Advertisement

పంత్‌ సారథ్యం.. ఢిల్లీ సమరోత్సాహం

Apr 8 2021 @ 00:21AM

గత ఐపీఎల్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అంచనాలను మించి రాణించి టోర్నీ ఫైనల్‌కు చేరింది. కానీ ముంబై చేతిలో ఓడి రన్నర్‌పతో సరిపెట్టుకుంది. నిరుటి ప్రదర్శనతో నిండైన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌కు సిద్ధమైన ఢిల్లీకి శ్రేయాస్‌ గాయంతో ఏకంగా టోర్నీకే దూరం కావడం ఊహించని పరిణామం. జట్టు మేనేజ్‌మెంట్‌ డైనమిక్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించింది. ఇటీవలి కాలంలో సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన పంత్‌ అదే జోరులో తన సారథ్యంలో ఢిల్లీకి తొలి టైటిల్‌ అందిస్తాడేమో చూడాలి.


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తెలివిగా వ్యవహరించింది. స్టీవ్‌ స్మిత్‌, టామ్‌ కర్రాన్‌, శామ్‌ బిల్లింగ్స్‌, ఉమేశ్‌ యాదవ్‌లాంటి అంతర్జాతీయ స్టార్లను కొనుగోలు చేసింది. తద్వారా బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో బలమైన బ్యాకప్‌ ఉండేలా చూసుకుంది. అపార అనుభవజ్ఞుడైన హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ సలహాలు, సూచనలు, పంత్‌ దూకుడైన సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ ఏడాది టైటిల్‌ రేస్‌లో బలంగానే దూసుకుపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

బలం 

టోర్నీలో తుది 11మందిలో అంతా భారత క్రికెటర్లతో బరిలోకి దిగగల ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. వీరిలో అశ్విన్‌, ధవన్‌, పృథ్వీ షా, పంత్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌ ఉండడం ఆ జట్టు ప్రత్యేకత. వీరుగాక ఇంటర్నేషనల్‌ క్రికెటర్లు రబాడ, శామ్‌ బిల్లింగ్స్‌, స్మిత్‌, స్టొయినిస్‌, హెట్‌ మయెర్‌, క్రిస్‌ వోక్స్‌, నోకియా, టామ్‌ కర్రాన్‌తో ఢిల్లీ అత్యంత పటిష్ఠంగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో ధవన్‌, పంత్‌ అదరగొట్టడం ఐపీఎల్‌కు ముందు ఢిల్లీ జట్టులో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతోంది. టీమిండియాకు మ్యాచ్‌ విన్నర్‌గా మారిన పంత్‌ అదే రీతిలో ఆడితే ఢిల్లీకి తిరుగుండబోదు. దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీలలో పరుగుల వరద పారించిన మరో యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా అదే జోరు కొనసాగిస్తే ఢిల్లీని అడ్డుకోవడం ప్రత్యర్థులకు సవాలే. కిందటి సీజన్‌లో ఆకట్టుకున్న స్టొయినిస్‌, హెట్‌ మయెర్‌తో ఢిల్లీ బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. అత్యంత బలీయంగా ఉన్న ఢిల్లీ స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌ విభాగాన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా శ్రమించాల్సిందే.


బలహీనత

రెగ్యులర్‌ కెప్టెన్‌ అయ్యర్‌ లేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బే. ధాటిగా ఆడే అతడు దూరం కావడం మిడిలార్డర్‌పై ప్రభావం చూపనుంది. ఇక..నలుగురు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం జట్టుకు తలనొప్పి కానుంది. ఇప్పటికే తుది జట్టు ఎంపికలో ఢిల్లీకి చిక్కులున్నాయి. స్మిత్‌, బిల్లింగ్స్‌ రాకతో అవి మరింత పెరగనున్నాయి.


జట్టు

భారత ఆటగాళ్లు: పంత్‌ (కెప్టెన్‌), ధవన్‌, పృథ్వీ షా, అజింక్యా రహానె, అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, లలిత్‌ యాదవ్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రవీణ్‌ దూబే, రిపల్‌ పటేల్‌, విష్ణు వినోద్‌, లుక్మన్‌ మేరీవాలా, ఎం.సిద్ధార్థ్‌.

విదేశీ ఆటగాళ్లు: స్టీవ్‌ స్మిత్‌, బిల్లింగ్స్‌, టామ్‌ కర్రాన్‌, హెట్‌ మయెర్‌, రబాడ, క్రిస్‌ వోక్స్‌, నోకియా, స్టొయినిస్‌.
ఢిల్లీ ఎవరితో ఎప్పుడు ?


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.