వహ్వా.. ఢిల్లీ

Published: Mon, 28 Mar 2022 04:18:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వహ్వా.. ఢిల్లీ

లలిత్‌, అక్షర్‌ 

వీరోచిత పోరాటం

ముంబైపై విజయం


ముంబై: ఓటమి ఖాయమనుకున్న దశలో లలిత్‌ యాదవ్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 నాటౌట్‌) చూపిన పోరాటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత విజయాన్ని అందించింది. 178 పరుగుల భారీ ఛేదనలో ఓ దశలో ఢిల్లీ 104/6 స్కోరుతో కష్టాల్లో పడింది. కానీ పట్టు వీడని ఈ టెయిలెండర్‌ జోడీ 30 బంతుల్లో 75 పరుగులను జోడించింది. దీంతో ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో శుభారంభం చేసింది. 2012 నుంచి  ఐపీఎల్‌లో ముంబై తొలి మ్యాచ్‌లో ఓడుతూనే ఉంది. కుల్దీప్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (81 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో తుదికంటా నిలిచాడు. కాగా కుల్దీప్‌ ముందుగా కెప్టెన్‌ రోహిత్‌ను అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.


ఆ తర్వాత వికెట్లు వేగంగా పడినా అరంగేట్ర మ్యాచ్‌ ఆడిన హైదరాబాదీ తిలక్‌ వర్మ (22) ఆకట్టుకున్నాడు. ఇక 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన ఇషాన్‌ జోరుతో చివరి ఐదు ఓవర్లలో జట్టు 59 రన్స్‌ సాధించగలిగింది. అనంతరం ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. అయితే 14వ ఓవర్‌లో శార్దూల్‌ వికెట్‌ కోల్పోయాక ఢిల్లీ విజయం కష్టమే అనిపించింది. 17వ ఓవర్‌ వరకు మ్యాచ్‌ ముంబై వైపే కనిపించింది. కానీ లలిత్‌-అక్షర్‌ జోడీ మాత్రం పట్టు వీడలేదు. 18వ ఓవర్‌లో అక్షర్‌ రెండు సిక్సర్లు, లలిత్‌ 6,4తో 24 రన్స్‌ రాబట్టడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. 


ముంబై:

20 ఓవర్లలో 177/5 (ఇషాన్‌ 81 నాటౌట్‌, రోహిత్‌ 41, తిలక్‌ వర్మ 22; కుల్దీప్‌ 3/18, ఖలీల్‌ 2/27). ఢిల్లీ: 18.2 ఓవర్లలో 179/6 (లలిత్‌ 48 నాటౌట్‌, అక్షర్‌ 38 నాటౌట్‌, పృథ్వీ షా 38; థంపీ 3/35, ఎం.అశ్విన్‌ 2/14).

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.