ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. ఆ నలుగురి ఖాతాలపైనే ఈడీ గురి

ABN , First Publish Date - 2022-09-23T10:47:27+05:30 IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. ఆ నలుగురి ఖాతాలపైనే ఈడీ గురి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం..  ఆ నలుగురి ఖాతాలపైనే ఈడీ గురి

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా... ప్రధానంగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సమీర్‌ మహేంద్రుతోపాటు వ్యాపారి అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, మధ్యవర్తులు అరుణ్‌ పాండ్య, విజయ్‌ నాయర్‌ల బ్యాంకు ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థల లావాదేవీలపైన ఈడీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా రిజిస్టర్‌ అయిన ఇండో స్పిరిట్‌ కంపెనీకి సమీర్‌ మహేంద్రు ఎండీగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ స్కాంలో హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపారి పిళ్లై కొన్ని కోట్ల రూపాయలను అరుణ్‌ పాండ్య, విజయ్‌ నాయర్‌ల మధ్యవర్తిత్వంతో ఢిల్లీకి చేర్చినట్లు సీబీఐ ఆరోపించింది. ఆ మొత్తం ఎక్కడి నుంచి సమకూర్చారు, ఆ సమయంలో ఏ బ్యాంకు ఖాతా, లాకర్‌ నుంచి డబ్బులు సర్దుబాటు చేశారనే లెక్కలు తేల్చే పనిలో ఈడీ ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రధానంగా డొల్ల కంపెనీల ద్వారానే ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు నగదు సర్దుబాటు చేసినట్లు ఈడీ ప్రాథమిక విచారణలోనే గుర్తించింది. అయితే అందుకు అవసరమైన మరిన్ని ఆధారాల్ని అధికారులు సేకరిస్తున్నారు. ఈ నలుగురితోపాటు మరికొంత మంది నగదు లావాదేవీలపైనా ఈడీ ఆధారాలు సేకరిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో తనిఖీలు, ఆధారాల సేకరణ, ప్రాథమిక విచారణ దాదాపుగా పూర్తి కావడంతో... పిళ్లై, శ్రీనివాసరావుతోపాటు మరికొందర్ని ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి విచారించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా కేసు తదుపరి దర్యాప్తునకు, న్యాయస్థానంలో నేరం రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాల సేకరణపై ఈడీ ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయి.

Updated Date - 2022-09-23T10:47:27+05:30 IST