వేసుకునే సమయాన్ని తరచూ పెంచుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొదట రెండవ డోసు 30 రోజుల్లోనే వేసిన ప్రభుత్వం ఆ తర్వాత 12 వారాలకు పెంచింది. ఇటీవల మరల కూడా వ్యవధిని పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

థర్డ్‌ వేవ్‌ భయం..

థర్డ్‌ వేవ్‌ కరోనా వస్తుందనే భయంతో చాలా మంది వణికి పోతున్నారు. పక్క జిల్లాలతో పోలిస్తే జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేట్‌ తగ్గుముఖం పట్ట లేదు. ఆదివారం మినహా మిగతా వారాల్లో వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో టీకాలు వేసే సంఖ్యను పెంచేందుకు స్టాకును ఎక్కువ మొత్తంలో పంపాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా వేయించుకున్న తర్వాత కరోనా వచ్చిన వాళ్లలో 95 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్టాకు లేకపోవడం వల్ల టీకాలు వేసే కార్యక్రమం మందకొడిగా సాగుతున్నది. 18 సంవత్సరాలు నిండిన వారిలో ఇంకా 4,25,000 మందికి మొదటి డోస్‌ టీకా వేయాల్సి ఉన్నది. వీరందరికీ టీకాలు వేయాలంటే ఈ ఏడాది గడిచేలా ఉన్నది. థర్డ్‌ వేవ్‌ను, జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేట్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లాకు ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ మందును సరఫరా చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-21T06:03:29+05:30 IST