భారత్‌‌కు ఎస్-400 ఆయుధ వ్యవస్థల బట్వాడా ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-14T21:11:40+05:30 IST

ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణి

భారత్‌‌కు ఎస్-400 ఆయుధ వ్యవస్థల బట్వాడా ప్రారంభం

న్యూఢిల్లీ : ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ  ఎస్-400 ట్రయంఫ్‌ను భారత్‌కు బట్వాడా చేయడం ప్రారంభించినట్లు రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (ఎఫ్ఎస్ఎంటీసీ) దిమిత్రి షుగయేవ్ చెప్పారు. షెడ్యూలు ప్రకారం వీటిని భారత్‌కు అందజేస్తున్నామని తెలిపారు. 


దుబాయ్ ఎయిర్‌షో ప్రారంభానికి ముందు షుగయేవ్ రష్యన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్‌కు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరఫరా ప్రారంభమైందన్నారు. షెడ్యూలు ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. 


సుదీర్ఘ పరిధిలో శత్రు విమానాలను, క్రూయిజ్ మిసైల్స్‌ను దీటుగా తిప్పికొట్టే సామర్థ్యం ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌ వల్ల లభిస్తుంది. ఎస్-400 మొదటి యూనిట్‌ను భారత వాయు సేన లడఖ్ సెక్టర్‌లో మోహరిస్తుంది. ఈ ప్రాంతంలో చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది అత్యంత కీలక పరిణామం. పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే సవాళ్ళను తిప్పికొట్టేందుకు వీలుగా వీటిని మోహరిస్తారని తెలుస్తోంది. చైనా ఇప్పటికే  టిబెట్‌లో రెండు ఎస్-400 స్క్వాడ్రన్లను మోహరించింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వెంబడి న్గరి గర్ గున్సా, న్యింగ్చి వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించింది. 


రూ.35,000 కోట్లతో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ సేకరిస్తోంది. వైమానిక, సముద్ర మార్గాల్లో ఈ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. మొదటి స్క్వాడ్రన్ బట్వాడా ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని తెలుస్తోంది. 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, క్రూయిజ్ మిసైల్స్‌ను తిప్పికొట్టేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.


Updated Date - 2021-11-14T21:11:40+05:30 IST