సీలేరు-ఆర్వీనగర్‌ రహదారి పనుల జాప్యంపై నిలదీత

Published: Wed, 25 May 2022 00:52:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీలేరు-ఆర్వీనగర్‌ రహదారి పనుల జాప్యంపై నిలదీత ఆర్‌అండ్‌బీ అధికార్లను నిలదీస్తున్న సీలేరు పట్టణ ప్రముఖులు


ఆర్‌అండ్‌బీ అధికారులతో సీలేరు ప్రముఖులు వాగ్వాదం

సీలేరు, మే 24: ‘‘సీలేరు-ఆర్వీనగర్‌ రోడ్డు పనులు ఎన్ని సంవత్సరాలు చేస్తారు.. ఈ అధ్వాన రహదారి వలన ఎందరి రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో మీకు తెలుసా.. ఇందుకు ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యమే కారణం.. ఆర్‌వీనగర్‌-పాలగెడ్డ రహదారి విస్తరణకు మంజూరైన రూ.84 కోట్లు మీ వల్లే ఏమయ్యాయో కూడా తెలియలేదంటూ’’ సీలేరు పట్టణ ప్రముఖులు ఆర్‌అండ్‌బీ పాడేరు డివిజన్‌ ఈఈ బాలసుందరబాబుపై మండిపడ్డారు. మంగళవారం నర్సీపట్నం-సీలేరు రోడ్డు పనుల పరిశీలనకు ఆర్‌అండ్‌బీ క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇన్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ పాడేరు డివిజన్‌ అధికారులు జెన్‌కో గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీలేరు పట్టణ ప్రముఖులు   గెస్టుహౌస్‌ వద్దకు చేరుకుని, క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇన్‌కు ఆర్‌వీనగర్‌-పాలగెడ్డ రోడ్డు పనుల జాప్యంపై తమ గోడును విన్నవించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పాడేరు ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు కలుగజేసుకుని పనులు జరుగుతున్నాయి కదా ఎందుకు గొడవ చేస్తున్నారని అనడంతో సీలేరు పట్టణ ప్రముఖుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారుల  నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు దుస్థితి ఇలా తయారైందంటూ ధ్వజమెత్తారు. దీంతో క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇన్‌ వెంకటేశ్వరరావు కలుగజేసుకుని పట్టణ ప్రముఖులకు నచ్చజెప్పారు. త్వరలోనే మీ రహదారి సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు. అల్లూరు జిల్లా కలెక్టర్‌ ఈ రహదారిపై దృష్టి సారించారని వివరించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.