బార్డోలీ స్ఫూర్తితో ఢిల్లీ సత్యాగ్రహం

ABN , First Publish Date - 2020-12-16T09:03:27+05:30 IST

దేశంలో ఏ కీలక పరిణామం జరిగినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్కు వెళుతుంటారు. తన స్వంత రాష్టానికి వెళ్లినప్పుడల్లా...

బార్డోలీ స్ఫూర్తితో ఢిల్లీ సత్యాగ్రహం

కొత్త సాగు చట్టాల విషయంలో రైతులను ఒప్పించేందుకు మోదీ ప్రభుత్వం మొండిగా కాకుండా నిజాయితీతో ప్రయత్నించాలి.సమస్యలు తలెత్తినప్పుడల్లా మనశ్శాంతికోసమో, ఆత్మవిశ్వాసం కోసమో గుజరాత్ వెళ్లడంలో తప్పేమీ లేదు. ఇదే గుజరాత్‌కు చెందిన మహత్మా గాంధీ 1918లో ఖేడాలోనూ, ఉక్కుమనిషి సర్దార్ పటేల్ 1928లో బార్డోలీలోనూ పన్నులకు వ్యతిరేకంగా రైతాంగంతో సత్యాగ్రహాలు నిర్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధిక్కరించిన విషయం విస్మరించరాదు. అప్పుడు ప్రభుత్వమే వెనక్కు తగ్గి కమిషన్‌లు నియమించి సమస్యలను పరిష్కరించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్నది సత్యాగ్రహమేనని మోదీ అర్థం చేసుకుంటే దేశానికి శ్రేయస్కరం.


దేశంలో ఏ కీలక పరిణామం జరిగినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్కు వెళుతుంటారు. తన స్వంత రాష్టానికి వెళ్లినప్పుడల్లా ఆయనకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఎందుకంటే గుజరాత్ ఆయన జన్మభూమి మాత్రమే కాదు, అక్కడి నుంచే ఆయన విజయ పరంపర ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పుడో, కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడో తన వారితో ఆనందం పంచుకోవాలని ఆయన అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే దేశంలో అత్యంత కీలకమైన క్లిష్ట సమస్య తలెత్తి, పరిస్థితి అగమ్యగోచరంగా మారినప్పుడు కూడా ఆయన ఆత్మవిశ్వాసం పుంజుకునేందుకు గుజరాత్ వెళ్లాల్సి రావడం, అక్కడి ప్రజల మధ్య తన నిర్ణయాలను సమర్థించుకోవాల్సి రావడం కూడా జనం గమనించకపోలేదు. ఒకవైపు దేశ రాజధానిలో గత 20 రోజులుగా రైతులు నిరవధిక ఆందోళనలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తూ అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తుంటే వారితో చర్చలకు పూనుకోకుండా ఆయన గుజరాత్ వెళ్లి పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న కచ్‌లోని రైతులతో సంభాషించడానికి పూనుకోవడం విచిత్రంగా కనిపిస్తోంది.


ఇవాళ దేశ రాజధానిలో చలి పెరుగుతున్న కొద్దీ మోదీకి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆత్మ నిర్భర్ పేరిట ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతున్నట్లు కనపడడం లేదు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, కొవిడ్‌కు ముందున్న ఆర్థిక పరిస్థితికి చేరుకుంటామని ప్రతి రెండు రోజులకోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన మంత్రులు, కొందరు అనుకూల ఆర్థిక వేత్తలు చెబుతున్నప్పటికీ, ఏవో నాటకీయ సర్వేలు విడుదలవుతున్నప్పటికీ పరిస్థితి అంత ఆశాజనకంగా కనపడడంలేదు. ఈ ఏడాది తలసరి జీడీపీ అంచనాలు 11 శాతం తగ్గిపోతాయని, భారత దేశం బంగ్లాదేశ్ కంటే పేద దేశంగా మారిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. భారత్ 2022 చివరికి గాని మునుపటి స్థితికి చేరుకోలేదని ఐఎంఎఫ్ అంచనా. నిజానికి ఈ అంచనాలతో కూడా విభేదించేవారున్నారు. భారత్ కొవిడ్‌కు ముందున్న పరిస్థితికి చేరుకోవడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందని భావిస్తున్న ఆర్థిక వేత్తలున్నారు. ఎన్ని చేసినా ఆర్థిక వ్యవస్థ మునుపటి పరిస్థితికి చేరుకోవడం, తమ మనుగడ కోసం రోజుకో సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ నిర్మాణాత్మక కార్యక్రమాలను విస్మరిస్తున్న రాష్ట్రాలు నిధుల కోసం కేంద్రప్రభుత్వ తలుపులు తట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి అనేక రాష్ట్రాల్లో పెట్టుబడి వ్యయం పడిపోవడం, రహదారులు, విద్యుత్ ప్లాంట్లు, ప్రాజెక్టులు మొదలైన వాటిపై పెట్టుబడులు పెరకపోవడం వల్ల అభివృద్ది రేటు పుంజుకోవడం లేదని అనేవారు కూడా ఉన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ హయాంలో కూడా అనేక ప్రాజెక్టులు నత్త నడక నడవడం ప్రారంభమైంది. బహుశా ఈ పరిస్థితి నుంచి దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, ఏదో ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు హడావిడి చేయడం ఆర్థికవేత్తల దృష్టి దాటిపోలేదు. వ్యవసాయ చట్టాలు చేయడం, దేశంలోని పెట్టుబడిదార్లకు, కార్పొరేట్లకు గ్రామాల్లో కూడా స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే బృహత్తర ధ్యేయం తమకున్నట్లు చెప్పుకోవడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందా, లేక విపరీత పర్యవసానాలకు దారితీస్తుందా అన్నది కూడా చర్చనీయాంశం.


