Kavitha: నాకు ఎటువంటి నోటీసు రాలేదు: కవిత

ABN , First Publish Date - 2022-09-17T00:07:47+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులిచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Kavitha: నాకు ఎటువంటి నోటీసు రాలేదు: కవిత

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులిచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆమె ఖండించారు. తనకు ఎటువంటి నోటీసు రాలేదని ప్రకటించారు. ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ట్విట్టర్‌లో విమర్శించారు. వాస్తవాలను చూపించడానికి సమయాన్ని వెచ్చించాలని మీడియా సంస్థలకు కవిత విజ్ఞప్తి చేశారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు.. తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేస్తున్నానని కవిత తెలిపారు. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు కవిత అకౌంటెంట్(Kavitha Accountant) ఇంట్లో సోదాలు నిర్వహించారు. 


గురువారం ఉదయం నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్‌లో 25 బృందాలతో సోదాలు చేశారు. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, దోమలగూడ, ఇందిరాపార్క్ దగ్గర శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో తనిఖీలు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో పలువురు వ్యాపారవేత్తలకు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పలు కంపెనీలకు సీఏగా పనిచేసినవారిపైనా ఈడీ దాడులు చేసింది. అంతేకాకుండా పలు సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నారు. 18 కంపెనీలకు, 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేశారు. అరవిందో ఫార్మా, పిక్నీన్ ఎంటర్ ప్రైజెస్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గానామిక్స్ ఈకో సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చింది. 


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal), డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. తెలంగాణ (Telangana), పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి లిక్కర్ విధానం అమలు చేస్తున్నారని దాన్నే ఢిల్లీలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీని పూర్తి బాధ్యతలను మనీష్ సిసోడియాకు అప్పగించారు. ఈ దందాలో మనీష్ సిసోడియా ప్రమేయం ఉందని సీబీఐ అధికారుల తేల్చారు. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధానం రూపొందించిందని తెలిపారు. కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ డీల్‌లో భాగస్వామిగా ఉన్నారని, హైదరాబాద్‌ కోకాపేటకు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఢిల్లీకి ఆమె తీసుకువచ్చారని పర్వేశ్‌ వర్మ ఆరోపించారు. 

Updated Date - 2022-09-17T00:07:47+05:30 IST