Delhi: ఆప్ ఉచిత విద్యుత్ పథకంపై దర్యాప్తునకు ఢిల్లీ ఎల్‌జీ ఆదేశం

ABN , First Publish Date - 2022-10-05T00:05:40+05:30 IST

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మరోసారి ఆప్ సర్కార్‌‌పై..

Delhi: ఆప్ ఉచిత విద్యుత్ పథకంపై దర్యాప్తునకు ఢిల్లీ ఎల్‌జీ ఆదేశం

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai kumar saxena) మరోసారి ఆప్ సర్కార్‌‌కు షాక్ ఇచ్చారు. ఆప్ సర్కార్ ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్జీ ఆదేశాలిచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను ఆయన ఆదేశించినట్టు ఎల్జీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ చర్యపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌  మండిపడ్డారు. ఎల్జీ చర్యను గుజరాత్ ఎన్నికలతో ముడిపెడుతూ, ఇది ఉచిత విద్యుత్‌కు గండిగొట్టే ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు.


కేజ్రీవాల్ ప్రభుత్వ పవర్ సబ్సిడీ పథకంలో అవకతవకలకు ఉన్నాయంటూ ఎల్జీ సెక్రటేరియట్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వినయ్ కుమార్ సక్సెనా తాజా ఆదేశాలిచ్చినట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆప్ ప్రభుత్వం బీఎస్ఈఎస్‌ (BSES)లకు ఇస్తున్న పవర్ సబ్సిడీలో అవకతవకలు జరిగాయని వారు చెబుతున్నారు.


గుజరాత్‌లో ఆప్ హామీకి గండికొట్టేందుకే...

కాగా, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీకి గండికొట్టేందుకే బీజేపీ ఇలాంటి అవాతంరాలు సృష్టిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీకి గుజరాత్‌లో చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. ఆ కారణంతోనే ఢిల్లీలో ఉచిత విద్యుత్‌ను నిలిపివేయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత విద్యుత్ నిలిపివేయకుండా చూస్తామని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో భరోసా ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచాలని వారిని కోరారు. గుజరాత్ ప్రజలకు సైతం ఆయన భరోసా ఇస్తూ....అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అధికారంలోకి రాగానే మార్చి 1వ తేదీ నుంచి అక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.


కాగా, ఢిల్లీ సర్కార్ ఉచిత విద్యుత్ పథకంలో అవకతలు ఉన్నట్టు ఆరోపిస్తున్న వారిలో ప్రముఖ లాయర్లు, న్యాయకోవిదులు ఉన్నట్టు ఎల్జీ కార్యాలయం తెలిపింది. దీనిపై బీఎస్ఈఎస్ మాత్రం ఇంకా స్పందించ లేదు.

Updated Date - 2022-10-05T00:05:40+05:30 IST