ఢిల్లీ కీలక విజయం
4 వికెట్లు తీసిన ఠాకూర్
పంజాబ్ పరాజయం
ముంబై: బౌలర్ల అండతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పేసర్ శార్దూల్ ఠాకూర్ (4/36) ఈ కీలక మ్యాచ్‌లో అదరగొట్టగా.. స్పిన్నర్లు అక్షర్ (2/14), కుల్దీప్ (2/14) పూర్తిగా కట్టడి చేశారు. దీంతో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగుల తేడాతో నెగ్గింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఢిల్లీ నాలుగో స్థానానికి చేరగా.. ఈ ఓటమితో పంజాబ్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది.
ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63), సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) రాణించారు. లివింగ్‌స్టోన్, అర్ష్‌దీ్‌పలకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. జితేశ్ శర్మ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), బెయిర్‌స్టో (15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 28) మాత్రమే ఆకట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శార్దూల్ నిలిచాడు.
బౌలర్లదే ఆధిపత్యం:
ఓపెనర్లు బెయిర్‌స్టో, ధవన్ ధనాధన్ ఆటతీరును ప్రదర్శించడంతో పంజాబ్‌కు మెరుపు ఆరంభమే దక్కింది. కానీ ఆరంభంలో శార్దూల్ ఆ తర్వాత స్పిన్నర్ల ధాటికి వికెట్లనే కాపాడుకోలేకపోయింది. ఆఖర్లో జితేశ్ ఎదురుదాడితో గెలుపుపై ఆశలు పెంచుకున్నా.. ఫలితం లేకపోయింది. దూకుడు మీదున్న బెయిర్‌స్టోను నాలుగో ఓవర్లో నోకియా అవుట్ చేయగా.. శార్దూల్ ఒకే ఓవర్లో రాజపక్స (4), ధవన్ (19) వికెట్లను తీసినా.. పవర్‌ప్లేలో 54/3 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. ఆ తర్వాత కుల్దీప్, అక్షర్ ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు.
మయాంక్‌ను అక్షర్ డకౌట్ చేయగా.. ఆ వెంటనే లివింగ్‌స్టోన్ (3), హర్‌ప్రీత్ (1)లకు వరుస ఓవర్లలో కుల్దీప్ షాకిచ్చాడు. రిషి ధవన్ (4) కూడా నిరాశపర్చగా 82/7 స్కోరుతో జట్టు ఓటమి అంచున నిలిచింది. అయితే జితేశ్ ఎదురుదాడికి దిగడంతో ఉత్కంఠ పెరిగింది. అతడికి చాహర్ (25 నాటౌట్) కూడా సహకరించాడు. ఇక 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన వేళ శార్దూల్ మరోసారి ఢిల్లీకి అండగా నిలిచాడు. 18వ ఓవర్లో జితేశ్, రబాడ (6)ను అవుట్ చేయడంతో పంజాబ్ ఆశలు వదులుకుంది.
మార్ష్ పోరాటం:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మార్ష్, సర్ఫరాజ్ స్లోపిచ్‌పై జట్టుకు విలువైన పరుగులు అందించారు. అంతకుముందు తొలి బంతికే ఓపెనర్ వార్నర్‌ను లివింగ్‌స్టోన్ అవుట్ చేశాడు. ఆనక అర్ష్‌దీప్ ఐదో ఓవర్లో ఓ స్లో బంతికి సర్ఫ్‌రాజ్‌ను అవుట్ చేశాడు. మరోవైపు అర్ష్‌దీప్ ఓవర్లో లలిత్ అవుటయ్యాక నిర్లక్ష్యపు ఆటతీరుతో పంత్ (7), పావెల్ (2) వికెట్లను కోల్పోయారు. మరో ఎండ్‌లో మార్ష్ ఓపిగ్గా ఆడుతూ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు అక్షర్ (17 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు 37 రన్స్ జోడించాడు. 19వ ఓవర్లో మార్ష్‌ను రబాడ, ఆఖరి ఓవర్లో శార్దూల్ (3)ను అర్ష్‌దీప్ వెనక్కి పంపడం జట్టును దెబ్బతీసింది.
స్కోరుబోర్డు
ఢిల్లీ:
వార్నర్ (సి) చాహర్ (బి) లివింగ్‌స్టోన్ 0, సర్ఫరాజ్ (సి) చాహర్ (బి) అర్ష్‌దీప్ 32, మార్ష్ (సి) రిషి ధవన్ (బి) రబాడ 63, లలిత్ (సి) రాజపక్స (బి) అర్ష్‌దీప్ 24, పంత్ (స్టంప్డ్) జితేశ్ (బి) లివింగ్‌స్టోన్ 7, పావెల్ (సి) శిఖర్ (బి) లివింగ్‌స్టోన్ 2, అక్షర్ పటేల్ (నాటౌట్) 17, శార్దూల్ (సి) హర్‌ప్రీత్ (బి) అర్ష్‌దీప్ 3, కుల్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 159/7; వికెట్ల పతనం: 1-0, 2-51, 3-98, 4-107, 5-112, 6-149, 7-154; బౌలింగ్: లివింగ్‌స్టోన్ 4-0-27-3, రబాడ 3-0-24-1, హర్‌ప్రీత్ బ్రార్ 3-0-29-0, రిషి ధవన్ 2-0-17-0, అర్ష్‌దీప్ సింగ్ 4-0-37-3, రాహుల్ చాహర్ 4-0-19-0.
పంజాబ్:
బెయిర్‌స్టో (సి) అక్షర్ (బి) నోకియా 28, శిఖర్ ధవన్ (సి) పంత్ (బి) శార్దూల్ 19, రాజపక్స (సి) నోకియా (బి) శార్దూల్ 4, లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 3, మయాంక్ అగర్వాల్ (బి) అక్షర్ 0, జితేశ్ శర్మ (సి) వార్నర్ (బి) శార్దూల్ 44, హర్‌ప్రీత్ బ్రార్ (బి) కుల్దీప్ 1, రిషి ధవన్ (బి) అక్షర్ 4, రాహుల్ చాహర్ (నాటౌట్) 25, రబాడ (సి) పావెల్ (బి) శార్దూల్ 6, అర్ష్‌దీప్ సింగ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 142/9; వికెట్ల పతనం: 1-38, 2-53, 3-54, 4-55, 5-61, 6-67, 7-82, 8-123, 9-131; బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-43-0, నోకియా 4-0-29-1, లలిత్ యాదవ్ 1-0-6-0, శార్దూల్ ఠాకూర్ 4-0-36-4, అక్షర్ పటేల్ 4-0-14-2, కుల్దీప్ యాదవ్ 3-0-14-2.