అయితే తాను చేసిన రైతు చట్టాలు రైతుల్లో ఇంత ఆందోళన సృష్టిస్తాయని, దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా దేశ రాజధాని పొలిమేరల్లో లక్షలాది మంది రైతులు రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారన్న విషయం మోదీ తరఫు వ్యూహకర్తలు అంచనా వేసినట్లు లేదు. పంజాబ్ నుంచి అత్యధిక రైతులు కనపడుతున్నప్పటికీ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లనుంచి కూడా రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. పంజాబ్, రాజస్థాన్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు మద్దతు ప్రకటించినందువల్ల వారు స్వేచ్ఛగా ఢిల్లీకి చేరుకుంటే, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ రాష్ట్రాల రైతులపై ఎన్ని అడ్డంకులు విధించినా వారిలో కొందరు సరిహద్దులకు చేరుకోగలిగారు. జైపూర్–ఢిల్లీ జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోగా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఢిల్లీ- నోయిడా మార్గాన్ని కూడా స్తంభింపచేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. రైతుల ఆందోళన వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రతి రోజూ రూ.3 వేలకోట్ల నుంచి రూ.3500కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోందని పరిశ్రమల సమాఖ్య అస్సోచామ్ ప్రకటించింది. 


పరిస్థితి ఇలా ఉంటే తాము ఒక సమస్యను పరిష్కరించలేని పరిస్థితి తలెత్తినప్పుడు ఆ సమస్యకు రంగులు అద్దడం, మసిపూసి మారేడు కాయ చేయడం, జనాన్ని భయభ్రాంతులను చేయడం ద్వారా సమస్యను నీరుకార్చేలా చేయడం అనే వ్యూహాలను మోదీ ప్రభుత్వం తరుచూ అమలు పరచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిసారీ ఇలాంటి వికృత వ్యూహాలు, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో బూటకపు ప్రచారాల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మార్చడం అంత సులభం కాదు. ఎవరు అవునన్నా, కాదన్నా మౌలికంగా ఇవి దాదాపు 40 రైతు సంఘాలు నిర్వహిస్తున్న రైతుల నిరసన ప్రదర్శనలు. ఈ ప్రదర్శనకు అనేకమంది సంఘీభావం ప్రకటించడం తర్వాత జరిగిన పరిణామం. అంతేకాని మొత్తం ప్రదర్శనలను రైతులను కాక ఇతర శక్తులు నిర్వహిస్తున్నాయని ఆరోపించడం, వారిని ఉగ్రవాదులు, ఖలిస్తాన్ శక్తులుగా తూర్పారబట్టడంలో అర్థం ఉన్నట్లు కనపడడం లేదు


