కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు

ABN , First Publish Date - 2020-11-19T20:45:01+05:30 IST

ఢిల్లీలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు

కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు

న్యూఢిల్లీ : ఢిల్లీలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తాజాగా చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటాన్ని తప్పుబట్టింది. ‘‘మీరు నిద్ర మత్తులో జోగుతున్నారు, మేం ప్రశ్నలు అడిగే సరికి తలక్రిందులయ్యారు’’ అని కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడింది. 


అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటీవల వివాహాలకు హాజరయ్యే అతిథుల సంఖ్యపై ఆంక్షలు విధించింది. దీనిని హైకోర్టు ప్రస్తావిస్తూ పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల సంఖ్యపై ఆంక్షలు విధించడానికి 18 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ సమయంలో కోవిడ్-19 వల్ల ఎందరు మరణించారని ప్రశ్నించింది. 


భౌతిక దూరం పాటించనివారిపైనా, మాస్క్ ధరించనివారిపైనా విధించదలచిన జరిమానా ఈ నిబంధనలను ఉల్లంఘించకుండా నిరోధించే స్థాయిలో లేదని హైకోర్టు పేర్కొంది. 


ఢిల్లీలో బుధవారం 7,486 కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. 131 మంది ఈ వ్యాధితో బుధవారం మరణించారు. ఈ వ్యాధి కారణంగా సంభవించిన మరణాల్లో ఒకే రోజులో ఇంత ఎక్కువ మంది మరణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,943కు పెరిగింది. 


ఢిల్లీలో వైద్య సంస్థలపై ఒత్తిడి ఉండటంతో పారామిలిటరీ దళాలకు చెందిన 45 మంది డాక్టర్లు, 160 మంది పారామెడిక్స్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలావుండగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అక్టోబరు 31న జారీ చేసిన ఆదేశాల్లో వివాహాలకు 200 మంది అతిథులను ఆహ్వానించవచ్చునని తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో బుధవారం ఈ ఆదేశాలను సవరించింది. వివాహ కార్యక్రమాలకు గరిష్ఠంగా 50 మంది అతిథులు మాత్రమే హాజరుకావచ్చునని నిర్దేశించింది. 


Updated Date - 2020-11-19T20:45:01+05:30 IST