Delhi Excise Policy: ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2022-08-22T22:00:53+05:30 IST

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్‌లో తనపై పెట్టిన అన్ని కేసులనూ బీజేపీలో చేరితే క్లోజ్ చేస్తామని కమలనాథులు ఆఫర్ ఇచ్చారని కేసులో ప్రధాన నిందితుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు.

Delhi Excise Policy: ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో కొత్త ట్విస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్‌లో తనపై పెట్టిన అన్ని కేసులనూ బీజేపీలో చేరితే క్లోజ్ చేస్తామని కమలనాథులు ఆఫర్ ఇచ్చారని కేసులో ప్రధాన నిందితుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఆప్‌ను చీల్చి బీజేపీలో చేరితే తనను సీఎంను కూడా చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా ఆడియో ప్రూఫ్ కూడా ఉందని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. అంతేకాదు తాను మహారాణా ప్రతాప్ వంశస్తుడనని, తల నరుక్కుంటా కానీ బీజేపీలో చేరబోనని చెప్పారు.


సిసోడియా, కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ విరుచుకుపడింది. ఢిల్లీ మద్యం స్కామ్‌లో పీకల్లోతు మునిగిన ఆప్ అగ్రనేతలు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు మనోజ్ తివారీ, కపిల్ సిబాల్, పర్వేశ్ వర్మ, అనురాగ్‌సింగ్ ఠాకూర్ విమర్శించారు. సిసోడియాలాంటి అవినీతిపరులను బీజేపీలో చేర్చుకోబోమన్నారు. ఢిల్లీ మద్యం స్కామ్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సిసోడియా, కేజ్రీవాల్ యత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రులను గొప్పవారిగా కీర్తిస్తూ కేజ్రీవాల్ సర్టిఫికెట్ ఇస్తున్నారని ఠాకూర్ విమర్శించారు. అవినీతిపై ప్రశ్నలకు ఆప్ నేతల వద్ద సమాధానాలు లేవని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా చెప్పారు.   








మద్యం స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు  దాడులు నిర్వహించారు.


       గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు




ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విఫలమైందని కేజ్రీవాల్ చెప్పారు. సిసోడియాలాంటి విద్యామంత్రి దేశంలోనే లేరని ఆయనకు భారత రత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-22T22:00:53+05:30 IST