ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన యువత

ABN , First Publish Date - 2022-03-13T08:45:04+05:30 IST

ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా 2.35 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విద్యార్థి యువజన సంఘాలు విజయవాడలో...

ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన యువత

జాబ్‌ క్యాలెండర్‌ కోసం డిమాండ్‌ 

విజయవాడలో నిరసన ప్రదర్శన 


విజయవాడ(విద్యాధరపురం), మార్చి 12: ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా 2.35 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విద్యార్థి యువజన సంఘాలు జరిపాయి. ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకుని, సంఘాల కార్యకర్తలను విచక్షణా రహితంగా ఈడ్చిపడేశారు. అరెస్టుల సమయంలో పోలీసులకు, సంఘాల నాయకులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ప్రదర్శనలకు అనుమతి లేదంటూ సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేసి దూర ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషన్లకు తరలించారు. పీడీఎ్‌సయు రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌ గోపాల్‌, ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌, పీడీఎ్‌సయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామమోహన్‌, తెలుగు యువ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్‌, ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.


నిరసన ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రకటించిన మేరకు 60 వేల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గత జూన్‌ 18న ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌కు కూడా నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రచారం చేసుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన జగన్‌ నిరుద్యోగులను మాత్రం మోసం చేశాడన్నారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


సర్కార్‌ ఆట కటిస్తాం: బ్రహ్మంచౌదరి

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): అధికారం కోసం 2.30 లక్షల ఉద్యోగాలిస్తానన్న జగన్‌రెడ్డి.. ఇప్పుడు కేవలం 60వేల ఖాళీలే ఉన్నాయని అసెంబ్లీలో చెప్పడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 2.30లక్షల ఉద్యోగాలతో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే నిరుద్యోగ, యువజన సంఘాలతో మాట తప్పిన జగన్‌రెడ్డి సర్కార్‌ ఆట కట్టిస్తామని హెచ్చరించారు. 

 

జాబ్‌ అడిగితే జైల్లో పెడతారా?

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్న విద్యార్థులు, యువజనులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టులు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. జాబ్‌ నోటిఫికేషన్‌ అడిగితే జైల్లోపెడతారా? అని ప్రశ్నించారు. విద్యార్థి, యువజన,  నిరుద్యోగ సంఘాల ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ముందు రోజునుంచే పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ విద్యార్థి, యువజన సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారని మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో పోలీసులు మోహరించి  నిరుద్యోగులను అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు.  తెలంగాణ ప్రభుత్వం 80వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, మన ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచి యువత భవితను ప్రశ్నార్థకం చేసిందన్నారు. జగన్‌కు చిత్తశుద్ది ఉంటే తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-03-13T08:45:04+05:30 IST