బెజవాడ... బెనారస్‌ విమానానికి డిమాండ్‌

ABN , First Publish Date - 2021-01-11T06:40:56+05:30 IST

కొవిడ్‌ అన్‌లాక్‌ల తర్వాత వారణాసికి విమానం నడపాలన్న ప్రత్యేక డిమాండ్‌ నగరంలోని వస్త్ర వ్యాపారుల నుంచి వస్తోంది.

బెజవాడ... బెనారస్‌ విమానానికి డిమాండ్‌

పెద్ద ఎత్తున వస్త్ర దిగుమతులే కారణం 

వస్త్ర వ్యాపారుల నుంచి విజ్ఞప్తుల వెల్లువ 

వారణాసికి విమానం నడపాలని

విమానయాన సంస్థలకు ఏఏఐ ప్రతిపాదనలు 


బెనారస్‌.. దేశంలోని అన్ని ప్రాంతాల వస్త్ర వ్యాపారులను తనవైపు తిప్పుకున్న పట్టు చీరల వర్తక కేంద్రం. విజయవాడ వస్త్ర వ్యాపారులెందరో బెనారస్‌కు క్యూలు కడుతున్నారు. వారంతా అక్కడికి ప్రత్యేకంగా విమానం నడపాలని డిమాండ్‌ చేసుక్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

కొవిడ్‌ అన్‌లాక్‌ల తర్వాత వారణాసికి విమానం నడపాలన్న ప్రత్యేక డిమాండ్‌ నగరంలోని వస్త్ర వ్యాపారుల నుంచి వస్తోంది. ఈ మేరకు విమానాశ్రయ అధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి వారణాసికి విమానం నడపాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అధికారులు విమానయాన సంస్థలకు నివేదించారు. అతి త్వరలోనే ఆయా సంస్థలు తమ ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

విజయవాడ - వారణాసి విమానం డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కాశీయాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్‌ వచ్చిందని విమానాశ్రయ అధికారులు భావించారు. గత ప్రభుత్వ హయాంలో వారణాసికి ప్రత్యేక విమానం నడిచింది. స్పైస్‌జెట్‌ సంస్థ అప్పట్లో వారానికి ఒకసారి వారణాసికి విమానం నడిపేది. వారణాసి ఫ్లైట్‌కు అప్పట్లో సగటు ఆక్యుపెన్సీ 70 - 80 వరకు ఉండేది. యాత్రికుల నుంచి భారీగా డిమాండ్‌ ఉందని అప్పట్లో ఎయిర్‌పోర్టు అధికారులు భావించేవారు. వాస్తవంగా ఈ డిమాండ్‌ యాత్రికుల నుంచి కంటే, నగరంలోని వస్త్ర వ్యాపారుల నుంచి ఉందన్నది తాజాగా తెలుస్తోంది. ఎంతో డిమాండ్‌ ఉన్నప్పటికీ, స్పైస్‌జెట్‌ సంస్థ వారణాసికి సర్వీసును రద్దు చేసుకుంది. తాజాగా వస్త్ర వ్యాపారులు వారణాసికి విమానాలు నడపాలని విమానాశ్రయ అధికారులకు విజ్ఞప్తులు చేయటంతో ఈ అంశం మళ్లీ ముందుకొచ్చింది. ప్రతి వారం సరుకు దిగుమతుల కోసం నగరంలోని వస్త్ర వ్యాపారులు బెనారస్‌ వెళుతుంటారని విమానాశ్రయ అధికారులతో జరిపిన సంప్రదింపుల ద్వారా తెలిసింది. 


విజయవాడ అంటే రవాణా రంగానికి, విద్య, వర్తక వాణిజ్య రంగాలకు పేరు. వాణిజ్యంలో వస్త్ర రంగానికి ప్రత్యేక స్థానం ఉంది. వస్త్రలత వ్యాపారులతో పాటు భారీ క్లాత్‌ మర్చంట్స్‌, క్లాత్‌ మార్కెట్స్‌ నిర్వాహకులు, వస్త్ర షోరూమ్‌ల నిర్వాహకులు పెద్ద ఎత్తున బెనారస్‌ నుంచే సరుకు దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బెనారస్‌లో తక్కువ ధరకు వస్ర్తాలు లభించటమే దీనికి కారణం. వారానికి ఒకసారి బెనారస్‌ వెళ్లి అక్కడ బల్క్‌ ఆర్డర్స్‌ బుక్‌ చేయటం ద్వారా వస్త్ర దిగుమతులు జరుగుతుంటాయి. మోటారు ట్రాన్స్‌పోర్ట్‌, రైళ్ల ద్వారా ఈ దిగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రైల్వే గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా రవాణా ప్రస్తుతం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా వస్త్ర వ్యాపారులు భావిస్తున్నారు. అందుకే వారణాసికి విమానాన్ని నడపాలని వస్త్ర వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వస్త్ర వ్యాపారుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఏఏఐ అధికారులు విజయవాడ నుంచి వారణాసికి ఉన్న డిమాండ్‌ను విమానయాన సంస్థలకు వివరించారు. వారణాసికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తగిన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరుతున్నారు. పలు విమానయాన సంస్థల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం వస్త్ర వ్యాపారుల నుంచి వస్తున్న డిమాండ్‌ ద్వారా ఒకవైపు విమానయానం, మరోవైపు కార్గో రవాణాకు కూడా డిమాండ్‌ ఏర్పడనుంది. అధికారికంగా షెడ్యూల్‌ను ఏ సంస్థ ప్రకటిస్తుందా అన్నది ఆసక్తిగా ఉంది. 

Updated Date - 2021-01-11T06:40:56+05:30 IST