రెమ్‌డెసివర్‌కు డిమాండ్‌

ABN , First Publish Date - 2021-04-23T05:26:51+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న చికిత్సలో కీలక ఔషధంగా వినియోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌కు జిల్లాలో డిమాండ్‌ ఏర్పడింది.

రెమ్‌డెసివర్‌కు డిమాండ్‌

మార్కెట్‌లో రూ.2500కు విక్రయించాలన్న ప్రభుత్వం

అడ్డదారుల్లో రూ.10 వేలు, అంతకు మించి ధరకు అమ్ముతున్న వైనం

బ్లాక్‌ మార్కెట్‌కు అధికారుల చెక్‌

ఆస్పత్రులకే నేరుగా సరఫరా చేసేలా చర్యలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

కొవిడ్‌ వైరస్‌ సోకిన వారికి అందిస్తున్న చికిత్సలో కీలక ఔషధంగా వినియోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌కు జిల్లాలో డిమాండ్‌ ఏర్పడింది. ఆస్పత్రుల్లో చేరిన రోగుల్లో ఎక్కువమందికి ఈ ఇంజక్షన్‌ ఇచ్చేందుకు వైద్యులు ఆసక్తి చూపిస్తుండడంతో డిమాండ్‌ మరింత పెరిగింది. ఇదే అదనుగా కొంతమంది దళారులు దీనిని అడ్డదారుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంజక్షన్‌ ఒక వైల్‌ ధర రూ.2500కు మించి విక్రయిం చరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే కొంతమంది రోగుల అవసరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, అంతకుమించి కూడా విక్రయిస్తున్నారు. నగర పరిధిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్‌న బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించిన ఉదంతం విజిలెన్స్‌ సోదాల్లో వెలుగుచూసింది. దీంతో ఈ తరహా వ్యవహారాలు ఇంకెన్ని జరుగుతున్నాయోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెమెడెసివర్‌ ఇంజక్షన్‌ బహిరంగ మార్కెట్‌లోకి వెళ్లకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మెడికల్‌ స్టోర్స్‌, స్టాక్‌ పాయింట్లకు వీటిని సరఫరా చేసేవారు. అక్రమాలు చోటుచేసుకుంటుండడంతో నేరుగా ఆస్పత్రులకే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా ఆస్పత్రుల్లో ఎంతమంది వైరస్‌ బాధితులున్నారు, వారిలో ఎంతమందికి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ అవసరమో..ఆస్పత్రి అధికారులు నేరుగా ఇండెంట్‌ పెడితే...వారికే సరఫరా చేసేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు ్లచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులకు అందించేందుకు సుమారు మూడు వేల రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు పెట్టే ఇండెంట్లకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ ఇంజక్షన్లు తెచ్చుకోవాలని రోగుల బంధువులను ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ఆస్పత్రులే తమకు విషయాన్ని తెలియజేస్తే అందించే ఏర్పాటుచేస్తామని జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు స్పష్టంచేస్తున్నారు. 


వీరికి మాత్రమే ఇవ్వాలి.. 

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను కొవిడ్‌ బారినపడిన ప్రతి ఒక్కరికీ ఇవ్వకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ బారినపడి మోడరేట్‌, సివియర్‌ దశలో వున్న బాధితులకు దీనిని అందించడం వల్ల కొంత ఫలితం ఉంటుందని, అది కూడా వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి ఉపయోగపడదని, ఆస్పత్రిలో వుండే వ్యవధిని తగ్గించడానికి మాత్రమేనంటున్నారు. ముఖ్యంగా సీటీ స్కాన్‌లో తేడా ఉన్నా, ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతున్నా, ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌ పెరుగుతున్నా..ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలని సూచిస్తున్నారు.  


మ్యాజిక్‌ చేయదు.. 

వైరస్‌ బారినపడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు ఈ ఇంజక్షన్‌ ఇవ్వడం వల్ల వేగంగా కోలుకునే పరిస్థితి ఉండదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో వున్నవారు వేగంగా కోలుకునే అవకాశముంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇతర మందుల మాదిరిగానే దీనినీ కొవిడ్‌ వైద్యంలో వినియోగిస్తున్నామని, మ్యాజిక్‌ డ్రగ్‌ కాదని స్పష్టం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. 


నేరుగా ఆస్పత్రులకే సరఫరా

- రజిత, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి 

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌కు తీవ్రమైన డిమాండ్‌ ఏర్పడింది. మొన్నటివరకు అతి కొద్దిమందికి మాత్రమే అవసరమైన ఈ ఇంజక్షన్‌ ఇప్పుడు చాలామందికి అవసరమ వుతోంది. ఇదే అదనుగా కొంతమంది అడ్డదారుల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు వీలుగా నేరుగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాం. ఆస్పత్రుల ఇండెంట్‌ను బట్టి అందిస్తాం. దీనివల్ల అనవసరపు వృఽథాను అరికట్టవచ్చు. 

Updated Date - 2021-04-23T05:26:51+05:30 IST