పనిచేయని కంప్యూటర్‌లు

ABN , First Publish Date - 2022-08-08T05:40:35+05:30 IST

పేరుకే బ్రాండెడ్‌ కంపెనీ.. ఆరు నెలలు పూర్తి కాకుండానే కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

పనిచేయని కంప్యూటర్‌లు

ఐదు నెలలకే కంప్యూటర్లు ‘డల్‌’ !
రైతు భరోసా సేవలకు తప్పని ఇబ్బందులు
సాంకేతిక సమస్యలతో సతమతం
నాణ్యతా ప్రమాణాలపై విమర్శలు  
పట్టించుకోని అధికారులు


భీమవరం, ఆగస్టు 7 : పేరుకే బ్రాండెడ్‌ కంపెనీ.. ఆరు నెలలు పూర్తి కాకుండానే కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా సేవలకు సహకార సంఘాలలో సేవలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ సేవలకు ఉన్న కంప్యూటర్లు పనిచేయక పోవడంతో ఇతర కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా పనులు చేపట్టే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు గ్రామాలలో సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సేవల కోసం సహకార సంఘాలకు ఉమ్మడి జిల్లాలో సుమారు 150 కంప్యూటర్లను ఏర్పాటు  చేశారు. ప్రముఖ బ్రాండ్‌ ‘డెల్‌’ కంప్యూటర్లను హైదరాబాద్‌కు చెందిన బృహస్పతి టెక్నాలజీ సంస్థ ద్వారా ఈ ఏడాది మార్చిలో సరఫరా చేశారు. ఈ కంప్యూటర్లు ఏర్పాటు చేసి సుమారు ఐదు నెలలు దాటింది. కొంతకాలంగా వీటి పనితీరు సరిగా లేకపోవడంతో సహకార సంఘాల్లో అధికారులు వీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. చాలాచోట్ల మరమ్మతులకు గురవుతున్నాయి. బ్రాండెడ్‌ కంపెనీ కంప్యూటర్లు ఇంత తక్కువ సమయంలోనే మరమ్మతులకు రావడంతో నాణ్యత ప్రమాణాలపై విమర్శలకు దారి తీస్తున్నాయి. పట్టించుకోని అధికారులు, తక్కువ సమయంలోనే మరమ్మతులకు గురైన కంప్యూటర్లను మార్కెటింగ్‌శాఖ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెటింగ్‌ సంస్థ కానీ, సహకారశాఖ కానీ వీటి మరమ్మతులపై దృష్టి సారించడం లేదు. దీంతో కంప్యూటర్లును ఆయా సొసైటీల్లో మూలనపారేసి ఉంచారు.

Updated Date - 2022-08-08T05:40:35+05:30 IST