Chief Ministers: కేజ్రీవాల్‌కే ఆహ్వానం ఎందుకబ్బా?

ABN , First Publish Date - 2022-09-04T13:29:23+05:30 IST

‘పుదుమై పెణ్‌’ పథకం ప్రారంభోత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Delhi Chief Minister Kejriwal)ను ఆహ్వానించడం

Chief Ministers: కేజ్రీవాల్‌కే ఆహ్వానం ఎందుకబ్బా?

- రాజకీయవర్గాల్లో చర్చ

- రేపు నగరానికి రానున్న ఢిల్లీ సీఎం


చెన్నై, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘పుదుమై పెణ్‌’ పథకం ప్రారంభోత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Delhi Chief Minister Kejriwal)ను ఆహ్వానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పొరుగున వున్న ఏపీ, కేరళ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కాదని, మిత్రపక్షమైన కాంగ్రెస్‌ సీఎంలను తోసిపుచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలకడం డీఎంకేలోనే ఆసక్తి రేపుతోంది. ఈ పథకం గురించి జాతీయస్థాయిలో చర్చజరగాలనుకుంటే కేంద్రప్రభుత్వంలో కీలకంగా వున్న నేతలను ఆహ్వానించవచ్చు. వారు తమకు రాజకీయ ప్రత్యర్థులు గనుక మిత్రపక్షాన్నే పిలవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ భావిస్తే.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని ఆహ్వానించవచ్చు. ఎలాగూ ఒకటీ రెండు రోజుల్లో ఆయన కన్నియాకుమారి(Kanniyakumari)కి వస్తున్నందున ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనవచ్చు. కానీ వీరందరినీ కాదని, అంతగా సాన్నిహిత్యం లేని ఢిల్లీ ముఖ్యమంత్రిని  స్టాలిన్‌ ఎందుకు పిలిచారంటూ చర్చలు సాగుతున్నాయి. కేజ్రీవాల్‌ సోమవారం నగరానికి రానున్న నేపథ్యంలో ఈ ఆసక్తి మరింత పెరిగింది. నిజానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం వెనుక రెండు ప్రయోజనాలున్నట్లు తెలుస్తోంది. 


రేపు  ‘పుదుమై పెణ్‌’ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి డిగ్రీ, తత్సమాన తరగతుల్లో చేరే విద్యార్థినులకు నెల నెలా రూ.1000 అందించే పథకం ‘పుదుమై పెణ్‌’ సోమవారం ప్రారంభం కానుంది. ఉన్నత విద్యాభ్యాసం చేసే బాలికలకు ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుందన్నది నిర్వివాదాంశం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని డీఎంకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ పథకం అమలుపై ఇప్పటికే రకరకాలుగా చర్చించిన పిదప, ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. కాగా ఢిల్లీలో అమలవుతున్న విద్యారంగం దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. అక్కడి విద్యాబోధన, పాఠశాలలకు మౌళిక సదుపాయాల కల్పన, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే తీరు అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) గత ఏప్రిల్‌లో ఢిల్లీ వెళ్లి అక్కడి విద్యా విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఢిల్లీ తరహాలో తమిళనాడులోనూ మోడల్‌ స్కూళ్లను ప్రవేశపెడతామని అక్కడే ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్వాగతం పలికిన తీరు, ఆయన అమలు చేస్తున్న ప్రణాళికలు స్టాలిన్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే విద్యాభ్యాసం చేసే బాలికలను ఆదుకునేందుకు అమలు చేయనున్న పథకం ప్రారంభోత్సవం కోసం కేజ్రీవాల్‌ను సీఎం ఆహ్వానించినట్లు ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకప్పటి సివిల్‌ సర్వీస్‌ అధికారి అయిన కేజ్రీవాల్‌ను రప్పించడం ద్వారా విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపినట్లవుతుందని స్టాలిన్‌ భావిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. 


బీజేపీని గట్టిగా ఢీకొడుతున్నందుకేనా?

ఆదిలో ఏమాత్రం చరిష్మాలేని కేజ్రీవాల్‌ ‘ఆమ్‌ ఆద్మీ’ పార్టీని స్థాపించడంతో పాటు అనతికాలంలోనే అనూహ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అంతేగాక పొరుగునే వున్న పంజాబ్‌ పీఠంపైనా పార్టీని ప్రతిష్ఠింపజేశారు. తదుపరి లక్ష్యంగా గుజరాత్‌ను ఎన్నుకుని ఆ మేరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని చూసి జంకుతున్నప్పటికీ, కేజ్రీవాల్‌ మాత్రం ఆ పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. ఢిల్లీలోని తన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక ముప్పును సైతం తనదైన శైలిలో అధిగమించి, అసెంబ్లీలో విశ్వాసం పొందారు. తద్వారా కమలదళాన్ని తెలివిగా ఎదుర్కొంటున్నారన్న ప్రశంసలూ రాజకీయ విశ్లేషకుల నుంచి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే ఇప్పట్లో కాంగ్రెస్‌ ప్రభ వెలిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఫ్రంటే బీజేపీతో తలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ఫ్రంట్‌లో కేజ్రీవాల్‌ పాత్ర క్రియాశీలకమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అందుకే కాంగ్రె్‌సతో నెయ్యం నెరపుతూనే దూరదృష్టితో కేజ్రీవాల్‌తో స్నేహం మంచిదని స్టాలిన్‌ యోచిస్తున్నారని డీఎంకేలోని విశ్వసనీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో కలిసి సాగే అవకాశం ఎలాగూ లేనందున.. తనలా ఆ పార్టీతో తలపడే దృఢమైన నేతను దరి చేర్చుకోవడం మేలన్న ఉద్దేశంతోనే స్టాలిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నిజానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన పథకం ప్రారంభోత్సవానికి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడమనేది బహు అరుదు. అయితే కేజ్రీవాల్‌ రాకతో రెండు రకాల ప్రయోజనా నెరవేరుతాయన్న ఉద్దేశంతోనే స్టాలిన్‌ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారని సమాచారం.

Updated Date - 2022-09-04T13:29:23+05:30 IST