'Kaali' poster row: ఫిలిం మేకర్ లీనా మణిమేకలైపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-07-06T20:45:30+05:30 IST

కాళీ మాత సిగరెట్ కాల్చుతున్నట్లు కనిపించే ఓ పోస్టర్‌ను విడుదల చేసిన

'Kaali' poster row: ఫిలిం మేకర్ లీనా మణిమేకలైపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో కేసులు నమోదు

లక్నో : కాళీ మాత సిగరెట్ కాల్చుతున్నట్లు కనిపించే ఓ పోస్టర్‌ను విడుదల చేసిన ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ లీనా మణిమేకలైపై ఉత్తర ప్రదేశ్‌లోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోనూ, ఢిల్లీలోనూ ప్రథమ సమాచార నివేదిక (FIR)లు నమోదయ్యాయి. ఆమె రూపొందించిన ‘కాళీ’ అనే లఘు చిత్రానికి సంబంధించిన ఈ పోస్టర్‌పై అడ్వకేట్లు వేద్ ప్రకాశ్ శుక్లా, వినీత్ జిందాల్ వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. 


లీనా విడుదల చేసిన ‘కాళీ’ లఘు చిత్రం తాలూకు పోస్టర్ ఓ మతానికి చెందినవారి మనోభావాలను గాయపరుస్తోందని వేద్ ప్రకాశ్ శుక్లా ఆరోపించారు. ఈ ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నవారిలో ఫిలిం ఎడిటర్ శ్రావణ్ ఒనచన్, నిర్మాత ఆషా అసోసియేట్స్ కూడా ఉన్నాయి. నేరపూరిత కుట్ర, దేశ సమగ్రతకు భంగం కలిగించే ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం; ఏదైనా మతాన్ని కించపరిచే ఉద్దేశంతో ప్రార్థనా స్థలాలను మలినపరచడం, అపవిత్రం చేయడం వంటి నేరారోపణలను వీరందరిపైనా  నమోదు చేశారు.  


మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా లీనాపై కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వినీత్ జిందాల్ ఫిర్యాదుపై స్పందిస్తూ, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి ఆరోపణలతో ఈ కేసును నమోదు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 


ఇండియన్ హై కమిషన్ అభ్యంతరం

ఇదిలావుండగా, స్మోకింగ్ కాళీ పోస్టర్‌పై కెనడాలోని భారత హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలను తక్షణమే ఉపసంహరించాలని కెనడా అధికారులను, ఈవెంట్ ఆర్గనైజర్లను కోరింది. హిందూ దేవతలను కించపరుస్తూ ఈ పోస్టర్‌ను ప్రచురించారని తమకు కెనడాలోని హిందూ నేతలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. 


ఫిలిం మేకర్ లీనా మణిమేకలై సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కాళీ మాత వస్త్ర ధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ కాల్చుతున్నట్లు ఈ పోస్టర్‌లో ఉంది. ఈ దేవత చేతిలో ఎల్‌జీబీటీక్యూప్లస్‌కు చెందిన జెండాను ధరించినట్లు కనిపించింది. 


లీనాకు ఆర్జేడీ మద్దతు

ఇదిలావుండగా, లీనా మణిమేకలైకు రాష్ట్రీయ జనతా దళ్ బుధవారం మద్దతు పలికింది. ఆమె గొప్ప దర్శకురాలని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ఈరోజుల్లో ప్రజల మతపరమైన మనోభావాలు చాలా సులువుగా దెబ్బతింటున్నాయన్నారు. మన మతం చాలా సున్నితమైనదైపోయిందన్నారు. ప్రతి విషయానికీ తలక్రిందులైపోతోందన్నారు. ‘‘లీనా గారు ఓ సినిమా తీశారు. ఆమె గొప్ప చిత్రాలను నిర్మించారు. వెనుకబడిన తరగతులవారి సమస్యలను ఆమె ఎలుగెత్తి చాటారు’’ అని చెప్పారు. 


Updated Date - 2022-07-06T20:45:30+05:30 IST