జూలైలో ఆర్డినెన్స్‌లు జారీ చేసి సెప్టెంబర్‌లో కొవిడ్ సమయంలో పెద్దగా చర్చలకు వీలు కల్పించకుండా వాటిని ఆమోదింపచేసి వ్యవసాయరంగంలో తామేదో విప్లవం సాధించామని మోదీ ప్రభుత్వం చెప్పుకోవడానికి ప్రయత్నించిన తీరు బెడిసికొట్టిందనడంలో సందేహం లేదు. రైతు సంఘాలతో చట్టాల్లో ప్రతి క్లాజు గురించీ చర్చిస్తామని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పుడు ప్రకటించారు కాని పార్లమెంట్లో ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులపై క్లాజుల వారీగా చర్చించి స్థాయీ సంఘానికి నివేదించమని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను తామే తిరస్కరించిన విషయం ఆయన గుర్తు చేసుకోవాలి. సెప్టెంబర్‌లో బిల్లును స్థాయీ సంఘానికి నివేదించినా, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించినా ఒక వాతావరణం ఏర్పడి ఉండేది. కాని అప్పుడు చర్చించకుండా ఇప్పుడు క్లాజుల వారీగా చర్చిస్తామని ప్రకటిస్తే ప్రయోజనం ఏమిటి? విచిత్రమేమంటే ఇప్పుడు ప్రభుత్వం శీతాకాల సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. శీతాకాల సమావేశాలు నిర్వహించినా అవి గందరగోళంలో పడతాయని ప్రభుత్వానికి తెలుసు. అంతేకాక ప్రతిపక్షాలు సంఘటితం కావడానికి, ప్రభుత్వం ఆత్మ విమర్శలో పడడానికి ఈ సమావేశాలు దోహదం చేయవచ్చు. ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ హత్య వంటి కీలక సమయాల్లో శీతాకాల సమావేశాలు జరగలేదు. ఇప్పుడే విపత్కర పరిస్థితి తలెత్తిందో ప్రభుత్వమే చెప్పాలి. పోనీ కొవిడ్ మూలంగా పార్లమెంట్ సమావేశాలు జరపడం లేదని చెప్పుకుందామనుకున్నా, గత సెప్టెంబర్‌లో కొవిడ్ సమయంలోనే ప్రభుత్వం సమావేశాలు నిర్వహించి వ్యవసాయ చట్టాలతో సహా అనేక చట్టాలను ఆమోదింపచేసుకుంది. దీన్నిబట్టి రైతుల ఆందోళన నేపథ్యంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరపలేకపోతున్నామని ప్రభుత్వం అంగీకరించిందనే అనుకోవాలి. మళ్లీ జనవరి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు జరిగేనాటికి పరిస్థితి కొలిక్కి వస్తుందనే గాంభీర్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. కొత్త సంవత్సరం ప్రవేశించే లోపు కొవిడ్ వాక్సిన్ గురించి ప్రచారం వంటి రకరకాల దృష్టిని మళ్లించే వ్యూహాల గురించి కూడా ప్రభుత్వం యోచిస్తోంది. రైతు సంఘాలను విడదీయడం, వాటికి మద్దతు నిచ్చే ప్రభుత్వాలను లొంగదీసుకోవడం వంటి వ్యూహాలు అమలు చేయడం ప్రారంభించింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతుల ఆందోళనను ఎదుర్కోవడానికి పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. దేశ వ్యాప్తంగా వందలాది సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున పుస్తకాల్ని, ప్రచార సామగ్రిని ముద్రించి పంపిణీ చేయడం మొదలు పెట్టారు. మోదీ తన వంతు ప్రచారాన్ని కచ్లో నిర్వహించారు. ప్రతిపక్షాలే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, తాను ప్రవేశపెట్టిన సాగు చట్టాల మూలంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. కేంద్రమంత్రులూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడం ద్వారా చట్టాలను వెనక్కి తీసుకోమనే అభిప్రాయాన్ని విస్పష్టీకరించారు.


ప్రచారం సరే, అదే సమయంలో రైతులను ఒప్పించేందుకు కూడా మోదీ ప్రభుత్వం మొండిగా కాకుండా నిజాయితీతో ప్రయత్నించాలి. సమస్యలు తలెత్తినప్పుడల్లా మనశ్శాంతికోసమో, ఆత్మవిశ్వాసం కోసమో గుజరాత్ వెళ్లడంలో కూడా తప్పేమీ లేదు. కాని ఇదే గుజరాత్‌కు చెందిన మహత్మా గాంధీ 1918లో ఖేడాలోనూ, ఉక్కుమనిషి సర్దార్ పటేల్ 1928లో బార్డోలీలోనూ పన్నులకు వ్యతిరేకంగా రైతాంగంతో సత్యాగ్రహాలు నిర్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధిక్కరించిన విషయం విస్మరించరాదు. అప్పుడు ప్రభుత్వమే వెనక్కు తగ్గి కమిషన్‌లు నియమించి సమస్యలను పరిష్కరించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్నది కూడా సత్యాగ్రహమేనని మోదీ అర్థం చేసుకుంటే దేశానికి శ్రేయస్కరం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-12-16T09:03:27+05:30 IST