నన్ను CM అభ్యర్థిగా ప్రకటిస్తారనే.. : పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2022-06-04T08:39:40+05:30 IST

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సర్కారు ‘కోనసీమ’ జిల్లా పేరు వాడుకుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

నన్ను CM అభ్యర్థిగా ప్రకటిస్తారనే.. : పవన్‌ కల్యాణ్‌

  • కోనసీమలో సర్కారు చిచ్చు!
  • అంబేడ్కర్‌ పేరును ఎవరూ కాదనరు
  • కావాలనే ఆయన పేరు ముందుగా పెట్టలేదు
  • హఠాత్తుగా మార్చి గొడవలు సృష్టించే యోచన
  • కేంద్ర నిఘా హెచ్చరికలను పట్టించుకోలేదు
  • వైసీపీకి అన్ని వర్గాలూ దూరమవుతున్నాయి
  • ప్రజలు ఆ పార్టీని మళ్లీ గెలిపించరు
  • ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోతాను
  • వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను: పవన్‌
  • బీజేపీ నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఎవరైనా ఆశ పడుతున్నారేమో!
  • నాతో ఎవరూ మాట్లాడలేదు.. పవన్‌ కల్యాణ్‌ స్పష్టీకరణ


అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సర్కారు ‘కోనసీమ’ జిల్లా పేరు వాడుకుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. అధికారపక్షానికి చెందిన వర్గ పోరాటాన్ని... కులాల మధ్య చిచ్చుగా మార్చారని మండిపడ్డారు. వైసీపీకి అన్ని వర్గాలు దూరమవుతున్నాయని... జగన్‌ ఒంటరిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ‘‘రోజూ భయంతో బతకాలని ఎవరూ అనుకోరు. అందుకే... వైసీపీని ప్రజలు మరోసారి గెలిపించరు’’ అని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయం పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు.


నాతో మాట్లాడలేదు..!

పొత్తు నేపథ్యంలో... తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందనేది ఎవరి ఆశ అయినా కావొచ్చునని పవన్‌ వ్యాఖ్యానించారు. తనకు మాత్రం అలాంటి ఆశ లేదన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ... ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ... ‘‘ఒంటరిగా పోటీ చేసే మీకు... ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు?’’ అని పవన్‌ ప్రశ్నించారు. 


‘కోనసీమ’ చిచ్చు పెట్టింది ప్రభుత్వమే...

‘‘కోనసీమలో అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని కేంద్ర నిఘావర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందస్తుగా హెచ్చరించాయి. అయినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ముందుగానే ప్రకటించడంవల్లే... ఈ ప్రాంతానికి చెందిన వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌ ఉన్నా, ప్రజలు ఎన్టీఆర్‌ పేరును ఆమోదించారు. జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల విషయంలో అభిప్రాయ బేధాలుంటాయి. అందుకే... ప్రభుత్వం ప్రజల నుంచి 30 రోజులు అభ్యంతరాలు స్వీకరించింది. అంబేడ్కర్‌ పేరును ఎవరూ వ్యతిరేకించరు. కానీ... కోనసీమ జిల్లాకు ప్రభుత్వం ముందే అంబేడ్కర్‌ పేరు పెట్టలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టి విభజించాలనే ఆలోచనతో... అకస్మాత్తుగా అంబేడ్కర్‌ పేరు పెట్టారు’’ అని పవన్‌ ఆరోపించారు. కోనసీమలో జరిగిన విధ్వంసాన్ని సీఎం జగన్‌ ఇప్పటిదాకా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సహచర మంత్రి పినిపె విశ్వరూప్‌, వెనుకబడిన కులానికి చెందిన ఎమ్మెల్యే సతీశ్‌ల ఇళ్లకు నిప్పుపెడితే.. జగన్‌ స్వయంగా వెళ్లి ఎందుకు పరిశీలించలేదని నిలదీశారు.  ‘‘కోనసీమ అల్లర్లకు సంబంధించి మాట్లాడేందుకు డీజీపీ సమయం కోరాను. కానీ... ఆయనపై ఏం ఒత్తిడిఉందో తెలియదుకానీ, కలిసే అవకాశం ఇవ్వడంలేదు. శనివారం ఉదయం 10.30 వరకు వేచిచూసి... అప్పటికీ డీజీపీ అనుమతి ఇవ్వకపోతే నేరుగా అమిత్‌షా దృష్టికి తీసుకెళతాను’’అని చెప్పారు.


వైసీపీకి దూరమవుతున్న వర్గాలు... 

2019లో సమాజంలోని అన్ని కులాలూ మతాలూ కలసి ఓటేస్తేనే వైసీపీకి 151 స్థానాలు దక్కాయని పవన్‌ పేర్కొన్నారు. కానీ... జగన్‌ వర్గ రాజకీయాలు చేస్తూ ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నారని తెలిపారు. వైసీపీకి కమ్మ, కాపు, బీసీ వర్గాలు ఇప్పటికే దూరమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా దూరమవుతున్నాయని... చివరికి జగన్‌ ఒంటరిగా మిగులుతారని పవన్‌ పేర్కొన్నారు. 


- వైఎస్‌ఆర్‌సీపీ అంటే... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్‌ పార్టీ! కానీ... యువజనులకు ఉద్యోగాలు లేకుండా చేసింది. శ్రామికులకు ఉపాధి పోయింది. రైతులకు కనీస మద్దతు ధర లేకుండా, కౌలు రైతులకు కార్డులు లేకుండా చేసింది. తన పార్టీ పేరులో ఉన్న వర్గాలకే న్యాయం చేయని జగన్‌ ఇంకెవరికి చేస్తారు?


- వైసీపీ హయాంలో పోలవరంతో సహా ఏ ప్రాజెక్టులూ పూర్తి కావు. కేంద్ర నిధులను ఇతర పద్దులకు మళ్లిస్తుంటే... పోలవరం ఎలా పూర్తవుతుందని కేంద్రపెద్దలు నాతో అన్నారు.


- వైసీపీ నేతలు అందరినీ కొడుతున్నారు. ఇరిగేషన్‌ ఇంజనీరును, ఆర్డీవోను కొట్టడంలో ఆశ్చర్యమేముంది!? వైసీపీ అధ్యక్షుడే ఒకప్పుడు పులివెందులలో ఒక పోలీసు అధికారిని కొట్టినట్లు మానవ హక్కుల నివేదికలో ఉంది. 

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - 2022-06-04T08:39:40+05:30 IST