ఢిల్లీలో కాలుష్యం నివారణకు lockdown...సుప్రీంకు ఢిల్లీ సర్కారు ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2021-11-15T12:48:55+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని నివారించేందుకు లాక్‌డౌన్ విధించాలని ఢిల్లీ సర్కారు ప్రతిపాదించింది...

ఢిల్లీలో కాలుష్యం నివారణకు lockdown...సుప్రీంకు ఢిల్లీ సర్కారు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని నివారించేందుకు లాక్‌డౌన్ విధించాలని ఢిల్లీ సర్కారు ప్రతిపాదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ విధివిధానాలపై సోమవారం సుప్రీంకోర్టుకు ప్రతిపాదనను సమర్పించనుంది.ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపర్చడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను కోరిన కొద్ది రోజుల తర్వాత వాహనాల రాకపోకలను ఆపడం, దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ను విధించడం వంటి చర్యలను ప్రతిపాదించింది. శీతాకాలం ప్రారంభంతో ఢిల్లీలో గాలి నాణ్యత ప్రతి సంవత్సరంలాగే ప్రమాదకర స్థాయికి పడిపోయింది. 


పొలాల్లో గోధుమ పొట్టు దహనం, వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం, నగరం వెలుపల ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు,బహిరంగంగా చెత్తను కాల్చడం, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది.ఫెడరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఈ సంవత్సరం ఢిల్లీ నగరంతోపాటు చుట్టుపక్కల గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 500 స్కేల్‌పై 470-499కి దిగజారింది. ఆ స్థాయి కాలుష్యం అంటే ఇప్పటికే ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉన్నవారిని కూడా గాలి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.పరిస్థితి భయంకరంగా ఉండటంతో ఆప్ ప్రభుత్వం నవంబరు 20 వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది.


సోమవారం నుండి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయమని కోరింది. నవంబర్ 17 వరకు నిర్మాణ కార్యకలాపాలను కూడా నిషేధించింది.అన్ని విద్యాసంస్థలు నవంబర్ 20 వరకు మూసివేశామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీలో డీజిల్ జనరేటర్ సెట్లు, బొగ్గు బట్టీలను మూసివేయాలని, పార్కింగ్ ఫీజులను పెంచాలని, కాలుష్యాన్ని తగ్గించడానికి మెట్రో, బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని కూడా ఆప్ ప్రభుత్వం సూచించింది.ఈ అన్ని అత్యవసర చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం నగరంలో వాహనాలు, ధూళి కాలుష్యాన్ని తగ్గించడమేనని రాయ్ చెప్పారు. నగరంలో దుమ్మును అరికట్టేందుకు 400 ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు. 4 వేల ఎకరాల పొలాల్లో పొట్టు కుళ్లిపోకుండా బయో డీకంపోజర్‌ సొల్యూషన్స్‌ పిచికారీ చేసే పనిని ప్రభుత్వం నవంబర్‌ 20 నాటికి పూర్తి చేయనుంది.


Updated Date - 2021-11-15T12:48:55+05:30 IST