థ్యాంక్స్ చెప్పిన తెల్లారే తెల్లమొహం.. ఆక్సిజన్‌పై ఢిల్లీ గగ్గోలు..

ABN , First Publish Date - 2021-05-07T23:45:50+05:30 IST

ఆక్సిజన్ సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పిన తెల్లారే ఆమాద్మీ పార్టీ ప్రభుత్వానికి మళ్లీ నిరాశే ఎదురైన...

థ్యాంక్స్ చెప్పిన తెల్లారే తెల్లమొహం.. ఆక్సిజన్‌పై ఢిల్లీ గగ్గోలు..

న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పిన తెల్లారే ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ ప్రభుత్వానికి మళ్లీ నిరాశే ఎదురైన వైనమిది. తమకు గురువారం 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా... కేవలం 577 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందంటూ ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ జల్ బోర్డు చైర్మన్‌ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మొత్తం అవసరమైన దాంట్లో ఇది 59 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. గురువారం రాత్రి వివిధ ఆస్పత్రుల నుంచి తొమ్మిది అత్యవసర కాల్స్ వచ్చాయనీ... ఈ ఆస్పత్రులకు 5.1 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను అందించినట్టు ఆయన తెలిపారు. కాగా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం దేశ రాజధాని ఢిల్లీకి బుధవారం 730 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును పంపిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్‌ అందడం ఇదే తొలిసారి కావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపైనా ఇలాగే కొనసాగిస్తే ఢిల్లీ ప్రజలంతా మోదీకి రుణపడి ఉంటారంటూ ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ మరుసటి రోజే ఢిల్లీకి అవసరానికంటే 153 మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చిందంటూ చద్దా పేర్కొన్నారు. కాగా గడచిన వారంలో ఢిల్లీకి సరాసరిన 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, 498 మెట్రిక్ టన్నులు మాత్రమే అందడం గమనార్హం. 

Updated Date - 2021-05-07T23:45:50+05:30 IST