సన్నాలకు డిమాండ్‌!

ABN , First Publish Date - 2021-04-14T06:01:21+05:30 IST

జిల్లా లో పండిన సన్నరకం ధాన్యంపై వ్యాపారులు దృష్టిపెట్టారు. ఏ పీ, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వ్యాపారులు వస్తున్నారు.

సన్నాలకు డిమాండ్‌!


కర్ణాటక, ఏపీ వ్యాపారుల దృష్టి

రైతుల పొలాల వద్దనే కొనుగోలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లా లో పండిన సన్నరకం ధాన్యంపై వ్యాపారులు దృష్టిపెట్టారు. ఏ పీ, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. జిల్లాలోని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. తమ ప్రాంతాలకు లారీల ద్వారా తీసుకెళ్తున్నారు. మద్దతు ధర కన్నా తక్కువగా వస్తున్న వరి కోసిన రోజే పొలాల వద్ద రైతులు ఈ ధాన్యం అమ్మకాలు చేస్తున్నారు. 

జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా.. 

జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా బోధన్‌ డివిజన్‌ పరిధిలోని వర్ని, కోటగిరి, రుద్రూర్‌, ఎడపల్లి, రెంజల్‌ మండలాల పరిధిలో ఈ సన్నరకాలను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా గంగా కావేరి, బాపట్ల, జైశ్రీరాంతో పాటు ఇతర సన్న రకాలను వానాకాలం, యాసంగి సీజన్లలో సాగు చేస్తున్నారు. ప్రతీ సీజన్‌లో సన్నరకాలు పండించే రైతులు ఎక్కువగా ప్రైవేటుగానే అమ్మకాలు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం సన్నాలు బీ గ్రేడ్‌కు వస్తుండడంతో రైతులు వ్యాపారులకే అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో పండించే సన్నాలను గడిచిన కొన్నేళ్లుగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌, బళ్లారి, ఏపీలోని గుంటూర్‌, కృష్ణ, రాష్ట్రంలోని సూర్యాపేట్‌, మిర్యాలగూడకు చెందిన రైస్‌ మిల్లుల యజమానులు వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రైతులు వరి కోసం రోజే వ్యాపారులు పొలాల వద్దకు వచ్చి ధాన్యం కొంటున్నారు. 

మద్దతు ధర కంటే తక్కువే..

మార్కెట్‌లో సన్న బియ్యానికి భారీగా ధర ఉన్నా వ్యాపారులు మాత్రం మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నా రు. సన్నరకం ధాన్యం క్వింటాలు రూ.1450 నుంచి రూ.1550 మధ్య కొంటున్నారు. సాధారణ రకం మద్దతు ధర క్వింటాలు రూ.1868 ఉన్నా వ్యాపారులు ఎక్కువగా పెట్టడంలేదు. రైతులు కూడా వరి కోసిన రోజే ధాన్యాన్ని వ్యాపారులకు అమ్ముతున్నారు. కొంతమంది రైతులు వ్యాపారులతో ముందే మా ట్లాడుకొని కోతలు చేస్తున్నా రు. పొలాల వద్దనే వాహనాల కిరాయి, హమాలీ కిరా యి, గన్నీ బ్యాగుల ఇబ్బందులు లేకుండా కొనడంతో పాటు వారే అన్ని పనులు చేస్తుండడంతో రైతులు అమ్మకాలు చేస్తున్నారు. కోసిన రోజే అమ్మడంతో ధాన్యం పచ్చిగా ఉండడం, తూకం ఎక్కువ రావడంతో ధర తక్కువైనా కలిసి వస్తుందని రైతులు భావిస్తున్నారు. 

15 రోజుల్లో డబ్బులు..

వ్యాపారులలో కూడా ధాన్యం కొన్నరోజే సగం డబ్బులు ఇవ్వడంతో పాటు మిగలినవి వారం 15 రోజుల్లోగా ఇస్తుండడంతో మొగ్గుచూపుతున్నారు. సన్నరకాలు పండించిన రైతులు ఎక్కువగా వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. కేంద్రాలకు తీసుకెళ్తే ఎండబోసి తీసుకురావాలని కోరడం, తేమ పేరుతో తరుగు ఎక్కువ తీయడంతో మద్దతు ధర వచ్చినా వ్యాపారులకు అమ్మిన విధంగానే ఉంటుందని వర్ని మండలానికి చెందిన రైతులు తెలిపారు. వ్యాపారులు ఏవీ చూడకుండా కోతల రోజే కొనడం, హమాలీతో పాటు ఏ చార్జీలు తీసుకోకపోవడం, వారే మందిని తీసుకువచ్చి బస్తాలు నింపి తీ సుకెళ్లడంతో తమకు కలిసి వస్తుందని రైతులు తెలిపారు. ఏళ్లతరబడి అ క్కడి వ్యాపారులు వస్తుండడం తో ఈ సన్నాలను అమ్ముతున్నట్లు తెలిపారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన సన్నాలు పండించిన రైతులు ఎక్కువగా ప్రైవేట్‌కే అమ్ముతున్నారని పౌరసరఫరాలశాఖ అధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌ తెలిపారు. దొడ్డు రకాలను మాత్రమే కేంద్రాలకు తెస్తున్నారని తెలిపారు. కేంద్రాలలోమాత్రం సన్నాలు మద్దతు ధరకు కొంటున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-04-14T06:01:21+05:30 IST