
న్యూఢిల్లీ : భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నకిలీ యాప్‌తో వేలాది మంది ఖాతాదారులను మోసగిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ యాప్‌ను ఉపయోగించుకోవడానికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడానికి KYC వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఖాతాదారులను కోరుతూ, మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
SBI Yono app మాదిరిగా ఈ నకిలీ యాప్‌ను తయారు చేసి, వేలాది మందిని మోసగిస్తున్నందుకు దేశవ్యాప్తంగా 23 మందిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు శాఖలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ తెలిపింది. ఫిషింగ్ లింక్స్ ద్వారా కస్టమర్లను ఈ నకిలీ యాప్ వైపునకు ఆకర్షించిన వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఈ నకిలీ యాప్‌లోకి తమ వివరాలను ఖాతాదారులు అప్లోడ్ చేసిన తర్వాత, OTP సహా అన్ని వివరాలు అడ్మిన్ కంట్రోల్ ద్వారా ఈ మోసగాళ్లకు తెలిసిపోతున్నాయని చెప్పింది.
డీసీపీ (స్పెషల్ సెల్) కేపీఎస్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ, నిందితుల నుంచి 58 మొబైల్ ఫోన్లు, 12 ల్యాప్‌టాప్‌లు, 20 డెబిట్ కార్డులు, 200 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని పరిశీలించినపుడు పెద్ద ఎత్తున నేరంగా పరిగణించదగిన సమాచారం తమకు తెలిసిందని చెప్పారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్ష చేయవలసి ఉందని చెప్పారు. సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లను పరిశీలించిన తర్వాత 820 కేసులకు, వీటికి సంబంధం ఉందని నిర్థరించినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ పోర్టల్‌లో అనేక ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు.
ఎస్బీఐ కస్టమర్ల నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నట్లు ఢిల్లీ పోలీసు శాఖలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ గుర్తించిందన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, ఒకే విధంగా ఉన్న 100 ఫిర్యాదులను గుర్తించామని, వీటిలో 51 ఫిర్యాదులు ఢిల్లీ నుంచి వచ్చాయని తెలిపారు.
నిందితులు గుజరాత్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లు, డిజిటల్ ట్రెయిల్స్ ఒకే సమయంలో రాడార్ పరిధి నుంచి తప్పించుకుంటాయని, దీనినిబట్టి వీరంతా నిరంతరం ఒకరితో మరొకరు మాట్లాడుకుంటున్నట్లు వెల్లడవుతోందని చెప్పారు. దీంతో పోలీసులకు పెను సవాలు ఎదురైందన్నారు. ఒక నిందితుడిని అరెస్టు చేస్తే, మిగతావారంతా జాగ్రత్తపడి, ఆచూకీ దొరకకుండా ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోతారని చెప్పారు. దీంతో ఏడు చోట్ల ఏక కాలంలో సోదాలు చేయడానికి వ్యూహాన్ని రచించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన దర్యాప్తు చేసి, ఇంటింటి వివరాలు రాబట్టి, వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సూరత్‌లో 12 మందిని, కోల్‌కతాలో ఆరుగురిని, గిరిధ్, ధన్‌బాద్‌లలో ఇద్దరు చొప్పున, జామ్తారాలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో 13 మంది వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నారు. ఈ ముఠాలోని మిగతా సభ్యులను అరెస్టు చేసేందుకు గాలింపు జరుగుతోందన్నారు. అత్యాధునిక పరికరాల సహాయంతో ఈ ముఠా గుట్టును రట్టు చేయగలిగినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి